సందిగ్ధంలో చదువులు

ABN , First Publish Date - 2020-07-12T10:19:06+05:30 IST

స్కూళ్ల ఓపెనింగ్‌ అనుమతులు, తాత్కాలిక గుర్తింపు, రెన్యూవల్‌ ఇవేవీ ప్రస్తుతం సాగట్లేదు.

సందిగ్ధంలో చదువులు

పాఠశాలల అనుమతులకు ఆన్‌లైన్‌ బ్రేక్‌!

ఓపెనింగ్‌, గుర్తింపునకు నోచుకోని వైనం..

ఇప్పటికే ఫైళ్లను బట్టి పిండుకున్న అధికారులు..

ఉన్నఫలంగా తెరపైకి ఆన్‌లైన్‌ ప్రక్రియ

అలాగైనా పంపుతామంటే గడువు ముగిసిందంటున్న అధికారులు

55కిపైగా స్కూళ్లు పెండింగ్‌..

కొవిడ్‌ కారణంగా తెరుచుకోని వైనం..

రెన్యూవల్‌ చేయకుంటే విద్యార్థుల భవిష్యత్‌ ప్రశ్నార్థకమే..

యాజమాన్యాల గగ్గోలు..

కోర్టుకెళ్లే యోచనలో యజమానులు, సంఘాల నేతలు?


అనంతపురం విద్య, జూలై 11: స్కూళ్ల ఓపెనింగ్‌ అనుమతులు, తాత్కాలిక గుర్తింపు, రెన్యూవల్‌ ఇవేవీ ప్రస్తుతం సాగట్లేదు. ఉన్నఫలంగా అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్న నిబంధన తెరపైకి తేవటంతో విద్యార్థుల చదువులు సందిగ్ధంలో పడ్డాయి. దరఖాస్తు గడువు ముగిసిన తర్వాత ఆన్‌లైన్‌లో కార్యకలాపాలు సాగాలన్న ఉత్తర్వులు తేవటం మరో ట్విస్టు. తమకు రావాల్సిన మామూళ్లను కొందరు విద్యాశాఖాధికారులు లాగేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూళ్ల ఫైళ్లను బట్టి రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకూ పిండుకున్నారు. అంతా అయ్యాక ఇప్పుడు దరఖాస్తు గడువు ముగిసింది. ఇచ్చిన డబ్బులు వెనక్కి వస్తాయో, రావో తెలీదు. ఇప్పడు నడుస్తున్న స్కూళ్ల గుర్తింపు రెన్యూవల్‌ అవుతుందో, లేదో... అంతుచిక్కదు. దీనికితోడు కొత్త స్కూళ్ల అనుమతులకు ఏం చేయాలోనన్న అయోమయం నెలకొంది. ఇదీ ఇప్పుడు ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్ల పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 55కిపైగా స్కూళ్ల అనుమతులు, తాత్కాలిక గుర్తింపు, రెన్యూవల్‌ సందిగ్ధంలో పడింది. దీంతో యాజమ్యాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


అనుమతి, గుర్తింపు, రెన్యూవల్‌ ఇలా..

ప్రాథమిక, ప్రథమికోన్నత స్కూళ్ల వరకూ డీఈఓ పరిధిలోనే అనుమతి, గుర్తింపు, రెన్యూవల్‌ ఇస్తారు. ఇందుకోసం ఏటా అక్టోబరు 31వ తేదీలోపు రూ.10 వేల చలానా, రూ.25 వేల కేవీటీ (కిసాన్‌ వికాస్‌ పత్ర్‌) బాండ్లు, శానిటరీ, సౌండ్‌, ఫైర్‌ ఎన్‌ఓసీ, ట్రాఫిక్‌ ఎన్‌ఓసీ, టీచర్లకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించాలి. అక్టోబరు 31 దాటితే..నెలకు జరిమానా కింద రూ.10 వేల చొప్పున కట్టాల్సి ఉంటుంది. స్కూల్‌ ఓపెనింగ్‌ అనుమతి కోసం డీఈఓకు ఫైల్‌ పెట్టుకుంటే... ఆయన.. ఎంఈఓకు పంపుతారు. ఆయన పరిశీలించి, పంపుతారు. ఆ మేరకు డీఈఓ అనుమతి ఇస్తారు. స్కూల్‌ ఓపెన్‌ చేసుకున్న తర్వాత తాత్కాలిక గుర్తింపు కోసం మళ్లీ ఫైల్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు ముగిసిన స్కూళ్లు రెన్యూవల్‌ కోసం గుర్తింపు ముగియడానికి 6 మాసాల ముందు ఫైల్‌ నడపాల్సి ఉంటుంది. గుర్తింపు రెన్యూవల్‌ కోసమైతే.. రూ.2500 చాలానా చెల్లించాలి.


