మాతృత్వానికే మాయని మచ్చ

ABN , First Publish Date - 2022-08-02T06:18:18+05:30 IST

తల్లులంటే ఏమనుకుంటాం...? బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటారని, వారి ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డేస్తారని భావిస్తాం. సమాజంలో సగటు తల్లులందరూ అలాగే ఉంటారు. కానీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సోమవారం వెలుగు చూసిన రెండు ఘటనల్లో తల్లులు అమానవీయతకు పరాకాష్టగా, ఊహించలేని కర్కశత్వానికి ఉదాహరణగా నిలిచారు. ఓ చోట అనారోగ్యపు బిడ్డను సంప్‌లో వేసి కడతేర్చగా, మరోచోట తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని గొంతు నులిమి చంపేసింది. మృతుల్లో ఒకరికి ఏడాది వయస్సు, మరొకరికి ఆరేళ్ల వయస్సు మాత్రమే. కన్నపేగు తెంచుకొని బిడ్డల్ని కంటికి రెప్పల్లా కాపాడాల్సిన తల్లులే, మృత్యుపాశాలై నిలవడం కలచివేస్తోంది.

మాతృత్వానికే మాయని మచ్చ

రెండు వేర్వేరు ఘటనల్లో బిడ్డలను చంపిన తల్లులు

తల్లులంటే ఏమనుకుంటాం...? బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటారని, వారి ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డేస్తారని భావిస్తాం. సమాజంలో సగటు తల్లులందరూ అలాగే ఉంటారు. కానీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సోమవారం వెలుగు చూసిన రెండు ఘటనల్లో తల్లులు అమానవీయతకు పరాకాష్టగా, ఊహించలేని కర్కశత్వానికి ఉదాహరణగా నిలిచారు. ఓ చోట అనారోగ్యపు బిడ్డను సంప్‌లో వేసి కడతేర్చగా, మరోచోట తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని గొంతు నులిమి చంపేసింది.  మృతుల్లో ఒకరికి ఏడాది వయస్సు, మరొకరికి ఆరేళ్ల వయస్సు మాత్రమే. కన్నపేగు తెంచుకొని బిడ్డల్ని కంటికి రెప్పల్లా కాపాడాల్సిన తల్లులే, మృత్యుపాశాలై నిలవడం కలచివేస్తోంది.


సంప్‌లో వేసి చంపేసింది..

జనగామలో ఏడాది బిడ్డను కడతేర్చిన తల్లి
చైన్‌ స్నాచర్‌ చేశాడంటూ కట్టుకథ
పోలీసుల విచారణలో నిజం ఒప్పుకోలు
బిడ్డ అనారోగ్యాన్ని చూసి భరించలేకే చంపినట్టు వెల్లడి


జనగామ టౌన్‌, ఆగస్టు 1:
పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను నిర్దాక్షిణ్యంగా కడతేర్చిన ఓ తల్లి ఉదంతం జనగామలో కలకలం రేపింది. పుట్టుకతోనే అనారోగ్యం కలిగివున్న పసికందును పెంచి పెద్దచేయడం భారమని భావించి ఆమె ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తేలింది. పైగా చైన్‌ స్నాచింగ్‌ కోసం వచ్చిన వ్యక్తి తన బిడ్డను చంపాడని నాటకం ఆడేందుకు ప్రయత్నించింది. హృదయవిదారకమైన ఈ ఘటన పూర్వాపరాలను సోమవారం జనగామ డీసీపీ సీతారాం తన కార్యాలయంలో వెల్లడించారు.

జనగామ పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన నడిగోటి భాస్కర్‌-ప్రసన్న దంపతులకు ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడు సంవత్సరాల కొడుకు, ఏడాది పాప ఉన్నారు. భాస్కర్‌ పట్టణంలో సెలూన్‌ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి గతేడాది జూలై 19న పాప (తేజస్వి) జన్మించింది. నెలలు గడుస్తున్నా పాపలో శారీరక, మానసిక ఎదుగుదల లేకపోవడంతో తల్లిదండ్రులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. అయినా పాప పరిస్థితి మెరుగుపడకపోవడంతో తల్లి ప్రసన్న కొన్ని రోజులుగా కుమిలిపోతోంది. పాప ఇలాగే ఉంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు పడుతుందని భావించింది. ఇందుకు ఆమెను కడతేర్చడమే పరిష్కారమనే  నిర్ణయానికి వచ్చింది. సోమవారం ఉదయం సుమారు 11 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చిన్నారిని ఇంటి ఆవరణలోని సంపులో పడేసింది. చనిపోయిందని నిర్ధారించుకున్నాక పాపను బయటికి తీసి ఎత్తుకొని కేకలు వేసింది. స్థానికుల సాయంతో పాపను జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే పాప చనిపోయినట్లు వైద్యులు అధికారికంగా ధ్రువీకరించారు.

