ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు.. చావాలా..? బతకాలా...? అని రాత్రంతా ఆలోచించామంటూ సెల్ఫీ వీడియో..!

ABN , First Publish Date - 2021-12-23T16:21:14+05:30 IST

హరియాణాలోని జీంద్ జిల్లాలోని నర్వానా..

ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు.. చావాలా..? బతకాలా...? అని రాత్రంతా ఆలోచించామంటూ సెల్ఫీ వీడియో..!

హరియాణాలోని జీంద్ జిల్లాలోని నర్వానా పరిధిలోగల ధనౌరి గ్రామంలోని ఒక ఇంటిలో తల్లి, తండ్రి కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయవిదారక ఘటనతో గ్రామమంతా మూగబోయింది. సమాచారం అందుకోగానే ఎస్పీ నరేంద్ర బిజ్రానియా, ఏఎస్పీ కులదీప్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు మృత దేహాలను కిందకు దించి పోస్టుమార్టంకోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదంతంపై మృతుని బంధువు బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. మృతులను ఓం ప్రకాష్(48), అతని భార్య కమలేష్(45), కుమారుడు సోను(20)గా పోలీసులు గుర్తించారు.


వీరు ఆత్మహత్య చేసుకునేముందు రాసిన సూసైడ్ నోట్, తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటి ఆధారంగా దర్యాప్తు చేయనున్నామని ఎస్పీ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతులు తాము రాసిన సూసైడ్ నోట్‌లో పోలీసులపై పలు ప్రశ్నలు సంధించారు. అలాగే ఆ సూసైడ్ నోట్‌లో.. ‘నేను, మా అమ్మానాన్నలు హంతకులం కాదు. నన్హూను ఎవరు హత్య చేశారో మాకు తెలియదని పేర్కొన్నారు. మృతుల బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గర్హి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పవన్ కుమార్‌ మరో వర్గంతో కలిసి మృతుల కుటుంబ సభ్యులపై తప్పుడు కేసు మోపి విచారణ పేరుతో వేధించారని ఆరోపించారు. ఈ కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. కాగా నవంబరు 21న మృతుల కుటుంబానికి చెందిన మనీరామ్ ఉరఫ్ నన్హూ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈ నేపధ్యంలో గర్హి పోలీస్ స్టేషన్‌లో దీనిపై కేసు నమోదయ్యింది. నవంబరు 29 న పోలీసులకు నన్హూ మృతదేహం లభ్యమయ్యింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓం ప్రకాష్, అతని భార్య కమలేష్, కుమారుడు సోనులను విచారించారు. ఈ నేపధ్యంలోనే వారు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-23T16:21:14+05:30 IST