హైస్కూళ్ల విషయంలో..

1 నుంచి 10వ తరగతి వరకూ,  8 నుంచి 10 తరగతి వరకు, 6 నుంచి 10 తరగతి వరకూ పెట్టుకోవచ్చు. ఆర్జేడీ కార్యాలయం నుంచి ప్రభుత్వం వరకూ ఫైళ్లు నడుస్తాయి. ఉన్నత పాఠశాలలకు చలానా రూ.20 వేలు, కేవీటీ బాండ్లు రూ.50 వేలు తీసుకుని, అన్ని సర్టిఫికెట్లు ఆర్జేడీ కార్యాలయంలో ఇస్తారు. అక్టోబర్‌ 31 దాటితే.. నెలకు రూ.10వేలు ఫైన్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఫైల్‌ ఆర్జేడీకి పెట్టుకుంటే.. ఆ ఫైల్‌ను ఆయన డిప్యూటీ డీఈఓకు పంపుతారు. ఆయన పరిశీలించి, డీఈఓకు ఇస్తారు. డీఈఓ పరిశీలించి, ఆర్జేడీకి పంపుతారు.


ఆర్జేడీ నుంచి కమిషనర్‌కు, అక్కడి నుంచి ఆ శాఖ ముఖ్య కార్యదర్శికి వెళ్తుంది. తర్వాత ప్రభుత్వం నుంచి ఆ స్కూల్‌కు ఓపెనింగ్‌ అనుమతి ఇస్తూ.. జీవో జారీ చేస్తారు. అదే స్కూళ్ల తాత్కాలిక గుర్తింపు కోసమైతే.. స్కూళ్ల ఫైళ్లను డీఈఓకు పెడితే ఆయన సదరు ఫైళ్లను డీవైఈఓకు పంపుతారు. ఆయన వెరిఫై చేసి డీఈఓకు తిరిగి పంపుతారు. డీఈఓ నుంచి ఆర్జేడీకి ఇస్తే.. ఆయన స్థాయిలోనే తాత్కాలిక గుర్తింపు ఇస్తారు. ఇదే తరహాలోనే స్కూళ్ల గుర్తింపు రెన్యూవల్‌ ఫైళ్లు ప్రాసెస్‌ అవుతాయి. గుర్తింపు రెన్యూవల్‌కు రూ.5 వేలు చలానా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్జేడీ స్థాయిలోనే రెన్యూవల్‌ అవుతాయి.


ప్రతి టేబుల్‌కీ కాసులే..

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఎంఈఓ స్థాయిలో ఓపెనింగ్‌ అనుమతికి రూ.20 నుంచి రూ.30 వేలు, పెద్ద స్కూళ్లకు రూ.50 వేల నుంచి లక్ష లాగేస్తారన్న విమర్శలున్నాయి. తాత్కాలిక గుర్తింపునకు అదే మొత్తం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా 5 ఏళ్ల ఫైళ్లకు మాత్రమే. పదేళ్ల స్కూళ్ల ఫైళ్లకు ఇది మరింత పెరుగుతుంది. డీఈఓ ఆఫీసులో రూ.60 వేలు గుంజుతున్నట్లు విమర్శలు భారీగా వినిస్తున్నాయి. హైస్కూళ్ల విషయంలో స్కూళ్ల ఓపెనింగ్‌ అనుమతికి డీవైఈఓలు రూ.30 వేల నుంచి రూ.50 వేలు, తాత్కాలిక గుర్తింపునకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు, గుర్తింపు రెన్యూవల్‌కు రూ.50 వేల నుంచి రూ.60 వేలు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డీవైఈఓల నుంచి డీఈఓ ఆపీ్‌సకు వస్తే స్కూల్‌ ఓపెనింగ్‌ అనుమతికి రూ.30 వేల నుంచి రూ.35 వేలు, తాత్కాలిక గుర్తింపునకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పదేళ్ల గుర్తింపు రెన్యూవల్‌ చేయాలంటే.. రూ.60 వేలు పిండుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.