చైన్‌ స్నాచర్‌ చేశాడంటూ...
పాప హత్య విషయాన్ని ప్రసన్న తప్పుదోవ పట్టించేందుకు కట్టు కథ అల్లింది. తాను ఇంట్లో పాపతో ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మెడలోని పుస్తెలతాడు ఇవ్వాలని బెదిరించాడని, తాను ప్రతిఘటించడంతో  అతడు పాపను ఎత్తుకెళ్లి సంపులో పడేశాడని నమ్మించే ప్రయత్నం చేసింది. చైన్‌స్నాచర్‌ పాపను చంపేశాడనే వార్త వైరల్‌ కావడంతో పోలీసులు కేసును సీరియ్‌సగా తీసుకున్నారు. జనగామ ఏసీపీ కృష్ణ, సీఐ శ్రీనివాస్‌, ఎస్సై ప్రవీణ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు.

తమ ప్రశ్నలకు ప్రసన్న పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం తెలిసింది. పాపను తానే హతమార్చినట్లు ప్రసన్న ఒప్పుకుంది. తమ మొదటి సంతానమైన కుమారుడికి కూడా అనారోగ్యం ఉండటంతో ఆస్పత్రుల్లో ఎంతో ఖర్చు చేశామని తెలిపింది. బాబుకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయించామని, సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చు చేశామని పేర్కొంది.  రెండో సంతానంగా పుట్టిన పాప కూడా అనారోగ్యంగా ఉండడంతో ఏం చేయాలో దిక్కు తోచలేదని, దీంతో తానే చేతులారా నీటి సంప్‌లో వేసినట్టు ఒప్పుకుంది.  భర్త ఫిర్యాదు మేరకు ప్రసన్నపై హత్యా కేసు నమోదు చేసినట్లు డీసీపీ సీతారాం వివరించారు. కొన్ని గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులను డీసీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో ఏసీపీ కృష్ణ, సీఐ శ్రీనివాస్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


గొంతు నులిమి కడతేర్చింది..
ఐదేళ్ల కూతురిని హత్య చేసిన తల్లి
సహజ మరణంగా చిత్రీకరించే యత్నం
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉంటోందని ఘాతుకం
కేసముద్రం మండలంలో కలకలం


కేసముద్రం, ఆగస్టు 1 : కన్నకూతురి గొంతునులిమి హత్య చేసి సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది ఓ తల్లి. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందనే నెపంతో ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ శివారు నర్సింహులగూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన వివరాల ప్రకారం... నర్సింహులగూడానికి చెందిన ఓ మహిళకు వివాహం కాగా, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం నుంచే ఆమె భర్తకు దూరంగా ఉంటోంది.


ఈ క్రమంలో ఆమె రక్తసంబంధీకుడితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. సదరు వ్యక్తితో కలిసి యాదాద్రి సమీపంలోని మర్రిగూడెంలో కోళ్ల ఫాంలో పనిచేసేందుకు వెళ్లింది. అయితే వారం క్రితం ఆరేళ్ల కూతురు అస్వస్థతకు గురికావడంతో వైద్యం చేయించే ఓపిక లేక, అలాగే వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే నెపంతో గొంతునులిమి మర్రిగూడెంలోనే హత్య చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత తన సొంత గ్రామమైన పెనుగొండ శివారు నర్సింహులగూడానికి తీసుకొచ్చి ఖననం చేసేందుకు యత్నించింది. గ్రామస్థులు అనుమానంతో 100కి ఫోన్‌ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆదేరోజు భువనగిరి టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు సమాచారం అందించి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, తాజాగా వచ్చిన పోస్టుమార్టం రిపోర్టులో గొంతునులిమి హత్య చేసినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు విచారణ చేసి పూర్తి సమాచారం రాబట్టినట్లు తెలిసింది. సదరు మహిళను మంగళవారం అరెస్టు చూపుతారని తెలిసింది. ఈ కేసు యాదాద్రి జిల్లా భువనగిరి టౌన్‌ పీఎ్‌సలో నమోదైనట్లు తెలిసింది.

Updated Date - 2022-08-02T06:18:18+05:30 IST