రికార్డుస్థాయిలో Kuwait ను విడిచిన ప్రవాసులు.. 30 ఏళ్ల తర్వాత భారీగా తగ్గిన దేశ జనాభా!

ABN , First Publish Date - 2021-11-02T14:45:03+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహమ్మారి కరోనా నేపథ్యంలో రికార్డుస్థాయిలో నివాసితులు కువైత్‌ను వదిలి వెళ్లారు. దీంతో 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ దేశ జనాభా భారీగా పడిపోయినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. కువైత్ సోసైటీ ఫర్ హ్యుమన్ రైట్స్(కేఎస్‌హెచ్ఆర్) నివేదిక ప్రకారం 2020 జూన్...

రికార్డుస్థాయిలో Kuwait ను విడిచిన ప్రవాసులు.. 30 ఏళ్ల తర్వాత భారీగా తగ్గిన దేశ జనాభా!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మహమ్మారి కరోనా నేపథ్యంలో రికార్డుస్థాయిలో నివాసితులు కువైత్‌ను వదిలి వెళ్లారు. దీంతో 30 ఏళ్ల తర్వాత తొలిసారి ఆ దేశ జనాభా భారీగా పడిపోయినట్లు తాజాగా వెలువడిన గణాంకాలు చెబుతున్నాయి. కువైత్ సోసైటీ ఫర్ హ్యుమన్ రైట్స్(కేఎస్‌హెచ్ఆర్) నివేదిక ప్రకారం 2020 జూన్ నుంచి 2021 జూన్ వరకు ఏడాది కాలంలో ఏకంగా 2,53,000 మంది రెసిడెంట్స్ కువైత్ వదిలివెళ్లారు. వీరిలో 2,05,000 మంది ప్రైవేట్ సెక్టార్‌కు చెందిన వారే కావడం గమనార్హం. మరో 41,200 మంది గృహకార్మికులు, 7వేల మంది పబ్లిక్ సెక్టార్‌కు చెందినవారు ఉన్నట్లు కేఎస్‌హెచ్ఆర్ నివేదిక పేర్కొంది. 


అలాగే కరోనా ప్రభావం ప్రారంభమైన తర్వాత వరుసగా రెండేళ్లు దేశ జనాభా కూడా భారీగా పడిపోయినట్లు రిపోర్ట్ వెల్లడించింది. 2020లో దేశ జనాభా ఏకంగా 2.2 శాతం పడిపోయింది. దీంతో గత 30 ఏళ్లలో ఇంత భారీగా జనాభా తగ్గడం ఇదే తొలిసారి అని రిపోర్ట్ పేర్కొంది. ఈ ఏడాది జూన్ వరకు మరో 0.9 శాతం తగ్గడంతో ప్రస్తుతం కువైత్ మొత్తం జనాభా 4.62 మిలియన్లకు చేరుకుంది. ఏడాది కాలంలోనే 1.8 శాతం మేర నివాసితులు తగ్గినట్లు నివేదిక తెలియజేసింది. ఇక కరోనాకు ముందు ఆ దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న ప్రవాసుల సంఖ్య 68.2 శాతానికి పడిపోయింది. 


కువైత్‌లో మొత్తం 1.93 మిలియన్ల మంది కార్మికులుంటే వీరిలో 4,20,000 మంది కువైటీలు, మిగతావారు వలసదారులు ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. ఇక పబ్లిక్ సెక్టార్‌లో మొత్తం 4,37,100 మంది ఉద్యోగులు ఉంటే.. 90వేల మంది ప్రవాసులు ఉన్నారు. అటు ప్రైవేట్ సెక్టార్‌లో కువైటీలు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ రంగంలో 73వేల మంది కువైటీలు ఉన్నారు. మొత్తం 1.51 మిలియన్లుగా ఉన్నా ప్రైవేట్ సెక్టార్‌ ఉద్యోగుల్లో ఇది 4.8శాతం. ఇక ప్రైవేట్ రంగంతో పాటు డొమెస్టిక్ రంగంలో భారతీయ కార్మికులు అధికంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది జూన్ 30 వరకు కువైత్‌లో మొత్తం 3,02,000 మంది భారత గృహకార్మికులు పని చేస్తున్నారు. భారత్ తర్వాత 1,38,000 కార్మికులతో ఫిలిపీన్స్ రెండో స్థానంలో ఉంటే, శ్రీలంక 80,000 మందితో మూడో స్థానంలో ఉంది.  

Updated Date - 2021-11-02T14:45:03+05:30 IST