చైనాలో మరిన్ని ఆంక్షలు.. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన జియాన్

ABN , First Publish Date - 2022-01-06T22:43:12+05:30 IST

వింటర్ ఒలింపిక్స్, చైనా న్యూ ఇయర్ సెలవుల వేళ కరోనా వైరస్ మరింత చెలరేగకుండా చైనా..

చైనాలో మరిన్ని ఆంక్షలు.. అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన జియాన్

బీజింగ్: వింటర్ ఒలింపిక్స్, చైనా న్యూ ఇయర్ సెలవుల వేళ కరోనా వైరస్ మరింత చెలరేగకుండా చైనా మరిన్ని ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా హెనాన్ ప్రావిన్స్‌లో గత 24 గంటల్లో కొత్త కేసులు మరిన్ని వెలుగు చూడడంతో అప్రమత్తమైన ప్రభుత్వం మరికొన్ని నగరాల్లో ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక్కడ 64 స్థానిక సాంక్రమిక కేసులు, 9 స్థానిక లక్షణాలు లేని కేసులు నమోదైనట్టు ప్రావిన్షియల్ హెల్త్ కమిషన్ గురువారం తెలిపింది. 


హెనాన్ కౌంటీలోని గుషిలో పది లక్షల మంది నివసిస్తుండగా, ఇక్కడ ఒక లక్షణాలున్న కేసు, లక్షణాలు లేని మరో కేసు నిన్న నమోదైంది. ఈ నేపథ్యంలో స్థానికులు ఎవరూ పట్టణం విడిచిపెట్టకుండా, మరెవరూ బయటి నుంచి లోపలికి రాకుండా అధికారులు ఆంక్షలు విధించారు. ప్రావిన్షియల్ రాజధాని ఝెంగ్జౌలో పెద్ద సంఖ్యలో పరీక్షలు చేస్తుండగా, అదే ప్రావిన్సులోని యుఝౌ నగరంలో లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఇక్కడ 1.1 మిలియన్ల మంది నివసిస్తున్నారు.


జియాన్‌లో గత రెండు వారాలుగా లాక్‌డౌన్ అమల్లో ఉంది. బుధవారం ఇక్కడ 63 కేసులు నమోదు కాగా అంతకుముందు రోజు 35 కేసులు వెలుగు చూశాయి. జియాన్‌లోని జియాన్యాంగ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో బుధవారం అన్ని అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయాయి. అంతకుముందే దేశీయ విమానాల రాకపోకలు కూడా ఆగిపోయాయి. కాగా నగరంలో వైరస్ వ్యాప్తి చెందడానికి పాకిస్థాన్ నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికుడే కారణమని అధికారులు గుర్తించారు.   

Updated Date - 2022-01-06T22:43:12+05:30 IST