మరింత కట్టుదిట్టంగా...

ABN , First Publish Date - 2020-03-29T10:39:24+05:30 IST

జిల్లాలో శనివారం లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా సాగింది. గత నాలుగైదు రోజులు పట్టణాల్లో మెడికల్‌ షాపులు, ఆస్పత్రులతో

మరింత కట్టుదిట్టంగా...

జిల్లా అంతటా నిర్మానుష్య వాతావరణం

ఆరో రోజు లాక్‌డౌన్‌ విజయవంతం


ఒంగోలు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా సాగింది. గత నాలుగైదు రోజులు పట్టణాల్లో మెడికల్‌ షాపులు, ఆస్పత్రులతో పాటు నిత్యవసరాల దుకాణాలు కనిపించగా శనివారం దాదాపుగా అన్ని మూతపడ్డాయి. అంతా నిర్మానుష్య వాతావరణమే కనిపించింది. జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలు తీరుపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్షించారు. పకాశం భవన్‌లోని స్పందన భవన్‌లో శనివారం ఉదయం సమావేశం జరిగింది. మొత్తం యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి శనివారం సాయంత్రం కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. అలాగే మాజీ మంత్రి పాలేటిరామారావు, వైసీపీ నేత కరణం వెంకటేష్‌లు చీరాలలో మునిసిపల్‌ కమిషనర్‌తో భేటి అయి పట్టణంలో తాజా పరిస్థితిపై చర్చించారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ అద్దంకిలో ఏర్పాటు చేసిన కూరగాయ దుకాణాల ప్రాంగణాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడారు. 


చీరాల దంపతులకు పాజిటివ్‌

జిల్లాలో మరో రెండు పాజిటివ్‌ కేసులు శనివారం నమోదయ్యాయి. ఇప్పటికే ఒంగోలుకు చెందిన లండన్‌ నుంచి వచ్చిన యువకుడికి కరోనా పాజిటివ్‌వచ్చి స్థానిక రిమ్స్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న విషయం విదితమే. తాజాగా చీరాలకు చెందిన దంపతులకు పాజిటివ్‌ వచ్చినట్లు శనివారం మధ్యాహ్నం వైద్యశాఖ అధికారులు గుర్తించారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు మూడుకు చేరగా అనుమానిత కేసులు కూడా పలుప్రాంతాల నుంచి వస్తున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం మరింత అప్రమత్తమయ్యారు. 


కొనసాగుతున్న సహాయక చర్యలు

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ తీవ్రతతో తిండికి ఇబ్బందిపడుతున్న వారికి, అలాగే ప్రభుత్వం నిర్దేశించిన చర్యలలో భాగస్వామ్యులవుతున్న సిబ్బందికి పలు సహాయక చర్యలలో విభిన్న వర్గాలకు చెందిన దాతలు భాగస్వామ్యులు అవుతున్నారు. తన ఎమ్మెల్యే కోటా నిధుల నుంచి రూ.65 లక్షలను మంత్రి బాలినేని విరాళంగా ఇచ్చారు. ఆ మేరకు శనివారం ఇక్కడ జరిగిన సమీక్షా సమావేశంలో ప్రకటించారు. దర్శి; చీమకుర్తి, పెద్దారవీడు, సీఎస్‌పురం, పర్చూరులో పాటు ఒంగోలులో వివిధ వర్గాలకు చెందిన వారు పేదలకు నిత్యవసరాలు, భోజనాలు, అలాగే మాస్కులు, శానిటైజర్లు ఇతరత్రా పంపిణీ చేశారు.


రేపు మార్కాపురంలో సమీక్ష

మార్కాపురం డివిజన్‌లో కరోనా నివారణ చర్యలు, లాక్‌డౌన్‌ అమలుపై మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈనెల 30న సమీక్ష నిర్వహించనున్నారు. మార్కాపురం సమీపంలోని జార్జి ఫార్మసీ కాలేజీలో ఉదయం 11.30కు ఈ సమావేశం జరగనుండగా ఆ డివిజన్‌కు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా ప్రత్యేక అధికారిణి బీ.ఉదయలక్ష్మీ, కలెక్టర్‌ పోలా భాస్కర్‌ పాల్గొనున్నారు. 


Updated Date - 2020-03-29T10:39:24+05:30 IST