Hyderabad లో మరిన్ని అభివృద్ధి పనులు.. కమిటీ గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2022-05-12T18:34:29+05:30 IST

మహానగరంలో (Hyderabad) మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్టాండింగ్‌

Hyderabad లో మరిన్ని అభివృద్ధి పనులు.. కమిటీ గ్రీన్ సిగ్నల్

  • పలు పనులకు స్టాండింగ్‌ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌
  • పంజాగుట్ట, అమీర్‌పేటలో ఆధునిక మార్కెట్లు
  • పాత వాటి స్థానంలో నిర్మాణం
  • ఖైరతాబాద్‌లో కన్వెన్షన్‌ హాల్‌
  • పలు ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ

హైదరాబాద్‌ సిటీ : మహానగరంలో (Hyderabad) మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్టాండింగ్‌ కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ (Green Signal) ఇచ్చింది. వివిధ ప్రాంతాల్లో రూ. 43.65 కోట్లతో ప్రతిపాదించిన పనులను బుధవారం జరిగిన సమావేశంలో సభ్యులు ఆమోదించారు. అమీర్‌పేట, పంజాగుట్టలో పాత మార్కెట్ల స్థానంలో ఆధునిక మార్కెట్లు (Markets) నిర్మించాలని నిర్ణయించారు. అమీర్‌పేటలో రూ. 13.20 కోట్లతో, పంజాగుట్టలో రూ. 6.70 కోట్లతో ఆధునిక మార్కెట్ల నిర్మాణానికి ఓకే చెప్పారు. ఖైరతాబాద్‌ ఇందిరానగర్‌ రెండు పడకల ఇళ్ల కాలనీలో రూ. 18 కోట్లతో స్టేట్‌ ఆఫ్‌ ఆర్ట్‌ కన్వెన్షన్‌ హాల్‌ నిర్మించనున్నారు. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


ఆమోదించిన మరిన్ని అంశాలు

- లాలాపేట ఫ్లై ఓవర్‌ (Fly Over) నుంచి మౌలాలి వంతెన వరకు రూ. 3 కోట్లతో 100 అడుగుల బీటీ రోడ్డు నిర్మాణం. 

- బండ్లగూడ తులసినగర్‌ నుంచి వాడి-ఇ-హుడ్‌ మార్గంలో వయా నూరి నగర్‌ బీ బ్లాక్‌, మిలాబ్‌నగర్‌, గౌస్‌నగర్‌, ముస్తఫా హిల్స్‌ ప్రాంతాల్లో 100 అడుగుల రోడ్డు వెడల్పునకు 544 ఆస్తుల సేకరణ.

- ఎల్‌బీనగర్‌లో ప్రియదర్శిని హోటల్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం, దుబాయ్‌ గేట్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు 60 మీటర్ల రోడ్డు విస్తరణకు 352 ఆస్తుల సేకరణ. 

- ఎస్‌హెచ్‌జీల ద్వారా నాలుగు మౌంటింగ్‌ ఫాగింగ్‌ మెషీన్లను ఈనెల 1 నుంచి అక్టోబర్‌ 31వ తేదీ వరకు అద్దె ప్రతిపాదికన ఆరు నెలలపాటు కొనసాగించాలి. ఒక్కో వాహనానికి నెలకు రూ. 2,99,039 చెల్లింపు.

- సాగర్‌ మెయిన్‌ రోడ్డు నెంబర్‌-15 నుంచి వనస్థలిపురం క్రిస్టియన్‌ కాలనీ మీదుగా హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ కల్వర్టు వరకు రూ. 2.75 కోట్లతో ఆర్‌సీసీ పైపులైన్ల నిర్మాణం. 

- ఈఎస్ఐ మెట్రో స్టేషన్‌ నుంచి ఏఎల్‌ఎన్‌ యాదవ్‌ పార్కు (Park) మీదుగా ఈఎస్ఐ ప్రహరీ ఆనుకొని 40 అడుగుల మేర రోడ్డు విస్తరణ. 

- రేతిఫైల్‌ నుంచి అల్ఫాహోటల్‌ వరకు 36 మీటర్ల రోడ్డు వెడల్పునకు 82 ఆస్తులు, అల్ఫా నుంచి పాత గాంధీ ఆస్పత్రి వరకు 30 మీటర్ల రహదారి విస్తరణకు 19, ఓల్డ్‌ గాంధీ ఆస్పత్రి నుంచి వయా మోండా మార్కెట్‌ మీదుగా సికింద్రాబాద్‌ వరకు 46 ఆస్తుల సేకరణ.

Read more