ఎందుకివ్వరు?

ABN , First Publish Date - 2020-10-23T09:27:46+05:30 IST

దేశంలోని పట్టణ పేదలందరూ నాణ్యమైన జీవనం గడిపేందుకుగాను కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌)- హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ (హెచ్‌.ఎ్‌ఫ.ఎ) పథకాన్ని రాష్ట్రాల్లో అమలు పరుస్తోంది.

ఎందుకివ్వరు?

గృహ ప్రవేశాలకు సిద్ధంగా 2లక్షలకుపైగా ఇళ్లు

ఇవ్వకుండా ఏడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

పాడుపడిపోతున్న టిడ్కో గృహాలు

ఉచితంగా ఇస్తామని నాడు జగన్‌ హామీ

అలా చేస్తే సర్కారుపై వేల కోట్ల భారం

అది చెప్పకుండా టిడ్కో ఇళ్లకు సమాధి

ఏడాదిన్నర అయినా అదే ఉదాసీనత

రీ టెండర్లు, 25% ఆంక్షలతో కోతలు

పూర్తయినవీ పంచకుండా మెలికలు

వేల నుంచి లక్ష దాకా చెల్లించిన పేదలు


ఇళ్లు పూర్తయ్యాయి! లబ్ధిదారుల ఎంపికా ఎప్పుడో జరిగిపోయింది. వాటా సొమ్ము చెల్లించి తమకిచ్చే ఫ్లాట్లను వారు చూసుకుని మురిసిపోయారు. పంపిణీలో కొన్ని లాంఛనాలు, పూర్తయిన ఇళ్లకు  రోడ్లు, విద్యుత్‌ వంటి మౌలిక వసతులు కల్పించడమే మిగిలింది.  రెండు లక్షలకుపైగా టిడ్కో ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. కానీ, వచ్చి ఏడాదిన్నర అవుతున్నా.. వాటిని కొత్త ప్రభుత్వం పంచడం లేదు. రకరకాల సాకులతో రాజధాని అమరావతిని అటకెక్కించారు సరే! మరి... పేదలకు దక్కాల్సిన ఇళ్లపై ఎందుకు పగ? వాటిని లబ్ధిదారులకు ఎందుకు పంచరు?


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

దేశంలోని పట్టణ పేదలందరూ నాణ్యమైన జీవనం గడిపేందుకుగాను కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (అర్బన్‌)- హౌసింగ్‌ ఫర్‌ ఆల్‌ (హెచ్‌.ఎ్‌ఫ.ఎ) పథకాన్ని రాష్ట్రాల్లో అమలు పరుస్తోంది. టీడీపీ హయాంలో ఈ హౌసింగ్‌ కాలనీలకు ఎన్టీఆర్‌ నగర్‌ అని పేరు పెట్టగా, వైసీపీ ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్‌ నగర్లుగా మార్చింది. ఈ పథకం కింద కేంద్రం మన రాష్ట్రంలోని పట్టణ పేదల కోసం 7,58,788 గృహాలను (టిడ్కో గృహాలు) టీడీపీ హయాంలో మంజూరు చేసింది. ఇవన్నీ జి ప్లస్‌ 3 అంతస్థులతో కూడిన అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లు. వీటిల్లో 3 సైజుల అపార్ట్‌మెంట్లుంటాయి. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉండే ఈ అపార్టుమెంట్లలో 300 చ.అ. వాటి సంఖ్య అత్యధికం. ఇవే సుమారు 85- 90 శాతం వరకూ ఉంటాయి. వీటిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2,62,216లను గ్రౌండ్‌ చేయించి, నిర్మాణాన్ని చురుగ్గా చేపట్టడంతో దాదాపుగా అన్నీ గృహ ప్రవేశాలకు సిద్ధమైన దశల్లో ఉన్నాయి. 300 చ.అ.లకు రూ.500, 365 చ.అ.లకు రూ.12,500, 430 చ.అ.లకు రూ.25,000 చొప్పున లబ్ధిదారులనుంచి బుకింగ్‌ అమౌంట్లు వసూలుచేశారు.


