5 లక్షలు దాటిన రికవరీలు

ABN , First Publish Date - 2020-07-12T07:04:36+05:30 IST

మొన్న 25 వేలు.. నిన్న 26 వేలు.. నేడు 27 వేలు.. దేశంలో కరోనా విజృంభణ తీరిది. వరుసగా మూడో రోజూ అత్యధిక కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 27,114 మంది వైరస్‌ బారినపడ్డారని...

5 లక్షలు దాటిన రికవరీలు

  • కోలుకున్నవారి శాతం 62.78
  • దేశంలో కొత్తగా 27,114 కేసులు
  • వైర్‌సతో మరో 519 మంది మృతి

న్యూఢిల్లీ, జూలై 11: మొన్న 25 వేలు.. నిన్న 26 వేలు.. నేడు 27 వేలు.. దేశంలో కరోనా విజృంభణ తీరిది. వరుసగా మూడో రోజూ అత్యధిక కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 27,114 మంది వైరస్‌ బారినపడ్డారని, 519 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. కేసుల ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలోనే దేశంలో కోలుకున్నవారి సంఖ్య 5 లక్షలు దాటిందని పేర్కొంది. కొత్తగా 19,873మంది కోలుకున్నారని, రికవరీ రేటు 62.78కి చేరినట్లు ప్రకటించింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,83,407, 5,15,386 మంది కోలుకున్నారని పేర్కొంది.


మహారాష్ట్రలో పదివేలు దాటిన మరణాలు

కరోనా హాట్‌స్పాట్‌గా ఉన్న మహారాష్ట్రలో శనివారం 8,139 కేసులు నమోదయ్యాయి. 223 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మరణాలు 10,116కి చేరాయి. బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) అసిస్టెంట్‌ మునిసిపల్‌ కమిషనర్‌ కొవిడ్‌తో చనిపోయారు. గణేశ్‌ ఉత్సవాల నిర్వహణకు ముందస్తు అనుమతిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఢిల్లీలో 1,781 కేసులే నమోదయ్యాయి. మరోవైపు పాజిటివ్‌లు పెరుగుతుండటంతో ఈ నెల 14 రాత్రి 8 గంటల నుంచి 22వ తేదీ తెల్లవారుజాము 5 గంటల వరకు బెంగళూరులో లాక్‌డౌన్‌ విధించారు. అసోంలో కామరూప్‌ మెట్రోపాలిటన్‌ జిల్లా పరిధిలో లాక్‌డౌన్‌ను ఈ నెల 19వ తేదీ వరకు పొడిగించారు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో సోమ, మంగళవారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ దంపతులకు కరోనా నెగిటివ్‌ వచ్చింది. ఇటీవల ఓ మంత్రి, మరో ఎమ్మెల్యేకు పాజిటివ్‌ రావడంతో హేమంత్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. తమిళ నాడులో ఒకే రోజు 3,591 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యా రు. రాష్ట్రంలో శనివారం 3,965 మందికి పాజిటివ్‌ లక్షణాలు బయటపడటంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,34,226కు పెరిగింది. కర్ణాటకలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. శనివారం 2,798 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 36,216కు పెరిగింది.


Updated Date - 2020-07-12T07:04:36+05:30 IST