బాలాపూర్‌లో అర్ధరాత్రి 100 మందికి పైగా హల్‌చల్‌

ABN , First Publish Date - 2021-03-08T14:12:08+05:30 IST

పోలీసులు అక్కడికి వెళ్లగా సుమారు 100మందికి పైగా కనిపించారు. ఏదో జరుగుతోందని..

బాలాపూర్‌లో అర్ధరాత్రి 100 మందికి పైగా హల్‌చల్‌

    • 16ఎకరాల స్థల వివాదానికి సంబంధించి గొడవ 
  •  

హైదరాబాద్‌సిటీ/పహాడిషరీఫ్‌ : రాచకొండ కమిషనరేట్‌, బాలాపూర్‌ పీఎస్‌ పరిధిలో విలువైన ఓ స్థలం కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ వివాదం చెలరేగింది. అప్రమత్తమైన స్థానికులు, ఫిర్యాదుదారులతో పాటు పోలీసులు అక్కడికి వెళ్లగా సుమారు 100మందికి పైగా  కనిపించారు. ఏదో జరుగుతోందని.. ల్యాండ్‌ మాఫియా కబ్జాకు యత్నిస్తోందని కొంతమంది ఆరోపించారు. మరోవైపు ఇది తమకు సంబంధించిన స్థలమేనని... ఫెన్సింగ్‌ చేసేందుకు వస్తే అడ్డుకుంటున్నారని.. తామే యజమానులమని చెప్పారు. ఇరువర్గాల వాదన విన్న పోలీసులు వారి వద్ద ఉన్న ఆధారాలు సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 


శనివారం అర్ధరాత్రి హల్‌చల్‌ చేసిన సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బాలాపూర్‌ విలేజ్‌ పరిధి.. సర్వే నెంబర్‌ 145లో ఇజ్తెమా గ్రౌండ్‌ ఎదురుగా 16ఎకరాల భూమి ఉంది. కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న భూమికి సంబంధించి మహ్మద్‌ తారిఖ్‌ యూసుఫ్‌ అనే వ్యక్తితోపాటు అతడి సంబంధీకులు తమకే చెందుతుందని చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం సుభా్‌షగుప్తా.. సంబంధీకుల వద్ద నుంచి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. అదే స్థలంపై కొన్నేళ్లుగా బాలాపూర్‌, వెంకటాపూర్‌ ప్రాంతానికి చెందిన కల్లేమ్‌, కటారి అనే ఇద్దరు సోదరులకు సంబంధించిన రెండు కుటుంబాలు కూడా ఆధారపడి ఉన్నాయి. గతంలో వ్యవసాయం, పశువులను మేపుకోవడానికి వారు కౌలుకు తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఆ భూమి వివాదం ముదరడంతో మహమ్మద్‌ తారిఖ్‌ యూసుఫ్‌ అనే వ్యక్తి తనకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని చెబుతూ శనివారం రాత్రి ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్‌ చేసేందుకు ప్రయత్నించాడు. కల్లేమ్‌, కటారి సంబంధీకులు అడ్డుకున్నారు.


శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు వెంటనే ఇరువర్గాల వారిని పోలీ్‌సస్టేషన్‌కు రప్పించారు. వారి వద్ద ఉన్న ఆధారాలను సేకరించి పరిశీలించారు. మహ్మద్‌ తారిఖ్‌ యూసుఫ్‌ తరఫున కోర్టు తీర్పు ఇచ్చి ఉన్నందున అతడి పనికి విఘాతం కలిగించరాదని కోరారు. అయితే కోర్టులో మరో 18కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. కేవలం ఒక్క కేసు ఆధారంగా పోలీసులు అతడికి మద్దతు ఎందుకు ఇస్తున్నారని కల్లేమ్‌, కటారి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. అర్ధరాత్రి దోపిడి దొంగల్లా వందల సంఖ్యలో వ్యక్తులను తీసుకుని స్థలం వద్దకు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యమిస్తున్నామని.. ఎవరిపైనా కేసులు నమోదు చేయలేదని బాలాపూర్‌ పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-03-08T14:12:08+05:30 IST