అంతటా అదే దందా..

స్కూళ్ల ఓపెనింగ్‌ అనుమతికి ఆర్జేడీ కార్యాలయానికి  ఫైల్‌ వెళ్తే రూ.30 వేల నుంచి రూ.40 వేలు, తాత్కాలిక గుర్తింపునకు అంతే మొత్తం తీసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పదేళ్లపాటు గుర్తింపు రెన్యూవల్‌ చేయాలంటే.. రూ.60 వేలు తీసుకుంటున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్జేడీ నుంచి కమిషనర్‌ ఆఫీసుకెళ్తే ప్రభుత్వ అనుమతికి రూ.40 వేలు, కమిషనర్‌ ఆఫీస్‌ నుంచి ముఖ్య కార్యదర్శి కార్యాలయానికెళ్లే రూ.50 వేలు, అక్కడి నుంచి మంత్రి చాంబర్‌కు వెళ్తే మరో రూ.50 వేలు లాగేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇలా క్లర్కు నుంచి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయం వరకూ ఎవరి స్థాయిలో వాళ్లు లాగేస్తున్నారన్న విమర్శలు వినిసిస్తున్నాయి.


జిల్లాలో భారీగా పెండింగ్‌

ప్రస్తుతం జిల్లాలో భారీగా స్కూళ్ల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2019-20, 2020-21 రెండేళ్లకు సంబంధించి 55కిపైగా స్కూళ్ల ఫైళ్లు అనుమతులు, గుర్తింపు రెన్యూవల్‌కు ఎదురు చూస్తున్నాయి. గతంలో అన్నీ మ్యానువల్‌గానే నడుపుతూ వచ్చారు. గత నెలాఖరు నుంచి ఆన్‌లైన్‌ ద్వారా పంపాలంటూ కమిషనర్‌ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ అధికారులు ఫైళ్లను తిరస్కరిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌-19 నేపథ్యంలో స్కూళ్లు ఎక్కడా ప్రారంభం కాలేదు. కొత్తగా స్కూళ్ల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకున్నా.. ఇబ్బంది ఉండదు. ఇప్పటికే నడుస్తున్న స్కూళ్లకు గుర్తింపు రెన్యూవల్‌ చేయకుంటే...ప్రమాదకరమే. ఇప్పటికే గుర్తింపు రెన్యూవల్‌ కోసం ఫైళ్లు పెట్టి, అధికారులకు లక్షలాది రూపాయల ముడుపులు సమర్పించుకున్న వారు.. గగ్గోలు పెడుతున్నారు.


4 నెలలుగా లాక్‌డౌన్‌తో ప్రభుత్వ కార్యాలయాలు కూడా సరిగా తెరవని పరిస్థితి నెలకొంది. ఇప్పడు తాము ఎలా అగ్నిమాపక, సౌండ్‌, శానిటరీ, ట్రాఫిక్‌ తదితర సర్టిఫికెట్లు తేగలమని యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి. దీనికితోడు ఉన్నఫలంగా కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ప్రక్రియ తెరపైకి తేవటం, అనుమతుతులు, గుర్తింపు రెన్యూవల్‌కు బ్రేక్‌ వేయటంపై కొందరు ప్రైవేటు స్కూళ్ల యజమానులు, సంఘాల నాయకులు.. కోర్టును ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.


Updated Date - 2020-07-12T10:19:06+05:30 IST