అక్రమార్కులపై చర్యలేవి?

ABN , First Publish Date - 2022-01-23T07:00:44+05:30 IST

పోలవరం భూసేకరణలో కుంభకోణాలు ఒక్కొక్కటి బయ టపడుతున్నాయి. భూమి సేకరించిన మేరకు అసలైన లబ్ధి దార్లకు ఇంకా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తి చేయలేదు.

అక్రమార్కులపై చర్యలేవి?

పోలవరం భూసేకరణలో అవినీతి పర్వం

 కె.కొండూరులో  రూ3. 17కోట్ల అక్ర మాలు

 12 మంది అనర్హుల పేరిట కాజేత

 అధికారుల బాగోతమేనని ధ్రువీకరణ

 ఇంతవరకు రికవరీ మాటే లేదు

 భూసేకరణ అధికారుల తీరుపై అనుమానాలు

 పూర్తి నివేదిక ఇవ్వడంతోపాటు వెంటనే యాక్షన్‌ తీసుకోవాలని భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌కు లేఖ రాసిన చింతూరు పీవో 

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

పోలవరం భూసేకరణలో కుంభకోణాలు ఒక్కొక్కటి బయ టపడుతున్నాయి. భూమి సేకరించిన మేరకు అసలైన లబ్ధి దార్లకు ఇంకా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తి చేయలేదు. పున రావాస కాలనీలు పూర్తిగా నిర్మించలేదు. కానీ నొక్కవలసిన చోట్ల అధికారులు బాగానే నొక్కేశారు. తీరా అవి బయట పడితే రికవరీ చేయడమూలేదు. బాధ్యుల మీద చర్య కూడా తీసుకోకపోవడం గమనార్హం. దీనిపై ఎటపాక ఆర్డీవో, చిం తూరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఎ.వెంకటరమణ ఈనెల 12న రాజమహేంద్రవరంలోని పోలవరం ప్రాజెక్టు భూసేకరణ  స్పెషల్‌ కలెక్టర్‌ మురళికి ఈ సంగతేంటో తేల్చి, బాధ్యులపై చర్య తీసుకోవాలని సిఫార్స్‌ చేస్తూ ఒక లేఖ రాశారు. దీని ప్రకారం వీఆర్‌ పురం మండలం పరిధిలోని కె.కొత్తగూడెం గ్రామంలో వీఆర్‌వో ఒకరు 12 మంది పేరిట లేని భూమిలో  బోగస్‌ డి.ఫారం పట్టాలు సృష్టించాడు. వాటికి పట్టాదారు పాసు పుస్తకాలు తయారు చేయించి, వారి అక్కౌంట్లలో  రూ.3,17,49,000 జమచేశారు. దీనిపై ముత్యాల నాగరాజు  అనే వ్యక్తి 2020 సెప్టెంబరు 15న చింతూరు ఐటీడీఏ పీవో కు ఫిర్యాదు చేశారు. పీవో ఆదేశాల మేరకు వీఆర్‌ పురం తహశీల్దార్‌ విచారణ చేసి బోగస్‌ పట్టాదారులకు ఎక్స్‌గ్రేషి యా ఇవ్వడం నిజమేనని ధ్రువీకరిస్తూ గత ఏడాది జూన్‌ 18న పీవోకు నివేదిక ఇచ్చారు. దీనిపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ న్యూఢిల్లీలోని సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. గత ఏడాది  సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సంబంధిత బోగస్‌ లబ్ధిదార్లకు నోటీసులు కూడా ఇచ్చారు. కానీ ఈ బాగోతానికి కారణమైన వీఆర్వోపై ఇంతవరకూ ఎవరూ చర్య తీసుకోలేదు. సొమ్ము పొందిన వారి నుంచి రికవరీ కూడా చేయలేదు. భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో భూసేకరణ జరుగుతుంది. కానీ కేవలం ఒక వీఆర్వో ఇంత కుంభకోణం చేయగలడా అనేది ఇక్కడ అనుమానం. వెనుక పెద్ద అధికారులు ఉండడం వల్లే  చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రూ. 3 కోట్లకుపైగా అవకవతకలు జరిగినట్టు ధ్రువీకరణ జరిగినా, వాటిని రికవరీ చేయకపోవడం అనుమానం కలుగుతోంది. దీనిపై ఆదివాసీల న్యాయ సలహాదారుడు అయినాపురపు సూర్యనారాయణ ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. ఈ క్రమంలోనే చింతూరు ఇన్‌చార్జి పీవో, ఎటపాక ఆర్డీవో ఎ.వెంకటరమణ భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌కు లేఖ రాస్తూ బాధ్యులపై చర్య తీసుకోవడంతోపాటు డిటైల్డ్‌ నివేదిక ఇవ్వమని ఆదేశించారు. వీఆర్వోపైనే చర్య తీసుకుంటారో, బాధ్యులను బయటకు లాగుతారో చూడాలి. 



Updated Date - 2022-01-23T07:00:44+05:30 IST