Abn logo
Apr 11 2021 @ 14:39PM

అమెరికాలో 'అమ్మా'నుషం..!

లాస్ ఏంజిల్స్: అమెరికాలోని లాస్​ ఏంజిల్స్‌లో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్లలోపు వయస్సు ఉన్న ముగ్గురు చిన్నారులు దారుణ హత్యకు గురయ్యారు. చిన్నారుల తల్లి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చనే అనుమానంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లాస్ ఏంజిల్స్‌లో శనివారం ఉదయం(అమెరికా కాలమానం ప్రకారం) ఈ ఘటన జరిగినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. చిన్నారుల నాన్నమ్మ బయటకెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూడగా.. ముగ్గురు చిన్నారులు రక్తపు మడుగులో విగత జీవులుగా కనిపించారు. అదే సమయంలో వారి తల్లి లిలియానా కారిల్లో ఇంట్లో కనిపించలేదు. దాంతో చిన్నారుల నాన్నమ్మ 911 కాల్ చేసి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారుల శరీరాలపై బలమైన కత్తిగాట్లు ఉండడం గమనించారు. అతి కిరాతకంగా ముగ్గురు చిన్నారులను గొంతుకోసి చంపినట్లు గుర్తించారు. తాను వచ్చేసరికి చిన్నారుల తల్లి ఇంట్లో లేదని, ఆమెనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని వృద్ధురాలు పోలీసులకు చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే పరారీలో ఉన్న లిలియానా కోసం గాలించారు. దీంతో లాస్ ఏంజిల్స్ నుంచి 322 కిలోమీటర్ల దూరంలోని టులారే కౌంటీలోని పాండెరోసాలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం లిలియానాను విచారిస్తున్నట్లు లాస్ ఏంజిల్స్ పోలీసు లెఫ్టినెంట్ రౌల్ జోవెల్ తెలిపారు. ఆమె నోరు విప్పితే గానీ ఈ ఘటనపై స్పష్టత రాదని పోలీసులు పేర్కొన్నారు.  

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement