ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. దైవంతో సమానం

ABN , First Publish Date - 2021-05-09T18:02:50+05:30 IST

జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేనిది. తన పిల్లలను పెంచి పోషిస్తూ

ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. దైవంతో సమానం

హైదరాబాద్/అల్వాల్‌ : జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోలేనిది. తన పిల్లలను పెంచి పోషిస్తూ ఇంటినీ చక్కబెడుతుంది. కష్టాలను, సుఖాలను సమానంగా స్వీకరిస్తూ ప్రేమతో తమ చిన్నారులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడానికి శ్రమిస్తుంది. ఎలాంటి స్వార్థం లేకుండా కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ల ఉజ్వల భవిష్యత్తు కోసం తపిస్తుంది.


ఆధునిక యుగంలో కూడా ఉద్యోగిగా, గృహిణిగా రెండు భాధ్యతలను పోషిస్తూ కుటుంబానికి ఆర్థికంగా, ఆసరాగా నిలుస్తోంది. కుటుంబ నిర్వాహణ, పిల్లల భాధ్యత ఇలా పలు బాధ్యతలను నిర్వహిస్తున్న అమ్మకు సరైన గుర్తింపు ఇస్తున్నారా, తాను కరిగిపోతూ తన బిడ్డలు బాగుంటే చాలనుకునే అమ్మకు పిల్లలు, కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుతుందా ... అంటే అది కొంత వరకేనని చెప్పొచ్చు. వివిధ పనుల్లో సతమతమైనా పిల్లల చిరునవ్వు, వారి ఆనందాన్ని చూసి తన కష్టం మొత్తం మరిచిపోతుంది అమ్మ.... నేడు మాతృదినోత్సవం సందర్బంగా అమ్మకు వందనాలు.. ఈ సందర్భంగా విభిన్న వర్గాల మహిళల అభిప్రాయాలు..


నిత్యం శ్రమిస్తుంది

అమ్మ రేపటి భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తుంది.తాను ప్రతి పని పిల్లల ఆనందం కోసమే చేస్తుంది.నిత్యం తమ చిన్నారుల ఆలనాపాలన చూస్తూనే వారి ఎదుగుదలకోసం ఆరాటపడుతుంది. సమాజంలో చట్టాలు సైతం తల్లికి మరింత  రక్షణగా నిలువాల్సిన అవసరం ఉంది. - వి.మమత, జోనల్‌ కమిషనర్‌, కూకట్‌పల్లి


ఆమె గౌరవాన్ని తక్కువ చేయలేం 

ఆధునిక యుగంలోనూ  తల్లి స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా నిలవడమే కాకుండా తమ పిల్లలను భావిబారత పౌరులుగా తీర్చిదిద్దు తున్నారు. సమాజం, చట్టాలు తల్లికి అందు బాటులో ఉన్నాయి. - పద్మజారెడ్డి,  డీసీపీ బాలనగర్‌ జోన్‌


ఉన్నతమైన బాధ్యత

గతంలో తల్లులకు ఆర్థిక బాధ్యతలు ఉండేవి కావు. ఇటీవల కాలంలో కుటుంబం, పిల్లల బాధ్యత పెరిగింది. ఈ ఆధునిక యుగంలో తల్లులు కుటుంబానికి ఆర్థిక స్తోమతను పెంచడం, పిల్లలను ఉన్నత స్థానాల్లో నిలిపేందుకు కృషి చేస్తున్నారు. - ప్రొఫెసర్‌ స్వాతిరెడ్డి


తల్లి విలువను గుర్తిస్తున్నారు

సమాజంలో తల్లి పాత్ర ఎంతో గొప్పది. ఆధునిక యుగంలో మార్పులు  ఎంతగా వచ్చినా తల్లి విలువను పిల్లలు గుర్తిస్తున్నారు. సమాజంలో తల్లికి ఉన్న గౌరవం ఎనలేనిది. తల్లి కుటుంబ పోషణలో భాధ్యతగా పనిచేస్తుంది. - శాంతి శ్రీనివాస్‌ రెడ్డి, అల్వాల్‌  కార్పొరేటర్‌

 

ఇంటికి దీపం..

ఇల్లాలు ఇంటికి దీపం. కుటుంబ బాధ్యతల్లో  పాలు పంచు కుంటుంది. సహకరించే భర్త ఉన్నా లేకున్నా తల్లి మాత్రం కుటుంబ పోషణలో బాధ్యతగా పనిచేస్తుంది. పిల్లలకు అండగాఉంటూ మనోధైర్యాన్ని నేర్పిస్తుంది. - డాక్టర్‌ ప్రసన్నలక్ష్మి, అల్వాల్‌  పీహెచ్‌సీ


దైవంతో సమానం

తల్లి దైవంతో సమానం.. పిల్లలకు క్రమశిక్షణను నేర్పిస్తూ వారిని సమాజంలో ఉన్నత స్థానానికి తీసుకురావడానికి ఆహర్నిశలూ శ్రమిస్తుంది. మదర్స్‌ డే రోజుమా త్రమేకాకుండా వృద్ధాప్యంలో తల్లికి అండగాఉండి వారి సాధక బాధకాల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. - నాగమణి, అల్వాల్‌ తహసీల్దార్‌.

Updated Date - 2021-05-09T18:02:50+05:30 IST