‘ఆఫ్ఘన్‌ మూలాలున్న హిందువులనూ తీసుకొస్తాం’

ABN , First Publish Date - 2021-08-19T21:35:15+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ మూలాలుగల హిందువులు, సిక్కులను

‘ఆఫ్ఘన్‌ మూలాలున్న హిందువులనూ తీసుకొస్తాం’

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌‌లోని భారతీయులను మాత్రమే కాకుండా ఆ దేశంలో జన్మించిన హిందువులు, సిక్కులను సైతం భారత దేశానికి తీసుకొస్తామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ చెప్పారు. ఆ దేశంలోని భారతీయులను వెనుకకు రప్పించే ప్రక్రియను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. హాజీపూర్‌లో గురువారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 


తాలిబన్ల పునరాగమనంతో ఆందోళన చెందుతున్న భారతీయులు భారత దేశానికి రావడానికి వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారని చెప్పారు. మూడు గంటల్లోనే 1,100కు పైగా ఈ-వీసా దరఖాస్తులు వచ్చాయన్నారు. 


ఇదిలావుండగా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా కూడా ఆఫ్ఘనిస్థాన్‌లోని భారతీయులను వెనుకకు తీసుకొస్తామని చెప్పారు. 2020లో నిర్వహించిన ‘వందే భారత్ మిషన్’ మాదిరిగానే ఇప్పుడు కూడా ఆఫ్ఘన్‌లోని భారతీయులను వారి ఇళ్ళకు చేర్చడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎయిరిండియా విమానాల్లో కానీ, భారత వాయు సేన విమానాల్లో కానీ, ఏ విధంగా వీలైతే ఆ విధంగా భారతీయులను తీసుకొస్తామని తెలిపారు. 


విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా భారతీయులకు హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నామని తెలిపారు. హిందువులు, సిక్కుల నాయకులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు.


అయితే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందువులు, సిక్కులకు హామీ ఇచ్చారని శిరోమణి అకాలీదళ్ నేత మంజిందర్ సింగ్ సిర్సా చెప్పారు. తాము ఎటువంటి హాని తలపెట్టబోమని, ఆఫ్ఘన్‌లోనే ఉండవచ్చునని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు చెప్పారు. 


Updated Date - 2021-08-19T21:35:15+05:30 IST