దోమల దండ యాత్ర

ABN , First Publish Date - 2021-07-28T05:52:59+05:30 IST

పల్లెలు, పట్టణాలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడాలేకుండా కుడుతున్నాయి. ఫలితంగా పలువురు జ్వరాల బారినపడుతున్నారు.

దోమల దండ యాత్ర
నర్సీపట్నంలోని ప్రశాంతినగర్‌లో ఇళ్ల మధ్య పేరుకుపోయిన మురుగు

 కానరాని నివారణ చర్యలు 

వర్షాలకు పేరుకుపోతున్న మురుగు

పల్లెలు, పట్టణాల్లో విజృంభిస్తున్న మలేరియా, డెంగ్యూ  

 ఆస్పత్రులు కిటకిట

నర్సీపట్నం, జూలై 27 : పల్లెలు, పట్టణాలపై దోమలు దండయాత్ర చేస్తున్నాయి. పగలు, రాత్రి తేడాలేకుండా కుడుతున్నాయి. ఫలితంగా పలువురు  జ్వరాల బారినపడుతున్నారు. ఈ నెలలో విరివిగా వర్షాలు కురవడంతో ఎక్కడికక్కడ నీటి నిల్వలతో పాటు మురుగు పేరుకుపోవడం దోమలు వ్యాప్తి చెందు తున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టిందన్న తరుణంలో దోమలు రూపంలో జనాన్ని రోగాలు చుట్టుముడుతున్నాయి. మలేరియా, డెంగ్యూ బారిన పడ్డవారి సంఖ్య పెరుగుతోంది. జ్వర పీడితులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో జూన్‌ 26 నుంచి జూలై 24 వరకు 99 మలేరియా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డెంగ్యూ బాధితులు మునిసిపాలిటీ, పల్లెల్లో కూడా అధికంగా ఉన్నారు. ఇదిలావుంటే, కాలువల్లో పూడిక పేరుకుపోవడంతో మురుగు సరిగా పారడం లేదు. చాలా ప్రాంతాల్లో కాలువులు నిర్మాణం చేయకపోవడంతో వర్షాలకు ఇళ్ల మధ్య మురుగు తిష్ఠ వేసి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. జ్వరాలతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునేవారి కంటే ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న వారే అధికంగా ఉంటున్నారు. దోమ  కాటు కారణంగా వస్తున్న జ్వరాలకు ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం దోమల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. వార్డుల్లో కనీసం వారంలో ఒక రోజైనా దోమల మందు పిచికారీ చేయడం లేదని పలువురు వాపోతున్నారు.  మలేరియా, డెంగ్యూ జ్వరాలు బారిన జనం పడినప్పుడు అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ల పేరి ఆయా ప్రాంతాల్లో మందు పిచికారీ చేసి  చేతులు దులుపుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది.   

Updated Date - 2021-07-28T05:52:59+05:30 IST