అదనంగా..365, 430 చ.అ.ల ఫ్లాట్లను కోరుకున్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి వరుసగా రూ.2.15లక్షలు, రూ.3.15 లక్షల చొప్పున బ్యాంక్‌ రుణాలను సైతం అప్పటి ప్రభుత్వం ఇప్పించింది. ఆ విధంగా ఇప్పటికి సుమారు 80,000 మంది లబ్ధిదారులు బ్యాంకుల నుంచి తమకు రుణాలుగా మంజూరైన మొత్తాల్లో నుంచి రూ.25,000 నుంచి రూ. 1 లక్ష వరకూ చెల్లించారు. ఇక అపార్ట్‌మెంట్లలోకి వెళ్లడమే ఆలస్యం అని గ్రౌండింగ్‌ అయిన 2,62,216 మంది లబ్ధిదారులు  భావిస్తే,  తమకు కేటాయించిన అపార్ట్‌మెంట్ల నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభమై, తమకూ శీఘ్రంగా స్వంతగూడు ఒనగూడుతుందని మిగిలిన 4,96,572 మంది కూడా సంతసించారు. అయితే, వారు ఒకటి తలిస్తే, వారికి మరొకటి ఎదురయింది. టీడీపీ స్థానంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటినుంచే లబ్ధిదారుల సొంతింటి ఆశలు నీరుగారడం మొదలయింది.  


‘ఉచితమే’ ముంచిందా?

రాష్ట్రంలో అధికారంలోకి వైసీపీ వస్తూ వస్తూనే పనులు మొదలయిన 4,96,572 అపార్ట్‌మెంట్లను రద్దుచేసింది. దాదాపుగా పూర్తయి, గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న 2,62,216 అపార్ట్‌మెంట్లను వాటి స్వంతదారులకు అప్పగించకుండా మిన్నకుండిపోయింది! దీంతో పట్టణ పేదలు ఒకపక్క అద్దెలు కట్టుకుంటూ, ఇంకొక పక్క బ్యాంక్‌ రుణాలకు సుమారు ఏడాదిన్నరగా ఈఎంఐలు చెల్లిస్తూ ఇబ్బంది పడుతున్నారు. నిజానికి, టీడీపీ తన ఎన్నికల హామీలో 300 చ.అ. (సింగిల్‌ బెడ్‌రూం) అపార్ట్‌మెంట్లు పూర్తిగా ఉచితమని, 365, 430 చ.అ. (డబుల్‌ బెడ్‌ రూం) అపార్ట్‌మెంట్లలో సైతం 300 చ.అ. వరకు ఉచితంగా ఇచ్చి, అది పోను వరుసగా 65, 130 చ.అ.లకు అయ్యే వ్యయాన్ని మాత్రం చెల్లిస్తే చాలునని పేర్కొంది. అయితే.. అప్పటి ప్రతిపక్ష నేత జగన్‌ మాత్రం టిడ్కో అపార్ట్‌మెంట్లన్నింటినీ లబ్ధిదారులకు పూర్తి ఉచితంగా ఇస్తామని వాగ్దానం చేశారు. సరిగ్గా ఇదే ఇప్పుడు ఈ గృహాల పాలిట శాపమైందని చెబుతున్నారు. లబ్ధిదారులందరూ టీడీపీకి అనుకూలురన్న దురభిప్రాయంతోపాటు 365, 430 చ.అ. అపార్ట్‌మెంట్లను కూడా పూర్తిగా ఉచితంగా ఇచ్చేస్తామనడంతో పడే భారం రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపరుస్తోందని చెబుతున్నారు.  హౌసింగ్‌ కాంప్లెక్స్‌లకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్రంలో మొత్తం రూ.6,000 కోట్ల వరకూ జగన్‌ సర్కార్‌ భరించాల్సి ఉంటుందని అంచనా. దీంతో మొత్తంగానే ఏపీ టిడ్కో హౌసింగ్‌ కాంప్లెక్స్‌ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టేసిందని చెబుతున్నారు. కేంద్రం మంజూరు చేసిన 4,96,572 అపార్ట్‌మెంట్లకు సబ్సిడీ రూపంలో సుమారు రూ.7,448 కోట్లు రాష్ట్రానికి అందుతాయి. వాటిని వదిలేసుకొనేందుకూ జగన్‌ సర్కారు సిద్ధమవుతున్న తీరుపై నిపుణులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 


వసతులు లేవనే వంక..

