Abn logo
Jul 25 2021 @ 01:22AM

కేరళలో మరింత ఉధృతం

  • కొత్తగా కరోనా బారిన 18 వేల మంది.. 
  • 51 రోజుల్లో ఇవే అత్యధిక పాజిటివ్‌లు
  • దేశంలో రికవరీలను మించి తాజా కేసులు


న్యూఢిల్లీ, తిరువనంతపురం, జూలై 24: కరోనా కేసులు ఇతర రాష్ట్రాల్లో తగ్గుతుంటే కేరళలో మాత్రం పెరుగుతూ పోతున్నాయి. గత వారం రోజుకు 13 వేల కేసులు రాగా.. ఈ వారం వైరస్‌ వ్యాప్తి మరింత ఉధృతమైంది. శుక్రవారం 17,518 మందికి, శనివారం 18,531 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 51 రోజుల్లో ఇవే అత్యధిక కేసులు కావడం గమనార్హం. కేరళలో గత 8 రోజుల్లో పాజిటివ్‌లు 15ు పెరగడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. దీంతో కొవిడ్‌ ఆంక్షలను మళ్లీ కఠినం చేశారు. కార్యాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి ఉద్యోగుల హాజరును పరిమితం చేశారు. 


కేరళ, ఈశాన్య రాష్ట్రాల ప్రభావంతో..

దేశంలో శుక్రవారం 39,097మందికి కరోనా నిర్ధారణ అయింది. క్రితం రోజుకు ఇవి దాదాపు 5 వేలు అధికం. మహారాష్ట్రలో(6,753) తగ్గుదల కనిపిస్తున్నా కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో బాధితుల పెరుగుదలతో కొత్త కేసులు 40వేలకు చేరువగా నమోదయ్యాయి. మరోవైపు రికవరీల కంటే పాజిటివ్‌లు అధికంగా ఉన్నాయి. శుక్రవారం 35,087 మంది కోలుకున్నారు. కాగా, వైరస్‌ కారక మరణాలు మళ్లీ 500 దాటాయి. తాజాగా 546 మంది ప్రాణాలు కోల్పోయారు. 16.32 లక్షల పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ రేటు 2.40గా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటిదాక 2,903 మంది రైల్వే ఉద్యోగులు కరోనాతో చనిపోయారని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ పార్లమెంటుకు తెలిపారు. భారత రైల్వేకు చెందిన ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ 200 మిలియన్‌ టన్నుల ద్రవరూప ఆక్సిజన్‌ను బంగ్లాదేశ్‌కు పంపుతోంది. రాష్ట్రాల వద్ద ప్రసుత్తం 2.98 కోట్ల టీకా డోసులు నిల్వ ఉన్నట్లు కేంద్రం వివరించింది. రాష్ట్రాలకు మొత్తం 44.53 కోట్ల డోసులను అందజేసినట్లు తెలిపింది. ఇందులో 41.55 కోట్ల డోసు లు వినియోగమైనట్లు పేర్కొంది. దేశ ప్రజలందరికీ కొవిడ్‌ టీకా వేయడానికి ఎలాంటి గడువు విధించలేదన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనపై కాం గ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ‘‘వెన్నెముక’’ లేదనడానికి ఇదే నిదర్శనమని ఆయన శనివారం ట్వీట్‌ చేశారు. ప్రజల జీవితాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


మూడోవేవ్‌ తీవ్రత తక్కువే : ఎయిమ్స్‌ 

కరోనా మూడో వేవ్‌ తీవ్రత తక్కువ స్థాయిలోనే ఉండొచ్చని న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా అభిప్రాయపడ్డారు. అయితే ఆ వేవ్‌ ఎప్పుడు మొదలవుతుంది, ఎంతకాలం పాటు కొనసాగుతుందనే దానిపై స్పష్టత లేదన్నారు. కొవిడ్‌ కేసులు సాధారణ స్థాయులను అధిగమించి గరిష్ఠాలకు చేరితే దాన్ని మూడోవేవ్‌కు సంకేతంగా భావించవచ్చన్నారు. కొవిడ్‌ నిబంధనలను ప్రజలు పక్కాగా పాటించేలా పర్యవేక్షించడం, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా మూడోవేవ్‌ రాకను కొంతమేర నిలువరించే అవకాశాలుంటాయని తెలిపారు. వైర్‌సలో కొత్త జన్యు ఉత్పరివర్తనాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు కొవిడ్‌ నిబంధనలపై నిర్లక్ష్యం వహించకూడదన్నారు. తీవ్ర కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌తో ఆస్పత్రి పాలవడం, లాంగ్‌ కొవిడ్‌, మరణాలు సంభవించే ముప్పుల నుంచి వ్యాక్సిన్లు రక్షణ కల్పిస్తున్నట్లు గులేరియా చెప్పారు. కొత్త వేరియంట్ల నుంచి రక్షణ కోసం ఈ ఏడాది చివరికల్లా కరోనా వ్యాక్సిన్ల బూస్టర్‌ డోసులు అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.