ఆఫ్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు... 40 మంది పౌరుల మృతి...

ABN , First Publish Date - 2022-04-17T18:29:33+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులపై పాకిస్థాన్ శుక్రవారం రాత్రి

ఆఫ్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు... 40 మంది పౌరుల మృతి...

ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సులపై పాకిస్థాన్ శుక్రవారం రాత్రి నిర్వహించిన వైమానిక దాడుల్లో బాలలతో సహా సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శాంతి కోసం కృషి చేసే ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర సంస్థ  ‘ఆఫ్ఘన్ పీస్ వాచ్’ వ్యవస్థాపకుడు, పాత్రికేయుడు హబీబ్ ఖాన్ ఈ వివరాలను వెల్లడించారు. 


హబీబ్ ఖాన్ ఇచ్చిన ట్వీట్‌లో, పాకిస్థాన్ చర్యను తీవ్రంగా ఖండించారు. తాలిబన్ల నేతృత్వంలోని ఆఫ్ఘన్ గడ్డపై తొలిసారి పాకిస్థాన్ యుద్ధ విమానాలు బాంబులు కురిపించాయని తెలిపారు. ఈ దాడుల్లో 40 మందికి పైగా సాధారణ ప్రజలు మరణించారని తెలిపారు. అనేక దశాబ్దాలుగా తన ప్రచ్ఛన్న శక్తులైన తాలిబన్లు, ముజాహిదీన్‌ల ద్వారా ఆఫ్ఘన్లను పాకిస్థాన్ చంపుతోందని పేర్కొన్నారు. 


శుక్రవారం రాత్రి పాకిస్థాన్ జరిపిన దాడుల్లో మరణించినవారి మృతదేహాల ఫొటోలను కూడా ఖాన్ షేర్ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని, వీటిపై దర్యాప్తు చేయాలని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును, అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ను కోరారు. 


ఖోస్ట్, కునార్ ప్రావిన్సుల స్థానిక అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో, పాకిస్థానీ యుద్ధ విమానాలు వివిధ ప్రాంతాల్లో దాడులు జరిపాయని ధ్రువీకరించారు. ఈ సంఘటనపై పాకిస్థాన్ ప్రభుత్వానికి తమ ఆందోళనను తెలియజేయడానికి తాలిబన్లు పాకిస్థాన్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌ను పిలిచింది. ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ, తాత్కాలిక డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ అల్హజ్ ముల్లా షిరిన్ అఖుండ్ పాకిస్థాన్ దాడులను ఖండించారు. 


ఈ దాడులతో ఆఫ్ఘనిస్థాన్ సార్వభౌమాధికారాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆఫ్ఘన్ గగనతలం, భూభాగంలో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తున్నారు. 


Updated Date - 2022-04-17T18:29:33+05:30 IST