కన్నతల్లే కిడ్నాపర్‌

ABN , First Publish Date - 2021-08-04T05:21:29+05:30 IST

బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్ల్లే కిడ్నాప్‌ చేసింది. ప్రేమికుడి సహకారంతో కూతురిని అపహరించింది. బాలిక నాయనమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజుల్లో నిందితుల ఆటకట్టించి పాపను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వై హరినాఽథ్‌రెడ్డి మంగళవారం విలేకర్లకు వెల్లడించారు.

కన్నతల్లే కిడ్నాపర్‌
వివరాలు తెలుపుతున్న డీఎస్పీ హరినాథ్‌రెడ్డి

కూతురి అపహరణకు స్కెచ్‌ 

ప్రియుడితో కలిసి విజయవాడకు తరలింపు

టెక్నాలజీతో పట్టుకున్న పోలీసులు


నెల్లూరు(క్రైం), ఆగస్టు 3: బిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతల్ల్లే  కిడ్నాప్‌ చేసింది. ప్రేమికుడి సహకారంతో కూతురిని అపహరించింది. బాలిక నాయనమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు రోజుల్లో నిందితుల ఆటకట్టించి పాపను క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.  దీనికి సంబంధించిన వివరాలను నెల్లూరు రూరల్‌ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ వై హరినాఽథ్‌రెడ్డి మంగళవారం విలేకర్లకు వెల్లడించారు. 


బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ గ్రామానికి చెందిన మద్దిల సుందరయ్య, కృష్ణవేణమ్మ దంపతుల రెండవ కుమారుడు మస్తాన్‌కు దగదర్తి మండలం లింగాలపాడు గ్రామానికి చెందిన నాగలక్ష్మి అలియాస్‌ కృష్ణవాణితో కొన్నేళ్ల క్రితం పెద్దలు వివాహం చేశారు. ఆ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు కలిగారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలతో నాలుగేళ్ల క్రితం వారు విడిపోయారు. పిల్లల కోసం కోర్టును ఆశ్రయించగా బాలికలిద్దరూ నాయనమ్మ కృష్ణవేణమ్మ సంరక్షణలో ఉండాలని న్యాయస్థానం సూచించింది. ఇదిలా ఉండగా నాగలక్ష్మి నెల్లూరు నగరంలో షేక్‌ అల్తాఫ్‌ అనే వ్యక్తితో సహజీవనం చేయసాగింది. వారిద్దరు ఇటీవల విజయవాడకు మకాం మార్చి అక్కడ హోటల్‌ ప్రారంభించారు. గత నెల 30వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో నాగలక్ష్మి, ఆమె ప్రియుడు అల్తాఫ్‌ జొన్నవాడలోని కృష్ణవేణమ్మ ఇంటికి చేరుకున్నారు. ముఖానికి మాస్క్‌లు ధరించి నేరుగా ఇంట్లోకి చొరబడ్డారు. ‘మేం పోలీసులం.. మీరు మద్యం అమ్ముతున్నారు... పట్టుకోవడానికి వచ్చాం’ అని బెదిరించి నిమిషాల వ్యవధిలో పెద్ద కుమార్తె అఖిల జ్యోతి నోరుమూసి కిడ్నాప్‌ చేశారు. ముందే సిద్ధం చేసుకున్న ఆటోలో ఆ బాలికను ఎక్కించుకుని విజయవాడకు వెళ్లి పోయారు. ఈ ఘటనపై నాయనమ్మ కృష్ణవేణమ్మ బుచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కోటేశ్వరరావు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. రాత్రి 10 గంటలకు బుచ్చి సీఐతోపాటు సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ బాజీజాన్‌ సైదా, స్థానిక ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి, సిబ్బంది ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు టెక్నాలజీని ఉపయోగించి రెండు రోజుల వ్యవధిలోనే నిందితులను గుర్తించారు. విజయవాడలో వారిని అరెస్టు చేసి బాలికను సురక్షితంగా మంగళవారం నాయనమ్మకు అప్పగించారు. కేసును వేగంగా ఛేదించిన సిబ్బందిని ఎస్పీ అభినందించి, రివార్డులకు సిఫార్సు చేయమని ఆదేశించారని డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-08-04T05:21:29+05:30 IST