పొద్దుకు వెలకట్టలేవు

ABN , First Publish Date - 2021-04-19T05:50:36+05:30 IST

యారాడ కొండర వెన్నెల పిండిర గవ్వల దండర గాజువా గుండెర ఎర్రని దిబ్బర భీముని జబ్బర...

పొద్దుకు వెలకట్టలేవు

యారాడ కొండర వెన్నెల పిండిర

గవ్వల దండర గాజువా గుండెర

ఎర్రని దిబ్బర భీముని జబ్బర

ఇనుప తుఫానుర విశాఖ ఉక్కుర

మరిగె ఊపిరితిత్తుల మంటల నూదినమురో

సెరిగె నిప్పుల కత్తికి వెరువక నిలిసినమురో

కదుపలేని నలుపుకొండ కరగదీసినామురో

ఉప్పూరిన తనువులతొ ఉక్కును తీసినమురో

లాభమొచ్చె కంపెనీకి సాప సుడుతనంటవు

లబ్బర గాజని ఉక్కును సంతలమ్మ చూస్తవు

లేని గోతులు తవ్వుతు ఖాతల తిరిగెయ్యకు

సాలె గూళ్ల కంపెనీల తనువుల మొలిపించకు

సందమామలో నెత్తుటినెతికె బుద్ధి నీదిర

లేడికూన జాలి చూపునయిన ఓర్వలేవుర

ఏమనకుంటె పొద్దుకె వెలగట్టెద నంటవు

ఊకుంటె ఈ గాలినె టోకునమ్ముతంటవు

తానెక్కిన పడవకె రాముడు పబ్బతి వట్టెను

గుహుని విడిచి పోలేక గుండె దిగులునొందెను

వొడ్డుకు చేర్చె ఓడలు భరతమాత జరి తేరులు

ఎంత మొత్తుకున్న వినక అమ్మిరిగద క్రూరులు

రామా, ఆపదకాసర బీమా ఏమాయెర

పాడి ఆవువోలె అది ప్రాణాలను నిలిపెర

బాగున్న దానిమీద నీ యాగం వద్దుర

బంగారు బాతు గుడ్డు కడుపు కోయబోకుర

కంప పరిసినట్టు ముండ్ల కుంపట్లను పెంచినావు

కసితో పసి చెంపలపయి గాయాలను గీసినావు

కఠినత్వం ఏనాటికి కాదు భారతీయత

మసి గోళములోన మునిగి విషపు నవ్వు నవ్వకు

వరసపెట్టి ఒక్కటొక్కటప్పజెప్పబడితివి

అద్దాలంగడి పెద్దకు మద్దెల కొడితివి

చిల్లర కొట్లను ఆర్పి చితులె బతుకుంటివి

కాలె కడుపుల మీద పలుగురాళ్లు కొడితివి

ముచ్చట పచ్చటి వనము కచ్చకెండపెడితివి

రాగాల రామ సిలక తీగల తెంపేస్తివి

ఉరిమె జంగవిల్లి జియో ఉరులను పేనితివి

అందమైన గిరక పలుకు పందిరి పీకేస్తివి

పట్టాభి ఆంధ్రబ్యాంకు ప్రతిమల కన్నీరుర

స్టేటు బ్యాంకు హైదరబాదు చేతుల సంకెళ్లుర

పింగళి వెంకయ్య దివ్వె బెంగటిల్లె చూడర

అల్లూరి గుండెపైన మళ్లి పేలె తూటర

కూతవెట్టె రైలుబండి కూరాడు కుండర

మొక్కె బదులు తొక్క జూస్తె మొదలులేక పోతవు

కాలి బొబ్బలను జూసి గాలి నవ్వు నవ్వకు

నెనరు మరచి వలస కూలి నెగడుల నెగదోయకు

తన తనువె తనకు జైలు తన ఉనికె తనకు ఖైదు

ఈ నిజమెరుగని నేతలు హింసను వరియించుతారు

దేశమంత జయిలైనా వేసె ప్రశ్నలాగిపోవు

వేటకుక్కలుసిగొల్పిన పాటలు తలలొంచబోవు

తెలుగుతల్లి నుదిటి తిలక సిందూరం విశాఖ

తుడిసివేసి ప్రగతి గుడి తూకమేయ జూస్తివి

తెలుగుజాతి గుర్తులను తెరమరుగెజేస్తివి

ఉన్మాదపు ఉత్తరాది డోంగ్రా దరువేస్తివి

మనిషి రూపు మార్చుకొన్న మైనపు హైనావు నీవు

విష లోగిలి పెట్టుబడికి పుట్టిన పాచికవు నీవు

బతుకుల తూకం వేసే బజారు వేలం నీవు

లాభాల కంపెనీల లోభుల తాళం నీవు

జగన్నాథ రధం ముందు వినయంగ నడుస్తావు

జగతి నడిపె మా చేతుల జాలిమాని విరుస్తావు

మేమంటె మరయంత్రపు శక్తి ఉక్కుపీఠం

పంతమాడి నీకు నీవె రాసుకోకు అంతం

గోరటి వెంకన్న

Updated Date - 2021-04-19T05:50:36+05:30 IST