Abn logo
Apr 22 2021 @ 02:04AM

ఇద్దరు చిన్నారులతో సహా తల్లి ఆత్మహత్య

  • పెద్దపల్లి జిల్లాలో ఘటన.. 
  • వరకట్న వేధింపులే కారణమన్న తండ్రి

పెద్దపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 21: కొడుకు వయసు మూడేళ్లు. కూతురి వయసు 14 నెలలు. ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ.. ఆ తల్లి ఇద్దరు బిడ్డలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. పెద్దపల్లి జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. వరకట్న వేధింపులే తన బిడ్డ, మనవల ఉసురు పోవడానికి కారణమని మృతురాలి తండ్రి ఆరోపిస్తుండటం గమనార్హం. పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్‌కు చెందిన విజయ(24)కు పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామానికి చెందిన ఎతిరాజి స్వామి (29)తో నాలుగేళ్ళ కిత్రం వివాహం జరిగింది. వివాహ సమయంలో ఇరు పక్షాలు అంగీకరించిన మేరకు కట్నకానుకలు అందజేశారు. అయినా సరే.. మరింత కట్నం తేవాలని విజయను అత్తింటివారు వేధింపులకు గురిచేయడం ప్రారంభించారు. 


ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగినా.. అత్తింటి వారిలో మార్పు రాలేదు. మంగళవారం కూడా స్వామి పనికి వెళ్లిన తరువాత విజయపై సాధింపులు మొదలుకావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. భర్తకు ఫోన్‌ చేసి మాట్లాడి, అనంతరం ఇద్దరు బిడ్డలు శివకృష్ణ(3), శ్రీకృతి (14 నెలలు)లతో సహా గ్రామశివార్లలోని ఓ వ్యవసాయ భూమిలో దూకింది. బుధవారం ఉదయం ఇద్దరు చిన్నారుల మృతదేహాలు బావిలో పైకి తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, మృతదేహాలను వెలికితీయించారు. విజయ తండ్రి డెక్కం రాజయ్య ఫిర్యాదు మేరకు స్వామి, అతడి తల్లి లచ్చమ్మ, అన్నావదినలు రాములు-రజిత, స్వామి సోదరి దేవక్క(భర్తను వదిలేసి ఇంటివద్దే ఉంటోంది)లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement