కార్డు చెల్లింపులకు మరింత భద్రత

ABN , First Publish Date - 2022-06-22T09:34:58+05:30 IST

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో ఆన్‌లైన్‌ లావాదేవీల్లో భద్రతను మరింత పెంచేందుకు గత ఏడాది ఆర్‌బీఐ ప్రకటించిన టోకెనైజేషన్‌ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి.

కార్డు చెల్లింపులకు మరింత భద్రత

జూలై 1 నుంచి కార్డు టోకెనైజేషన్‌ నిబంధన అమలు


ముంబై: డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో ఆన్‌లైన్‌ లావాదేవీల్లో భద్రతను మరింత పెంచేందుకు గత ఏడాది ఆర్‌బీఐ ప్రకటించిన టోకెనైజేషన్‌ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధన అమలుతో మర్చంట్లు కస్టమర్ల కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలిగించాల్సి ఉంటుంది. వాటి స్థానంలో ఎన్‌క్రిప్టెడ్‌ టోకెన్‌ రూపంలో మాత్రమే ఆ వివరాలు భద్రపరుచుకునే వీలుంటుంది. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే వినియోగదారులు తరచుగా ఉపయోగించే ఈ-కామర్స్‌ సైట్లు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో తమ కార్డు వివరాలు స్టోర్‌ చేస్తుంటారు. తద్వారా ఆ వైబ్‌సైట్‌ లేదా కంపెనీ సర్వర్‌లో కస్టమర్‌ కార్డు వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఒకవేళ ఆ సర్వర్‌ హ్యాకింగ్‌కు గురైతే ఆ కార్డు వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. టోకనైజ్డ్‌ సర్వీసుల ద్వారా ఈ తరహా ముప్పును నివారించవచ్చు. ఎందుకంటే, కార్డు జారీ చేసిన కంపెనీ మాత్రమే టోకెన్‌ను డీక్రిప్ట్‌ చేయగలదు. ఈ విధానంలో ముందుగా కస్టమరు కార్డు వివరాల టోకెన్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడి కార్డు, టోకెన్‌ కోసం అభ్యర్థించిన సంస్థ (ఉదాహరణకు ఈ-కామర్స్‌ పోర్టల్‌), ఉపయోగిస్తున్న డివైజ్‌ (ఉదాహరణకు మొబైల్‌) ఆధారంగా కార్డు కంపెనీ వినూత్న టోకెన్‌ను జారీ చేస్తుంది. ఈ టోకెన్‌లోనే కార్డు వివరాలు ఎన్‌క్రిప్ట్‌ చేసి ఉంటా యి. కాబట్టి కస్టమర్లు ఒక టోకెన్‌తో ఒక వేదిక (ఈ-కామర్స్‌ సైట్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌) నుంచి పలుమార్లు చెల్లింపులు జరిపే వీలుంటుంది. అయితే, కార్డు టోకెనైజేషన్‌ తప్పనిసరేం కాదు. కస్టమర్‌ సమ్మతితోనే మర్చంట్‌ తన సర్వర్లో ఎన్‌క్రిప్టెడ్‌ టోకెన్‌ను నిక్షిప్తం చేసుకునేందుకు వీలుంటుంది. కార్డు వివరాల టోకనైజేషన్‌ వద్దనుకున్న పక్షంలో కస్టమరు ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే ప్రతిసారి తన కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు (పేరు, కార్డు నంబరు, వాలిడిటీ, సీవీవీ) ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 


ఫిన్‌టెక్‌లకు ఆర్‌బీఐ షాక్‌

అమెజాన్‌పే, ఫోన్‌పే, బజాజ్‌ ఫైనాన్స్‌, ఓలా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, సింపుల్‌ వంటి 35కు పైగా నాన్‌ బ్యాంకింగ్‌ ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) కంపెనీలకు ఆర్‌బీఐ షాకిచ్చింది. పీపీఐలు తమ కస్టమర్‌కు కల్పించిన క్రెడిట్‌ లైన్‌ లేదా రుణ పరిమితి నుంచి మొబైల్‌ వాలెట్‌ లేదా కార్డులో నగదు జమ చేయవద్దని ఆదేశించింది. పీపీఐ మాస్టర్‌ డైరెక్షన్‌ ఇందుకు అనుమతించదని, ఈ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌ యాక్ట్‌, 2007 ప్రకారం కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని మంగళవారం విడుదల చేసిన సర్కులర్‌లో ఆర్‌బీఐ హెచ్చరించింది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్సింగ్‌ కంపెనీల భాగస్వామ్యంలో  వ్యాలెట్లు లేదా కార్డుల ద్వారా క్రెడిట్‌ లైన్‌ ఆఫర్‌ చేసే ఫిన్‌టెక్‌ కంపెనీలు, బయ్‌ నౌ, పే లేటర్‌ (బీఎన్‌పీఎల్‌) సేవలు ఆఫర్‌ చేస్తున్న సంస్థలకు ఆర్‌బీఐ తాజా ఆదేశాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయని మాక్వెరీ క్యాపిటల్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ గణపతి అన్నారు. 


కొన్ని నిబంధనల గడువు పొడిగింపు

డెబిట్‌, క్రెడిట్‌ కార్డులకు సంబంధించి కార్డు యాక్టివేషన్‌, క్రెడిట్‌ లిమిట్‌ పెంపు నిబంధనల అమలుకు బ్యాంక్‌లు, ఎన్‌బీఎ్‌ఫసీలకు ఆర్‌బీఐ మరో 3 నెలల గడువిచ్చింది. డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల జారీ, వాటి నిర్వహణకు సంబంధించిన గతంలో ఆర్‌బీఐ విడుదల చేసిన మాస్టర్‌ డైరెక్షన్‌ జూలై 1 నుంచి అమలులోకి రావాల్సింది. ఇండస్ట్రీ వర్గాల వినతి మేరకు కొన్ని నిబంధనల అమలు గడువును మాత్రం 2022 అక్టోబరు 1కి పొడిగిస్తూ ఆర్‌బీఐ మంగళవారం సర్కులర్‌ జారీ చేసింది. మిగతావి మాత్రం జూలై 1 నుంచే అమలులో రానున్నాయి. 

Updated Date - 2022-06-22T09:34:58+05:30 IST