ఏదో ఒక రోజు క్షేమంగా తిరిగొస్తాడ‌నుకుంటే.. 19 ఏళ్ల త‌ర్వాత శ‌వంగా వ‌చ్చాడు!

ABN , First Publish Date - 2021-06-25T19:57:01+05:30 IST

దేశం కాని దేశం ఉపాధి కోసం వెళ్లి, 19 ఏళ్ల పాటు అక్క‌డే చిక్కుకుని చివ‌ర‌కు స్వ‌దేశానికి శ‌వంగా తిరిగొచ్చిన ఓ ప్ర‌వాస భార‌తీయుడి కన్నీటి గాథ ఇది.

ఏదో ఒక రోజు క్షేమంగా తిరిగొస్తాడ‌నుకుంటే.. 19 ఏళ్ల త‌ర్వాత శ‌వంగా వ‌చ్చాడు!

రియాధ్‌: దేశం కాని దేశం ఉపాధి కోసం వెళ్లి, 19 ఏళ్ల పాటు అక్క‌డే చిక్కుకుని చివ‌ర‌కు స్వ‌దేశానికి శ‌వంగా తిరిగొచ్చిన ఓ ప్ర‌వాస భార‌తీయుడి కన్నీటి గాథ ఇది. భార్య పిల్ల‌ల‌ను బాగా చూసుకోవాల‌నే కోటి ఆశ‌ల‌తో సౌదీ అరేబియాలోని రియాధ్‌కు వెళ్లిన వ్య‌క్తి.. ప‌నిచేసే చోట జ‌రిగిన ప్ర‌మాదంతో చిక్కుల్లో ప‌డ్డాడు. ఆ ప్ర‌మాద ఘ‌ట‌న‌ అత‌డి జీవితాన్నే మార్చేసింది. ఆ ప్ర‌మాదంలో ధృవ‌ప‌త్రాలు కాలిపోవ‌డంతో స్వ‌దేశానికి తిరిగిరాలేక రియాధ్‌లోనే ఉండిపోయాడు. చిన్న చిత‌క ప‌నులు చేసుకుంటూ అక్క‌డే చ‌ట్ట‌విరుద్ధంగా ఉన్నాడు. ఇలా 19 ఏళ్లు గ‌డిచిపోయాయి. అప్పుడప్పుడు స్వ‌దేశంలోని భార్య‌తో ఫోన్‌లో మాట్లాడేవాడు. త‌ప్ప‌కుండా స్వ‌దేశానికి వ‌స్తాన‌ని చెప్పేవాడు. దాంతో భార్య, పిల్ల‌లు అతడి కోసం ఏదో ఒక రోజు క్షేమంగా తిరిగొస్తాడ‌ని ఆశ‌గా ఎదురుచూశారు. కానీ, చివ‌ర‌కు శ‌వంగా తిరిగి రావ‌డంతో వారి బాధ వ‌ర్ణణాతీతం. 


వివ‌రాల్లోకి వెళ్తే.. కేరళ రాష్ట్రం చిరాయింకీజుకు చెందిన ర‌త్న‌కుమార్‌(58) అనే వ్య‌క్తి 30 ఏళ్ల క్రితం ఉపాధి కోసం రియాధ్ వెళ్లాడు. అక్క‌డ ఓ ఫ‌ర్నీచ‌ర్ షాపులో ప‌నికి కుదిరాడు. ఈ క్ర‌మంలో ఏడాదికి ఒక‌సారి ఇంటికి వ‌చ్చి భార్య‌, పిల్ల‌ల‌ను చూసి వెళ్లేవాడు. అలా 11 ఏళ్లు అదే షాపులో ప‌ని చేశాడు. ఈ క్ర‌మంలో ఒక‌సారి ఆ షాపులో అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. దాంతో ర‌త్న‌కుమార్‌కు సంబంధించిన ధృవ‌ప‌త్రాల‌న్నీ మంట‌ల్లో కాలి బూడిద‌య్యాయి. అంతే.. ఒక్క‌సారిగా అతడి జీవితం అంధ‌కారంలోకి వెళ్లిపోయింది. ప్ర‌మాదం జ‌రిగిన విష‌యాన్ని భార్య మోలీతో ఫోన్‌లో చెప్పిన ర‌త్న‌కుమార్.. ఎట్టిప‌రిస్థితుల్లో స్వ‌దేశానికి తిరిగొస్తాన‌ని అన్నాడు. ఇక‌ త‌న గుర్తింపుకు సంబంధించిన ప‌త్రాల‌న్నీ కాలిపోవ‌డంతో ర‌త్న‌కుమార్‌కు ఏం చేయాలో తోచ‌లేదు. చాలా రోజులు తెలిసిన వారి ద‌గ్గ‌ర కాలం వెళ్ల‌దీశాడు. ఆ త‌ర్వాత దొరికిన ప‌ని చేసుకుంటూ తిరిగి స్వ‌దేశానికి రావ‌డానికి తీవ్రంగా శ్ర‌మించాడు. ఇలా చ‌ట్ట‌విరుద్ధంగా 19 ఏళ్లు రియాధ్‌లోనే ఉండిపోయాడు. 


కొన్నేళ్ల త‌ర్వాత కుటుంబ స‌భ్యుల‌కు కూడా ఫోన్ చేయ‌డం మానేశాడు. అయినా భార్య‌కు చిన్న ఆశ‌.. ఏదో ఒక‌రోజు త‌న భ‌ర్త క్షేమంగా తిరిగొస్తాడ‌ని. కానీ, ర‌త్న‌కుమార్ అనారోగ్యానికి గురై మే 4న రియాధ్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఇండియ‌న్ ఎంబ‌సీకి ఆస్ప‌త్రి నుంచి ఫోన్ వెళ్లింది. గుర్తు తెలియ‌ని ఓ భార‌త‌ వ్య‌క్తి చ‌నిపోయిన‌ట్లు ఆస్ప‌త్రి సిబ్బంది రాయ‌బార కార్యాల‌యానికి ఫోన్ ద్వారా తెలియ‌జేశారు. దాంతో ఆస్ప‌త్రికి వెళ్లిన ఎంబ‌సీ అధికారులు మృతుడిని ర‌త్న‌కుమార్‌గా గుర్తించారు. ఈ విష‌యాన్ని భార్య మోలీకి తెలియ‌జేశారు. రియాధ్‌లోని కేఎంసీ వారు ర‌త్న‌కుమార్ మృత‌దేహాన్ని స్వ‌దేశానికి పంపించే ఏర్పాట్లు చేశారు. గ‌త ఆదివారం ర‌త్న‌కుమార్ బాడీ స్వ‌స్థ‌లం చిరాయింకీజుకు చేరుకుంది. దాంతో అదే రోజు సాయంత్రం కుటుంబ స‌భ్యులు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.

Updated Date - 2021-06-25T19:57:01+05:30 IST