సాగులో సంబరంగా..జిల్లాలో ఎటుచూసినా పచ్చదనమే

ABN , First Publish Date - 2020-07-06T11:44:31+05:30 IST

వానాకాలం పంటల సాగులో సిద్దిపేట జిల్లా రైతులు నిమగ్నమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వడివడిగా సాగు

సాగులో సంబరంగా..జిల్లాలో ఎటుచూసినా పచ్చదనమే

ప్రాధాన్య పంటలకే పెద్దపీట

కాళేశ్వరం నీళ్లతో పెరిగిన భూగర్భజలాలు

సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం

ఇప్పటికే 3.50 లక్షల ఎకరాల్లో మొదలైన సాగు


 ఆంధ్రజ్యోతిప్రతినిధి, సిద్దిపేట, జూలై 5: వానాకాలం పంటల సాగులో సిద్దిపేట జిల్లా రైతులు నిమగ్నమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వడివడిగా సాగు ప్రారంభించారు. కొద్దిరోజులుగా అనుకూలమైన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నది. సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సుమారు 5లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఇప్పటికే మూడో వంతు సాగు చేపట్టారు. 


పెద్దపంటగా తెల్లబంగారం

 ప్రతీసారి జిల్లాలో వరి, మొక్కజొన్న పంటలతో పాటు పత్తి సాగు పోటాపోటీగా ఉండేది. అయితే ఈసారి మొక్కజొన్నను నియంత్రించిన తరుణంలో  రైతులంతా తెల్లబంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. స్వీట్‌కార్న్‌, పౌల్ర్టీ కోసం మాత్రమే మొక్కజొన్నను పండిస్తున్నారు. ఇక పత్తిసాగు ఇప్పటికే దాదాపు 1.80లక్షల ఎకరాల వరకు చేరింది. వరి కూడా లక్ష ఎకరాల మార్కు దాటింది. సుమారు 25వేల ఎకరాల్లో కందిని సాగు చేశారు. ఇది 70వేల ఎకరాలకు చేరే అవకాశం ఉంది. గతేడాది 1.50లక్షల ఎకరాల్లో సాగైన మొక్కజొన్న ఈసారి మాత్రం 3,500 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. ఇది కూడా రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. గజ్వేల్‌, వర్గల్‌, మర్కుక్‌ మండలాల్లో మాత్రమే మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ప్రాధాన్య పంటల సాగులో విజయసంకేతంగా దీనిని వ్యవసాయశాఖ అధికారులు పరిగణిస్తున్నారు. 


భూగర్భంలో జలకళ

  ఓ పక్క కాళేశ్వరం జలాలు, మరోవైపు వర్షం నీళ్లతో భూగర్భానికి జలకళ సంతరించుకున్నది. ఐదేళ్లలో పోల్చితే అత్యుత్తమమని చెబుతున్నారు. గతేడాది జూన్‌లో సిద్దిపేట జిల్లా సగటున 19.69 మీటర్ల లోతులో భూగర్భజలాలు ఉన్నాయి. ప్రస్తుతం 14 మీటర్ల లోతుకు నీళ్లు ఉబికి వచ్చాయి. గత మే నెలలోనూ 15 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నాయి. తాజా పరిస్థితులు ఆశాజనకంగా ఉండడానికి జిల్లాలో నిర్మించిన రంగనాయకసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్లు, వాటి కాలువల ద్వారా చెరువులకు కాళ్వేర జలాలు రావడమే కారణంగా తెలుస్తున్నది. భూగర్భజలాల పెరుగుదలతో బావులు, బోర్ల సమస్యలు తొలిగాయి. అడుగంటిన జలాలు సైతం పైకి రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


 భారీ వర్షాలతో రైతుల్లో హర్షం

వరుణుడు కరుణించడంతో సమాయనుకూలంగా వర్షాలు కురుస్తున్నాయి. మే నెలాఖరు, జూన్‌ మొదటివారాల్లోనే వర్షాలు పడడంతో రైతులంతా సాగుపై దృష్టి పెట్టారు. జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు 129మిల్లిమీటర్ల సగటు వర్షాపాతం జిల్లాలో నమోదుకావాలి. కానీ నేటి వరకు 268మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 108 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ లెక్కన ఈసారి వర్షపాతం కూడా రైతులకు అనుకూలంగా మారింది. పది రోజుల క్రితం సిద్దిపేటలో 21 సెం.మీల భారీ వర్షం నమోదైం ది. 30 ఏళ్లలో ఇదే అత్యధికం. శనివారం కూడా మద్దూరులో 15 సెం.మీ, మిరుదొడ్డిలో 10సెం.మీలు, మిగితామండలాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. 


 సలహాలు, సూచనలు పాటించాలి- శ్రవణ్‌, జిల్లా వ్యవసాయాధికారి

ప్రస్తుత వానాకాల పంటలకు  అనుకూల  వాతావరణం ఉంది. ఒక్క ఎకరం కూడా ఖాళీగా ఉండకుండా ప్రాధాన్యపంటలు సాగుచేస్తున్నారు. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను ఏవోలు, ఏఈవోల ద్వారా స్వీకరించాలి. పంట తొలి దశ నుంచే ప్రత్యేక దృష్టి సారిస్తే మంచి దిగుబడి వస్తుంది.  రైతులకు అందుబాటులోనే పుష్కలంగా నీళ్లు కూడా ఉన్నాయి. వర్షాలూ సమృద్ధిగా పడతాయి. 

Updated Date - 2020-07-06T11:44:31+05:30 IST