Abn logo
May 5 2021 @ 23:28PM

ఉదయం రద్దీ.. మధ్యాహ్నం నిర్మానుష్యం!

శ్రీకాకుళంలో ఉదయం రద్దీగా ఉన్న మార్కెట్‌.. మధ్యాహ్నం నిర్మానుష్యంగా జీటీ రోడ్డు

- జిల్లాలో పకడ్బందీగా కర్ఫ్యూ  

- 12 తర్వాత మూతపడిన దుకాణాలు

- నిలిచిన రవాణా, ఇతర కార్యకలాపాలు

- అంతటా మోహరించిన పోలీసు బలగాలు 

- అత్యవసర సేవలకే అనుమతి

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వివిధ దుకాణాలు తెరచుకున్నాయి. బస్సులు, ఆటోలు తదితర ప్రయాణ సౌకర్యాలు సాగాయి. ప్రజలు తమకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసుకున్నారు. 12 గంటలలోగా తమ కార్యకలాపాలు ముగించుకుని.. ఆదరాబాదరాగా ఇళ్లకు చేరుకున్నారు. ఉదయమంతా ఎక్కడ చూసినా రద్దీ కనిపించింది.  శ్రీకాకుళం పెద్దమార్కెట్‌లో కూరగాయల దుకాణాలన్నీ కిటకిటలాడాయి. నగరంలో వివిధ ప్రాంతాల్లో చికెన్‌, చేపల దుకాణాల వద్ద ప్రజలు బారులుదీరారు. వీటితో పాటు వస్త్ర దుకాణాలు, ఇతర దుకాణాల వద్ద  సందడి కనిపించింది. బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్ని దుకాణాలు మూతపడ్డాయి. కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆటోలు, ప్రైవేటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి.  


 జిల్లా అంతటా 144 సెక్షన్‌  

కరోనా కట్టడి చర్యల్లో భాగంగా కర్ఫ్యూ అమలు చేసే బాధ్యత ప్రధానంగా పోలీసులదే.  ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత దుకాణాలన్నీ మూసివేయించారు. పోలీసు వాహనాలు, అటు రక్షక్‌, ఇటు ప్రత్యేక పోలీసు బలగాలు.. అన్నీ రోడ్లపైనే ప్రధాన జంక్షన్ల వద్ద మోహరించాయి. అత్యవసర సేవలకు మాత్రమే పోలీసులు మినహాయింపు ఇచ్చారు. అకారణంగా రోడ్లపై వచ్చినవారికి తొలిరోజు హెచ్చరించి ఇళ్లకు పంపించేశారు. ఇదేరీతిలో ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస, నరసన్నపేట, ఆమదాలవలస, రాజాం, పాలకొండ, పాతపట్నం ప్రాంతాల్లోనూ, ఇతర మండల కేంద్రాల్లోనూ పోలీసు బలగాలు మోహరించి.. కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఇచ్ఛాపురం సరిహద్దు వద్ద పశ్చిమబంగ, ఒడిశా రాష్ట్రాల నుంచి వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం వైద్యం కోసం అత్యవసర అనుమతి తీసుకున్న వారిని మాత్రమే అనుమతించారు.  డ్రోన్‌ కెమెరాలతో కర్ఫ్యూ అమలు తీరును ఎస్పీ అమిత్‌బర్దర్‌ పర్యవేక్షించారు.


 మద్యం దుకాణాల వద్ద బారులు... 

ఈ దఫా కర్ఫ్యూ నేపథ్యంలో మద్యం దుకాణాల వద్ద మందుబాబుల ఆరాటం అంతా ఇంతా కాదు. మధ్యాహ్నం 12 తర్వాత మద్యం లభించదని.. ఉదయం 6 గంటల నుంచే దుకాణాల వద్ద మద్యం ప్రియులు బారులుతీరారు. శ్రీకాకుళంతో పాటు ప్రతి మండలంలోనూ ఇదేపరిస్థితి నెలకొంది. ఎక్కడా ్ఞఅవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, కర్ఫ్యూ కారణంగా ఎప్పటిలానే సామాన్యులు, చిరువ్యాపారులు, దినసరి కూలీలు ఇబ్బందులకు గురయ్యారు. మళ్లీ పరిస్థితి చక్కబడే వరకు ఇబ్బందులు తప్పవంటూ నిట్టూరుస్తున్నారు. 


 సరిహద్దుల్లో రాకపోకలకు చెక్‌! 

ఇచ్ఛాపురం/మెళియాపుట్టి, మే 5 : ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఒడిశా ఇప్పటికే 15 రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌ విధించింది. ఆంధ్రాలో బుధవారం నుంచి మధ్యాహ్నం, రాత్రి వేళల్లో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 తర్వాత ఒడిశా నుంచి వచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇచ్ఛాపురంలోని పురుషోత్తపురంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌ చెక్‌పోస్టు వద్ద ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేశారు. గూడ్స్‌ వెహికల్స్‌ మాత్రమే విడిచి పెట్టారు. ఒడిశా, బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన మూడు బస్సులను, మినీ వ్యానులను అడ్డుకొని చెక్‌పోస్టు యార్డ్‌లో ఉంచారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్లను తిరిగి వెనక్కి పంపించేశామని సీఐ వినోద్‌బాబు తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసుల తనిఖీల నేపథ్యంలో కొంతమంది అడ్డదారుల్లో ద్విచక్ర వాహనాలపై రాకపోకలు సాగించారు. 

Advertisement