మరింత కట్టుదిటం..

ABN , First Publish Date - 2020-04-04T10:18:32+05:30 IST

కరోనా నియంత్రణకు గాను ఖమ్మం జిల్లా యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌

మరింత కట్టుదిటం..

తెలంగాణ, ఏపీ సరిహద్దుల మూసివేత 

ఏపీలోని నందిగామలో హైఅలెర్ట్‌

మధిర వాసుల్లో పెరుగుతున్న ఆందోళన


మధిర, ఏప్రిల్‌ 3: కరోనా నియంత్రణకు గాను ఖమ్మం జిల్లా యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచే తెలుగురాష్ట్రాల మధ్య రాకపోకలు తగ్గిపోగా.. ఇటీవల ఢిల్లీ మతప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్న నేపథ్యంలో సరిహద్దులను పూర్తిగా మూసేస్తున్నార. ఖమ్మం జిల్లా మధిర మండలానికి సరిహద్దున ఉన్న ఏపీలోని కృష్ణా జిల్లా నందిగామ, జగ్గయ్యపేటల్లో  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మఽధిర సరిహద్దుగ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీప్రభుత్వం నందిగామలో హైఅలర్ట్‌  ప్రకటించడంతో ఒక గ్రామంనుంచి మరో గ్రామానికి సంబంధాలను నిలిపేసింది.


ఈ క్రమంలోనే ఏపీ నుంచి తెలంగాణ వచ్చే అన్ని రహదారులను మధిర అధికారులు, ప్రజలు బంద్‌ చేశారు. ఇప్పటికే ఈ రహదారులు బంద్‌కాగా.. చాలా గ్రామాల వారు లింక్‌రోడ్ల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా నందిగామలో కేసులు వెలుగులోకి వచ్చాయన్న సమాచారంతో శుక్రవారం మధిర మండలంలోని అన్ని సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తమై.. ఏపీ వైపు నుంచి ఎవరినీ రానియ్యకుండా అడ్డుకుంటున్నారు. మడుపల్లి- తాళ్లూరు రోడ్డు, దేశినేనిపాలెం వద్ద గ్రామీణ రోడ్డు, ఆత్కూరు, మాటూరుపేట, సిరిపురం, మర్లపాడు,  చిలుకూరు తదితర గ్రామాల వద్ద రాకపోకలను బంద్‌ చేశారు. అయితే ప్రస్తుతానికి అంతా ప్రశాంతంగానే ఉందని మధిర టౌన్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ తెలిపారు.  


భద్రాద్రి వద్ద యథేచ్ఛగా రాకపోకలు.. 

భద్రాచలంటౌన్‌ :  తెలుగు రాష్ట్రల్లో కరోనావైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కానీ భద్రాచలం పట్టణంలోని ఏపీ సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద పోలీసులు భద్రతను గాలికొదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం ఏపీ నుంచి రాకపోకలు యథేచ్ఛగా సాగాయి. ఇప్పటికే  తూర్పుగోదావరిలో తొమ్మిది, పశ్చిమగోదావరిలో 15, కృష్ణాజిల్లాల్లో 23 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు తెలియడంతో.. ఆ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగితే ఇక్కడి పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అయితే సరిహద్దులోని చెక్‌పోస్టు ద్వారా ప్రజల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని ఇప్పటికే భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి.. భద్రాచలం ఏఎస్పీ రాజేష్‌చంద్రకు ఫోన్‌ చేసి సూచించారు. కానీ కలెక్టర్‌ ఆదేశాలను కూడా పెడచెవిన పెట్టిన కొందరు పోలీసలు భద్రాచలం వద్ద ప్రజల రాకపోకల నియంత్రించకుండా ప్రేక్షక పాత్రవహిస్తున్నారనే విమర్శలున్నాయి.  

Updated Date - 2020-04-04T10:18:32+05:30 IST