తల్లి పాల అమృతం

ABN , First Publish Date - 2021-08-03T05:30:00+05:30 IST

కొవిడ్‌ కాలం కొనసాగుతోంది. కొత్తగా తల్లయిన మహిళల్లో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగినులు

తల్లి పాల అమృతం

తల్లి పాలు బిడ్డకు అమృతసమానం! కొవిడ్‌ కాలం పాలిచ్చే తల్లుల్లో లెక్కలేనన్ని భయాలు, అనుమానాలకు తెరలేపింది!బిడ్డకు వెలకట్టలేని పోషకాలను అందించే తల్లిపాల చుట్టూ బోలెడన్ని అపోహలు అలుముకున్నాయి!తల్లీబిడ్డల బంధాన్ని దృఢం చేసే చనుపాలు పట్టించే పద్ధతులు, నిల్వ చేసే విధానాల గురించి వైద్యుల వివరణ ఇది!


కొవిడ్‌ కాలం కొనసాగుతోంది. కొత్తగా తల్లయిన మహిళల్లో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగినులు ఉంటారు. ఇంటిపట్టునే వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నవాళ్లూ ఉంటారు. ఓ పక్క ఆఫీసు పని, మరో పక్క ఇంటి పని, ఇంకో పక్క బిడ్డ పోషణ. గంట గంటకూ బిడ్డ పాల కోసం ఏడుస్తూ ఉంటే వాడి ఆకలి తీర్చేదెలా? అసలు తానిచ్చే పాలు బిడ్డకు సరిపోతున్నాయా? రోజులో ఎన్ని సార్లు పాలివ్వాలి? ఇలాంటి సందేహాలతో కొత్తగా తల్లయిన మహిళలు అయోమయానికి గురవుతూ ఉంటారు.


మరీ ముఖ్యంగా కొవిడ్‌ సోకిన మహిళల్లో పాల ద్వారా బిడ్డకు ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందేమోననే భయాలు ఎక్కువ. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్‌ అనుమతి లభించినా, బిడ్డకు పాలిస్తున్నంత కాలం వ్యాక్సిన్‌కు దూరంగా ఉండడమే మేలనే ఆలోచనతో ఉంటున్నారు. నిజానికి గర్భిణిగా ఉన్న సమయంలో వ్యాక్సిన్‌ తీసుకోగలిగితే, ప్రసవ సమయానికి కొవిడ్‌ సోకే పరిస్థితి తప్పుతుంది. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకడం మూలంగా శరీరంలో తయారయ్యే యాంటీబాడీల కంటే వ్యాక్సిన్‌తో తయారయ్యే యాంటీబాడీల మోతాదు ఎక్కువ. గర్భిణులు వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు, ప్లాసెంటా ద్వారా గర్భంలోని బిడ్డకు ఇవి చేరుకుంటాయి. పాలిచ్చే తల్లుల్లో చనుపాల ద్వారా ఇవి బిడ్డకు అందుతాయి. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులూ తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేయించుకోవాలి.




బిడ్డ పదే పదే ఏడుస్తుంటే?

పుట్టినప్పుడు బిడ్డ జీర్ణాశయం గోళీ అంత చిన్న పరిమాణంలో ఉంటుంది. వారానికి రేగు పండంత, 20 రోజులకు నిమ్మ పండు పరిమాణానికి సాగుతుంది. కాబట్టే పుట్టిన వెంటనే ఉత్పత్తయ్యే 5 నుంచి 7 మిల్లీలీటర్ల చనుపాలు బిడ్డ ఆకలిని తీర్చగలుగుతాయి. బిడ్డ పెరిగే వయసుతో పాటు ఆకలి పెరుగుతూ ఉంటుంది. దానికి తగ్గట్టే తల్లుల్లో పాల పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. రోజుల వయసు బిడ్డకు చిన్న జీర్ణాశయం ఉంటుంది.