కృష్ణాజిల్లాకు రాష్ట్రంలోనే రెండో అత్యధిక యూనిట్లను మంజూరు చేశారు. షేర్‌వాల్‌ టెక్నాలజీలో మూడురకాల ఇళ్లనిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జిల్లాకు మంజూరు చేసిన 96,138 ఇళ్లలో దశలవారీగా 42,962 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. వీటిలో 31,424 ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. ఇందులో 15 వేల ఇళ్లకు పైగా ఫినిషింగ్‌కు వచ్చాయి. అంతర్గత రోడ్లు, మంచినీటి పైపులైన్లు, డ్రెయినేజీ పైపు నిర్మాణాల వంటివి మిగిలి ఉన్నాయి. ఇంతలో ప్రభుత్వం మారింది. అప్పటినుంచి అంగుళం కూడా పనులు ముందుకెళ్లలేదు. పైగా మౌలిక సదుపాయాలు లేవనే కారణం చూపి లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించటం లేదు. నెల్లూరు జిల్లాకు 53120 ఇళ్లు మంజూరుకాగా, 16,200 ఇళ్లు టీడీపీ హయాంలోనే పూర్తయ్యాయి. అప్పుడే లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్లను కేటాయించారు. కొన్ని పట్టణాల్లో స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని గృహాలకు దగ్గరుండి ప్రవేశాలు జరిపించారు. లాంఛనంగా కొంతమందికి ఇంటి తాళాలు కూడా అప్పగించారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో.. అధికారులు లబ్ధిదారులకు ఇచ్చిన ఆ ఇంటి తాళాలను కూడా వెనక్కు తీసుకున్నారు. ప్రస్తుతం కొన్ని అపార్టుమెంట్లను కొవిడ్‌ సెంటర్ల కిందకు మార్చారు.  


లాటరీ కొట్టినా.. లక్‌ లేదు

విశాఖ జీవీఎంసీ పరిధిలో ఇళ్ల కోసం 3,84,872 మంది దరఖాస్తు చేసుకొన్నారు. అప్పటి ప్రభుత్వం..43,844 ఇళ్లకు టెండర్లు పిలిచింది. చివరకు 28 వేల ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు అంతేమంది లబ్ధిదారులు డీడీలు తీసి జీవీఎంసీ యూసీడీ అధికారులకు అందజేశారు. ఇంతలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. గత ఆగస్టులో టిడ్కో గృహాలపై మరోసారి సర్వే చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో 25,080 ఇళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తేల్చారు. డీడీలు కట్టినవారిలో మూడువేలమందిని పక్కనపెట్టారు. త్వరలో పంపిణీ చేసే పేదింటి ఇళ్ల స్థలాల్లో ఇలాంటివారికి న్యాయం చేస్తామని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.


కాగా, అన్ని పనులు పూర్తయిన సుమారు ఐదు వేల ఇళ్లను లాటరీ పద్ధతిలో అర్హులకు కేటాయించింది. తర్వాతొచ్చిన ప్రభుత్వం తీరుతో ఇప్పుడు ఆ ఇళ్లలో కొన్ని శిధిలావస్థకు చేరుకున్నాయి. విజయనగరం జిల్లాలో 11,804 ఇళ్లను గత ప్రభుత్వం మంజూరు చేయగా, 65శాతం ఇళ్ల నిర్మాణాలు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. అన్నివిధాలా సిద్ధమైనా వాటిని లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. శ్రీకాకుళం లో 8,878 ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలోనే వీటిలో దాదాపు 3,872 గృహాలను పూర్తి చేశారు. ఇంతలో ఎన్నికలు రావడంతో, వాటి పంపిణీ నిలిచిపోయింది. 


25% కాలేదని 5వేల ఇళ్లకు కోత..

డీడీలు కట్టిన లబ్ధిదారులకు మూడేళ్లుగా ఇళ్లు స్వాధీనం చేయడం లేదు. ఈ ఇళ్లను నిర్మాణం చేసిన ఎల్‌అండ్‌టీ సంస్థకుచెల్లించాల్సిన బిల్లులను క్లియర్‌ చేయడం లేదు. పూర్తయి, గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్న ఇళ్ల పరిస్థితి ఇదయితే, నిర్మాణంలో ఉన్నవాటిని 25శాతం కన్నా తక్కువ పనులయ్యాయనే కారణంగా చాలావరకు రద్దు చేశారు. ఇలా పశ్చిమగోదావరి జిల్లాలో రెండు విడతల్లో మంజూరైన దాదాపు 30,848 ఇళ్లలో 5,536 ఇళ్లను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. జిల్లాకు మంజూరయిన ఇళ్లలో తొలి విడతలో 17,524 పూర్తిచేశారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం పరిధిలో సిద్ధమైన ఈ ఇళ్లకు పట్టాలు కూడా సిద్ధమయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయినా సరే ఇళ్లు ఇచ్చే పరిస్థితి లేదని తమ నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులు అప్పులు తెచ్చి మరీ తమ వంతుగా రూ.50 వేలు, లక్ష రూపాయలు చెల్లించారు. ఆ సొమ్ము కోసం వారిలో కొందరు ఇప్పుడు మున్సిపాలిటీల చుట్టూ తిరుగుతున్నారు. ఈ ఇళ్లలోనే ప్రస్తుతం కొవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటుచేశారు. 


