వరికి దోమపోటు.. దిగుబడికి చేటు!

ABN , First Publish Date - 2021-10-27T04:56:12+05:30 IST

ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురియడం, రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉండడంతో జిల్లాలో వరి సాగు అధికంగా చేశారు.

వరికి దోమపోటు.. దిగుబడికి చేటు!
సుడి దోమ సోకి పసుపు రంగులోకి మారిన వరి

సన్నరకం వరి పంటపై ప్రభావం 

ఆందోళనలో రైతన్నలు

జాగ్రత్తలు పాటిస్తే ముప్పు తప్పే అవకాశం 

సూచిస్తున్న వ్యవసాయాధికారులు 

నారాయణరావుపేట, అక్టోబరు 26 : ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా కురియడం, రిజర్వాయర్‌లో నీరు పుష్కలంగా ఉండడంతో జిల్లాలో వరి సాగు అధికంగా చేశారు. నారాయణరావుపేట మండలంలో సుమారు 9 వేల ఎకరాల్లో, చిన్నకోడూరు మండలంలో 18 వేల ఎకరాల్లో వరి పంట సాగుచేశారు. పంట చివరి దశకు వచ్చేసరికి సన్నరకాలైన పంటలపై పలురకాల చీడపీడలతో పాటు దోమకాటు ఆశిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దొడ్డురకం వరి పంటలు చేతికొస్తుండగా, సన్నరకాలైన పంటలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. దొడ్డు రకాలకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేస్తుండగా, సన్నరకాలు పండించిన రైతులు పూర్తిగా దళారులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఓ వైపు చేతికంది వచ్చిన పంటను విక్రయిద్దామనుకుంటే వ్యాపారులు ధర తగ్గిస్తున్నారు. మరోవైపు సన్నరకాల పంటకు దోమపోటు సోకి రైతులు ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉన్నది. 

సుడి దోమతో కలిగే నష్టం 

సుడి దోమలు రెండు రకాలు. ఒకటి పెద్ద రెక్కల దోమ. రెండోది చిన్న రెక్కల దోమ. వరిని చిన్నరెక్కల దోమ ఆశించి నష్టం కలుగజేస్తుంది. గోధుమ రంగులో ఉండే సుడి దోమలు గుంపులు గుంపులుగా నీటి పైభాగంలో దుబ్బలపై ఉంటాయి. ఇవి దుబ్బల నుంచి రసాన్ని పీల్చడంతో ఆకులతో పాటు మొక్కలు పసుపు రంగులోకి మారి క్రమేణా సుడులు, సుడులుగా ఎండిపోతాయి. దోమలు రసం పీల్చేటప్పుడు విషపూరిత లాలాజలాన్ని మొక్క పోషక కణజాలంలోకి ప్రవేశపెడతాయి. దీంతో పోషక కణజాలాన్ని మూసేస్తాయి. మొక్క నుంచి రసం పీల్చడంతో కొంత ధాన్యం గింజలు పొల్లు, తాలుగా మారుతాయి. పొట్ట సమయంలో రసం పీల్చి 100 శాతం నష్టం కలిగిస్తాయి. పంట లేత దశలో దోమ ఆశించినా దీని ఉధృతి పంట 40 రోజుల నుంచి ఎక్కువవుతుంది. పంట దశ, దోమల సంఖ్యను బట్టి నష్టంలో వ్యత్యాసం ఉంటుంది. 

సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే 

దోమపోటు ప్రమాదాన్ని రైతులు సకాలంలో గుర్తించకపోవడం, సస్యరక్షణ చర్యలు పాటించకపోవడం వల్ల పంటలకు నష్టం కలుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సన్న రకాన్ని సాగుచేసే రైతులు సస్యరక్షణ పాటిస్తే దోమపోటు నుంచి గట్టెక్కే పరిస్థితి ఉంటుందని వెల్లడిస్తున్నారు. పంట ఎదుగుదలకు అధికంగా రసాయనిక ఎరువులు వేయడం ఒక కారణమైతే, పంటను పాయలుగా విడదీయకపోవడం దోమపోటుకు మరో కారణం. ఏపుగా పెరిగిన పంటకు గాలి, వెలుతురు సోకితే దోమపోటు ఆశించే ఆస్కారం తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

ముందస్తు జాగ్రత్తలతో ముప్పు తక్కువ

ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే పంటలకు దోమపోటు ముప్పు తప్పుతుంది. ప్రస్తుతం వరి పంటలో రెండున్నర మీటర్లకు పాయలు ఏర్పాటు చేసుకోవాలి. దీంతో సూర్యరశ్మీ, గాలి ధారాళంగా వస్తే దోమపోటు ఆశించే ప్రమాదం తక్కువగా ఉంటుంది. సుడిదోమ ఉధృతిని బట్టి మొదటి దశలో ఎసిఫేట్‌ 75, ఎస్పీ 1.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే బూఫ్రోజీన్‌ 25, ఎస్సీ 1.6 ఎంఎల్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేదా ఇమీడాక్లోప్రిడ్‌ ఒక ఎకరానికి 80 ఎంఎల్‌ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 

- విద్యాకర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి, నారాయణరావుపేట

Updated Date - 2021-10-27T04:56:12+05:30 IST