కాబట్టి తాగిన కొద్దీ పాలు త్వరత్వరగా జీర్ణమైపోతూ బిడ్డ గంట గంటకూ ఏడుస్తూ ఉంటుంది. అలాంటప్పుడు తల్లులు బిడ్డకు పాలు సరిపోవడంలేదేమో అని అనుకుంటూ ఉంటారు. నిజానికి బిడ్డ పొట్ట పరిమాణాన్ని బట్టి తల్లులు అవసరాన్ని బట్టి పలుమార్లు పాలు పట్టిస్తూ ఉండాలి. బిడ్డ ఆకలికి తగినట్టు తల్లుల్లో పాల ఉత్పత్తి సహజసిద్ధంగానే పెరుగుతూ ఉంటుంది. పుట్టిన తొలినాళ్లలో బిడ్డకు ఎలాంటి పోషకాలు అవసరమో అవే తల్లి పాలలో తయారవుతాయి. పెరిగే క్రమంలో నెలలవారీగా బిడ్డకు అవసరమైన పోషకాలకు తగ్గట్టుగా తల్లి పాలల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే పాలివ్వడం ద్వారా పాల ఉత్పత్తి కూడా పెరుగుతూ ఉంటుంది. పాలివ్వడం వల్ల తల్లులకూ ఆరోగ్యపరంగా లాభాలుంటాయి. శరీరంలోని కొవ్వు కరిగి గర్భంతో పెరిగిన బరువు తగ్గి, చక్కటి శరీరాకృతి దక్కుతుంది. పాలిచ్చే తల్లుల్లో రొమ్ము కేన్సర్‌, ఒవేరియన్‌ కేన్సర్‌ ప్రమాదం తగ్గుతుంది. 


తల్లి పాలు లోపిస్తే...

తల్లి పాలు లోపించిన పిల్లలు భవిష్యత్తులో శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు, డయేరియా మొదలైన ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టే పాలివ్వలేనంత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగిన తల్లులు మినహా ప్రతి మహిళా ప్రసవించిన వెంటనే బిడ్డకు పాలివ్వడం ఎంతో అవసరం. సిజేరియన్‌ ఆపరేషన్‌ అయిన తల్లులు సైతం సర్జరీ ముగిసిన అరగంట లోపే బిడ్డకు పాలివ్వవలసి ఉంటుంది. 


తొలి పదిహేను రోజులు కీలకం!

చనుపాలతో తల్లీబిడ్డల అనుబంధం బలపడుతుంది. అయితే పసికందులకు పాలు తాగే పద్ధతిని తల్లులే నేర్పించాలి. చనుమొనల చుట్టూ ఉండే ఏరియోలా అనే నల్లని ప్రదేశం చుట్టూ బిడ్డ పెదవులు చుట్టుకునేలా బిడ్డకు పాలు తాగడం అలవాటు చేయాలి. ఆ పద్ధతిలోనే బిడ్డ నోట్లోకి పాలు చక్కగా చేరుకుంటాయి. బిడ్డ కూడా సరిపడా శక్తితో పాలను పీల్చుకోగలుగుతాడు. ఇలాంటి సక్కింగ్‌ రిఫ్లెక్స్‌ సక్రమంగా ఏర్పడితే తల్లి శరీరంలో ప్రొలాక్టిన్‌ అనే పాల తయారీకి తోడ్పడే హార్మోన్‌ సరిపడా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. రొమ్ముల్లో ఉన్న పాలన్నిటినీ బిడ్డ తాగినకొద్దీ తిరిగి శరీరం తెలివిగా బిడ్డ ఆకలికి సరిపడా పాలను వెంటనే తయారుచేయడం మొదలుపెడుతుంది. కాబట్టి బిడ్డకు అసంపూర్తిగా కాకుండా ఒక వైపు 15 - 20 నిమిషాలు, రెండో వైపు 15 - 20 నిమిషాలు మార్చి మార్చి పాలు పట్టించాలి. 


రొమ్ముల్లో సలపరం, ఇన్‌ఫెక్షన్‌!

కొంతమంది మహిళలకు పాలిచ్చే పద్ధతి గురించి అవగాహన ఉండదు. చనుమొనలనే పీల్చుకునేలా పిల్లలకు అలవాటు చేయడం వల్ల చనుమొనలు చిట్లి నొప్పి మొదలవుతుంది. దాంతో ఆ వైపు పాలివ్వడం మానేస్తారు. దాంతో రొమ్ముల్లో పాలు నిండుకుని, గడ్డకట్టి ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి. ఇలా జరగకుండా ప్రారంభంలోనే నిప్‌ కేర్‌ ఆయింట్‌మెంట్లు, నిపుల్‌ షీల్డ్‌ వాడాలి.


మరికొంతమంది మహిళల్లో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండి, పిల్లలు తాగినా రొమ్ములు నిండుకుంటూనే ఉంటాయి. ఇలాంటివాళ్లు అదనపు పాలను పిండేయాలి. ఐదారుగంటలు పాలు రొమ్ముల్లో నిల్వ ఉండిపోతే ఇన్‌ఫెక్షన్‌ మొదలవుతుంది. అయితే పిండిన పాలు వృథా కాకుండా మిల్క్‌ బ్యాంకుకు దానం చేయవచ్చు. ఒకవేళ రొమ్ముల్లో పాల గడ్డలు ఏర్పడితే ప్రారంభంలో పాలను బ్రెస్ట్‌ పంప్‌తో పిండేసి, వేడి కాపడం పెట్టడం ద్వారా, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రంగా ఉంటే మందులతో సమస్యను అదుపులోకి తీసుకురావచ్చు.


మిల్క్‌ బ్యాంకులకు దానం చేయవచ్చు  

పీడియాట్రిక్‌ స్పెషాలిటీ కలిగిన హైదరాబాద్‌లోని నీలోఫర్‌, ఫెర్నాండెజ్‌, రెయిన్‌బో ఆస్పత్రుల్లో మిల్క్‌ బ్యాంకులు ఉన్నాయి. ఈ పాలు నెలలు నిండకుండా పుట్టి ఎన్‌ఐసియులో ఉన్న పిల్లలకు ఉపయోగిస్తారు. కాబట్టి పాల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న తల్లులు పాలను సేకరించి, నాలుగు గంటల్లోగా బ్యాంకులకు అందించవచ్చు. తల్లిపాలలోని పోషకాలకు ప్రత్యామ్నాయం లేదు. ఫార్ములా పాలల్లో ప్రొటీన్లే తప్ప తల్లి పాలలోని యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌, ఇమ్యూనిటీని పెంచే సుగుణాలు ఉండవు. 


పాలు సరిపోతున్నాయా?

పిల్లలకు రోజులో 8 నుంచి 12 సార్లు ప్రతి రెండు నుంచి మూడు గంటలకోసారి పాలు ఇస్తూ ఉండాలి. పిల్లలు రోజు మొత్తంలో 6 నుంచి 8 సార్లు పారదర్శకమైన మూత్రవిసర్జన చేస్తూ, నాలుగైదు సార్లు మలవిసర్జన చేస్తుంటే, బిడ్డకు పాలు సరిపోతున్నాయని అర్థం. అలాగే సరిపడా పాలు అందే పిల్లలు వయసుతో పాటు బరువు పెరుగుతూ, చలాకీగా కనిపిస్తారు. ఇలా కాకుండా పిల్లలు పసుపు రంగుతో చిక్కని మూత్రం తక్కువసార్లు విసర్జిస్తున్నా, రోజులో ఎక్కువ సమయం ఏడుస్తున్నా, బరువు పెరగకపోతున్నా పాలు సరిపోవడం లేదని తల్లులు గ్రహించాలి. ఇలాంటప్పుడు వైద్యులు సూచించే మిల్క్‌ ఫార్ములాలు వాడుకోవాలి.




పాలను ఇలా నిల్వ చేసుకోవచ్చు


ఉద్యోగినులు, వర్క్‌ ఫ్రం హోంలో ఉన్న మహిళలు బిడ్డ పాల గురించి చింతించవలసిన అవసరం లేదు. తల్లి పాలు గది ఉష్ణోగ్రతలో నాలుగు గంటలు, ఫ్రిజ్‌లోని చిల్లర్‌ కంపార్ట్‌మెంట్‌లో నాలుగు రోజుల పాటు, డీప్‌ ఫ్రీజర్‌లో ఆరు నెలల పాటు సురక్షితంగా ఉంటాయి. కాబట్టి అవసరానికి సరిపడా పాలను బ్రెస్ట్‌ పంప్‌తో సేకరించి, బ్రెస్ట్‌ మిల్క్‌ నిల్వ చేసే బ్యాగుల్లో నింపి నిల్వ చేసుకోవచ్చు.


సురక్షితమైన ప్లాస్టిక్‌ లేదా గాజు కంటెయినర్లు కూడా ఉంటాయి. 30 మిల్లీలీటర్లు, 60 మిల్లీలీటర్ల బ్యాగుల్లో పాలను నిల్వ చేసుకుంటే అవసరానికి సరిపడా పాలనే ఉపయోగించుకునే వీలుంటుంది. ఫ్రీజర్‌లో నిల్వ చేసిన గడ్డకట్టిన పాలను వాడుకునే ముందు, ఒక రోజు పాటు చిల్లర్‌ కంపార్ట్‌మెంట్‌లో ఉంచి, తర్వాత బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు చేరుకునేవరకూ వెచ్చని నీళ్లు నింపిన గిన్నెలో ఉంచి వాడుకోవాలి. అంతేతప్ప మైక్రోవేవ్‌లో వేడి చేయడం లాంటివి చేయకూడదు. 




కొవిడ్‌ సోకిన తల్లులైతే?

గర్భిణులూ, పాలిచ్చే తల్లులూ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌కు మినహాయింపు కాదు. అయితే కొవిడ్‌ సోకినంత మాత్రాన బిడ్డకు పాలివ్వకూడదనే నియమం లేదు. వెంటిలేటర్‌ మీద ఉన్న తల్లులు మినహా కొవిడ్‌ సోకిన తల్లులందరూ బిడ్డకు పాలివ్వవచ్చు. కొవిడ్‌ లక్షణాలు తగ్గిపోయి, కోలుకుంటున్న తల్లులందరూ బిడ్డలకు నిక్షేపంగా పాలివ్వవచ్చు. అయితే పాలిచ్చే సమయంలో తల్లులు మూడు పొరల మాస్క్‌ లేదా ఎన్‌95 మాస్క్‌ ధరించాలి. చేతులను 60% ఆల్కహాల్‌ కలిగిన శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.


ప్రసవం అయిన రెండు రోజుల లోపు ఉత్పత్తయ్యే మొర్రుపాలలో బిడ్డకు పరిపూర్ణ ఆరోగ్య రక్షణ కల్పించే యాంటీవైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, లైసోజైమ్స్‌, ఇంటర్‌ఫెరాన్స్‌ మొదలైన పోషకాలు ఉంటాయి. ఇవన్నీ బిడ్డలో సహజసిద్ధమైన వ్యాధినిరోధకశక్తిని పెంచేవే. కాబట్టే కొలస్ట్రమ్‌ కలిగి ఉండే తల్లి తొలి పాలను ‘లిక్విడ్‌ గోల్డ్‌’ అంటూ ఉంటారు. ఈ పాలు బిడ్డకు వ్యాక్సిన్‌తో సమానం. కాబట్టి తల్లి పాలకు బిడ్డను దూరం చేయకూడదు.




ఫీడింగ్‌ ఆన్‌ డిమాండ్‌!


పుట్టిన రెండు రోజులు: 5 - 7 మిల్లీలీటర్లు

వారం రోజులు: 20 - 25 మిల్లీలీటర్లు

వారం దాటితే: 40 - 65 మిల్లీలీటర్లు

నెల నిండితే: 80 - 150 మిల్లీలీటర్లు


పిల్లలు ఏడ్చిన ప్రతిసారీ పాలు పట్టించడం అవసరం. పాల అవసరం పిల్లల శరీర బరువు మీద కూడా ఆధారపడి ఉంటుంది. 3 కిలోల బరువున్న వారం రోజుల బిడ్డ రోజు మొత్తంలో 500 మిల్లీలీటర్ల పాలు తాగుతాడు. బిడ్డకు ఆరు నెలల వయసొచ్చే వరకూ తల్లి పాలే సరిపోతాయి. అదనపు ఆహారం అవసరం లేదు. 




 


డాక్టర్‌ శాంతి శ్రీ రామచంద్రుల

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హాస్పిటల్స్‌,

హైదరాబాద్‌.


Updated Date - 2021-08-03T05:30:00+05:30 IST