పునాదిలోనే సంధికొట్టారు.. 

చిత్తూరు జిల్లాకు మంజూరయిన గృహాలు 18 వేలు. వీటిలో పునాది దశలో ఉన్న ఆరువేలకు పైగా ఇళ్లను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. ఆయా లబ్ధిదారులకు పేదింటి ఇళ్ల స్థలాల్లో న్యాయం చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇక మిగిలిన 11,107 గృహాలు ఫినిషింగ్‌కు వచ్చాయి. వాటిని పూర్తిచేసి డబ్బులు కట్టిన లబ్ధిదారులకు అప్పగించే దిశగా అడుగులే పడటం లేదు. శ్రీకాళహస్తి, చిత్తూరు వంటి ప్రాంతాల్లో మాత్రం కొందరికి నామమాత్రంగా గృహానికి సంబంధించిన ఒప్పంద పత్రాలను అందించారు. పునాది దశలో ఉన్న నిర్మాణాలను రద్దు చేయడంతో అసంపూర్తి నిర్మాణాల మీదున్న కమ్మీలు తుప్పు పట్టిపోతున్నాయి. రద్దయిన గృహాలకు సంబంధించిన డిపాజిట్లు దాదాపుగా రూ.38 కోట్లు ఉన్నారు.



సొంతిల్లు ఇవ్వరు.. సొమ్మూ తిరిగివ్వరు..

మూడు విడతల్లో 36,563 ఇళ్లను కర్నూలు జిల్లాలో మంజూరు చేశారు. లబ్ధిదారుల వాటా కింద ప్రజల నుంచి డీడీలను కూడా 2019 ఎన్నికలకు ముందు సేకరించారు. సొంత ఇళ్లు సమకూరుతుందనే ఆనందంలో ఈ డీడీలు కట్టడానికి లబ్ధిదారుల్లో చాలామంది తమ భార్యల పుస్తెలు తాకట్టుపెట్టారు. మరికొందరు ఎక్కువ వడ్డీకి బయటనుంచి అప్పులు తెచ్చి కట్టారు. టీడీపీ హయాంలో ఆ ఇళ్లకు గృహ ప్రవేశాలు పూర్తి చేయించి, ఇంటి తాళాలు కూడా అప్పజెప్పారు. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ ఆ ఇళ్లను ఈనాటికీ లబ్ధిదారులకు స్వాధీనపరచలేదు. అప్పట్లో సింగిల్‌ బెడ్‌ రూమ్‌కు తొలి విడత సొమ్ముగా రూ.12,500, డబుల్‌ బెడ్‌ రూమ్‌ల కోసం రూ.25వేల చొప్పున లబ్ధిదారులు చెల్లించారు. చెల్లించిన ఆ సొమ్ము తిరిగి ఇవ్వడం లేదని, పోనీ ఇళ్లు ఇవ్వమంటే, అదీ కుదరదంటున్నారని వారంతా బావురుమంటున్నారు. ఇక  కడప జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో 13,896 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో దాదాపు రెండువేల ఇళ్లకు కాంక్రీట్‌ పోశారు. 


ఇల్లొస్తుందని లక్ష కట్టా

‘‘ఇల్లు వస్తుందని లక్ష రూపాయలు అప్పు చేసి కట్టాను. ఇప్పుటికీ ఇల్లు ఇవ్వలేదు. కట్టి కూడా చాలా రోజులైపోయింది. అలాగే వదిలేస్తే పాడై పోదా?’’

 మారెం సన్యాసమ్మ, తాడేపల్లిగూడెం


బంగారం అమ్ముకొని...

‘‘జీడి పరిశ్రమలో దినసరి కూలిని. అందరికీ ఇళ్లు ఇస్తామని అధికారులు చెప్పడంతో కొద్ది మొత్తంలో నా దగ్గర ఉన్న బంగారాన్ని అమ్ముకున్నాను. మరో రూ.50 వేలు అప్పుచేసి మొత్తం రూ.లక్ష రూపాయలు అప్పట్లో కట్టాను. నాకు 400 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఇంటిని మంజూరు చేశారు. కానీ, నేటికీ ఆ ఇల్లు అందలేదు. కనీసం కేటాయించిన ఇల్లు ఎక్కడుందనేదీ చెప్పేవారు లేరు’’

హేమ త్యాడి, కాశీబుగ్గ, శ్రీకాకుళం జిల్లా

Updated Date - 2020-10-23T09:27:46+05:30 IST