రేపటి నుంచి మరింత స్వేచ్ఛ

ABN , First Publish Date - 2020-06-07T07:23:09+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలను కృష్ణాజిల్లా ప్రభుత్వ యంత్రాగం మరింతగా సడలించింది.

రేపటి నుంచి మరింత స్వేచ్ఛ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): లాక్‌డౌన్‌ నిబంధనలను కృష్ణాజిల్లా ప్రభుత్వ యంత్రాగం మరింతగా సడలించింది. దాదాపు లాక్‌డౌన్‌ నిబంధనలను ఎత్తేసినట్లే. ఈ నెల 8 నుంచి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా షాపింగ్‌ మాల్స్‌కు, హోటల్స్‌, రెస్టారెంట్లకు అనుమతులు ఇచ్చింది. అలాగే ఇప్పటి వరకు మూగబోయిన ప్రార్థనామందిరాలైన దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర ఆధ్యాత్మిక సంస్థలు ప్రారంభం కానున్నాయి. కంటైన్‌మెంట్‌ క్లస్టర్‌ ప్రాంతాలు మినహా, మిగిలిన ప్రాంతాల్లో కార్యకలాపాలకు అనుమతులు ఇస్తున్నట్టు కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జూన్‌ 8 నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలను నడలిస్తున్నామని తెలిపారు.


వేటికైతే అనుమతులు వచ్చాయో అవి తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలను పాటించాలన్నారు. ప్రవేశ ద్వారం వద్ద వినియోగదారులకు థర్మల్‌ స్కానింగ్‌ చేయాలని, మాస్క్‌లున్నవారినే అనుమతించాలని, భౌతిక దూరం పాటించేలా, శానిటైజర్లు అందుబాటులో ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల మధ్య ఆరడుగుల దూరం ఉండేలా జాగ్రత్తలు పాటించాలన్నారు. పనిచేసే సిబ్బంది మాస్క్‌లు, గ్లౌజులు ధరించాలని కలెక్టర్‌ అన్నారు. అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కలెక్టర్‌ అన్నారు. ప్రతిరోజు హోటల్స్‌, రెస్టారెంట్స్‌, షాపింగ్‌ మాల్స్‌, శుభ్రపరచాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు.


వినియోగదారుల పరిమితికి అనుగుణంగా ఆయా హోటల్స్‌లోని సీటింగ్‌ సదుపాయం మేరకు 50శాతం మంది వినియోగదారులను మాత్రమే అనుమతించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. మతపరమైన ప్రార్థన మందిరాలు, చర్చిలు, మసీద్‌లకు అనుమతించిన దృష్ట్యా ప్రభుత్వ నిర్దేశిత నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. సమావేశాలకు హాజరైన భక్తులు వివరాలు సేకరించి పొందుపరచాలన్నారు. కొవిడ్‌-19 పరిస్దితుల దృష్ట్యా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందన్నారు. షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్స్‌, హోటల్స్‌ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, అవసరమైతే మూసివేస్తామని కలెక్టర్‌ హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌, జాయింట్‌ కలెక్టర్‌ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్‌, డీసీపీ విక్రాంత్‌ పాటిల్‌, ఏసీపీ విష్ణువర్ధన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T07:23:09+05:30 IST