నిరసనలను అదునుగా తీసుకుని.. దోపిడీలకు పాల్పడుతున్న దుండగులు

ABN , First Publish Date - 2020-06-04T02:28:47+05:30 IST

అమెరికాలో తెల్ల పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్

నిరసనలను అదునుగా తీసుకుని.. దోపిడీలకు పాల్పడుతున్న దుండగులు

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికాలో తెల్ల పోలీసు అధికారి చేతిలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన విషయం తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తరువాత అమెరికాలో పరిస్థితులు అదుపు తప్పాయి. వేలాది మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. మరికొంతమంది దీన్నే అదునుగా తీసుకుని వ్యాపారాలపై దోపిడీకి పాల్పడుతున్నారు. కాలిఫోర్నియాలోని ఓ కార్ల డీలర్‌షిప్ సంస్థలో దుండగులు తాజాగా 70 కార్లకు పైగా దొంగిలించారు. ప్రస్తుతం పోలీసులు దుండగులను వెతికే పనిలో పడ్డారు. కార్లు ఉన్న స్థలం నుంచి వాటిని దొంగిలించి బయటకు తీసుకెళ్లడం కష్టమని.. ఎందుకంటే ఎగ్జిట్‌ దగ్గర లాక్ ఉంటుందని సంస్థ యజమాని చెప్పారు. అయినప్పటికి దుండగులు లాక్‌లను ధ్వంసం చేసి కార్లను దొంగిలించారని పేర్కొన్నారు. ఇది నిరసనకారుల పని కాదని.. ఆ ముసుగులో చాలా మంది ఇలా దీపిడీలకు పాల్పడుతున్నారని సంస్థ యజమాని అన్నారు. కార్లతో పాటు అనేక వస్తువులను కూడా దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తంగా పోయిన ఆస్తుల విలువ 5 మిలియన్ డాలర్లు(రూ. 37 కోట్ల 66 లక్షలు) ఉండవచ్చని సంస్థ యజమాని తెలిపారు. ఇదిలా ఉండగా.. పోలీసులు ఇప్పటివరకు 25 కార్ల వరకు రికవరీ చేశారు. అయితే ఆ కార్లలో ఇంజిన్ మాయమైనట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. దుండగులు అవకాశం కొద్దీ ఈ పని చేశారా లేదా ముందు నుంచే ప్లాన్‌తో ఈ దొంగతనానికి పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - 2020-06-04T02:28:47+05:30 IST