8.30 నుంచే ఓట్ల లెక్కింపు

ABN , First Publish Date - 2021-04-20T13:22:41+05:30 IST

స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని, మే 2వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు తెలిపారు.

8.30 నుంచే ఓట్ల లెక్కింపు

     - ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు


చెన్నై: స్ట్రాంగ్‌ రూముల్లో ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని, మే 2వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు తెలిపారు. స్థానిక సచివాలయంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కౌంటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశముందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. 2వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని, తొలుత తపాలా ఓట్లు లెక్కించనున్నామన్నారు. చిన్న నియోజకవర్గాలకు 14 టేబుల్స్‌, పెద్ద నియోకవర్గాలకు 40 టేబుళ్లు చొప్పున ఏర్పాటుచేసి లెక్కిస్తామన్నారు. ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూముల్లో భద్రంగా వున్నాయని, ఆ కేంద్రాల వద్ద సాయుధ పోలీసులు కాపలా కాస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు ఆయా కేంద్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరుగలేదని, ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి తగు చర్యలు చేపడతామని తెలిపారు. ఈవీఎంలను ఎవరూ హ్యాక్‌ చేసే అవకాశమే లేదని, ఈవీఎంలు క్యాలిక్యులేటర్‌ వలే పనిచేస్తాయని అన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే రోజు (ఆదివారం) ఒకవేళ సంపూర్ణ లాక్‌డౌన్‌ కొనసాగితే ఏం చేయాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు, సిబ్బందికి మాస్కులు, హ్యాండ్‌ గ్లౌజ్‌, శానిటైజర్‌ అందిస్తామన్నారు. 234 నియోజకవర్గాలకు 234 మంది పర్యవేక్షకులు లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తారన్నారు. అలాగే, కన్నియాకుమారి పార్లమెంటు ఉప ఎన్నిక లెక్కింపు కూడా ప్రత్యేక పర్యవేక్షణాధికారి నేతృత్వంలో జరుగుతుందన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసుల కోసం సంచార టాయిలెట్‌ వాహనం ఉంచామన్నారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూమ్‌ల సమీపంలోకి వాహనాలు వస్తే తగు చర్యలు చేపడతామని సత్యప్రదసాహు హెచ్చరించారు.

Updated Date - 2021-04-20T13:22:41+05:30 IST