మరింత భారం

ABN , First Publish Date - 2022-08-05T04:57:48+05:30 IST

వ్యవసాయం ఎప్పుడూ భారమే. మరీ ఇంత భారమవుతుందని రైతులు అనుకోలేదు. పురుగుల నివారణకు వాడే పిచికారి మందుల ధర తాజాగా10 శాతం పెరిగాయి.

మరింత భారం

పది శాతం పెరిగిన పురుగు మందుల ధరలు
పెరగనున్న పెట్టుబడి వ్యయం
 రైతులపై అదనపు భారం


నంద్యాల, (ఆంధ్రజ్యోతి): వ్యవసాయం ఎప్పుడూ భారమే. మరీ ఇంత భారమవుతుందని రైతులు అనుకోలేదు. పురుగుల నివారణకు వాడే పిచికారి మందుల ధర తాజాగా10  శాతం పెరిగాయి. ఆర్నెల్ల కింద ఎరువుల ధరలు దాదాపు 40 శాతం పెరిగాయి. వీటికి తోడు పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదల వ్యవసాయాన్ని మరింత ప్రభావితం చేస్తోంది. అకాల వర్షాలతో అంతుచిక్కని తెగుళ్లు మరింత కుంగదీస్తున్నాయి. చీడపీడల నివారణకు గతంలో కన్నా అధికంగా పురుగు మందులు పిచికారి చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. వరి వంటి పంటలకు పలు దఫాలుగా పురుగు మందుల్ని పిచికారి చేయాల్సి వస్తోంది. పది శాతం పెరిగిన ధరలతో పిచికారీ మందులు వాడితే  పెట్టుబడులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఇంత ఖర్చు చేసినా దిగుబడులు ఎలా ఉంటాయో, మార్కెట్‌లో ధరలు ఎలా ఉంటాయో నమ్మకం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

 ప్రతి మందుపై రూ.200 పెరుగుదల..

పెరిగిన పురుగుమందుల ధరలతో జిల్లా రైతాంగంపై గతంలో కంటే ఎక్కువ భారం పడనుంది. జిల్లాలో ఏటా పురుగుమందులపై జిల్లా రైతాంగం వందల కోట్ల వరకు వ్యయం చేస్తుంది. పెరిగిన ధరల వల్ల అదనంగా మరో రూ.20 నుంచి రూ.30 కోట్ల వరకు రైతులకు భారం కానుంది.

పెరగనున్న మందుల ధరలు (లీటరుకు రూపాయలలో)

మందుపేరు      పాతధర    కొత్తధర
ఎసిఫేట్‌        రూ.520    రూ.620
ఇమిడాక్లోప్రిడ్‌    రూ.1000    రూ.1200
మోనో క్రోటోపాస్‌    రూ.370    రూ.450
గ్లైఫోనిల్‌        రూ.470    రూ.570

ఇలా గతంతో పోలిస్తే ప్రతి పురుగుమందుపై వంద నుంచి రూ.200 వరకు ధర పెరిగింది.   

 వాణిజ్య పంటలకు...

వాణిజ్యపంటలైన మిర్చి, పత్తి పంటల కు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. వరికి కూడా క్రమం తప్పకుండా మందులను పిచికారి చేస్తేనే మంచి దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు. పంటను కాపాడుకోవడానికి వారానికి రెండుసార్లు తెగుళ్ల మందులను పిచికారి చేస్తూనే ఉంటారు. పెరిగిన ధరలు మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంగా వారిని మరింత అగాఽథంలోకి తోసేస్తున్నాయి. పత్తికి మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ గతేడాది గులాబీ పురుగు వల్ల దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. ఒక వైపు నకిలీ పురుగు మందులు, మరోవైపు ధరల బాదుడు కలిసి రైతుకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.

ముడి పదార్థాల ధరలు పెరగడం వల్లే

పురుగుమందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు ఎక్కువగా జపాన్‌, చైనా తదితర దేశాల నుంచి దిగుమతి అవుతుంటాయి. అందువల్లనే దేశీయంగా పురుగు మందుల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు పెరిగిన ఇంధన ధరల వల్ల రవాణా ఖర్చులు పెరిగి ఆ ప్రభావం కూడా ధరలపై పడుతోంది. కరోనా తదనంతర పరిణామాల నేపథ్యలో విదేశాలలో సైతం ముడిపదార్థాల కొరత తలెత్తి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు.

 ప్రభుత్వానిది ప్రేక్షక పాత్ర

గతంలో ఎరువుల ధరలు పెరిగినప్పటికీ కొన్నింటిపై కేంద్రం ఇచ్చే రాయితీని కూడా పెంచి పెరిగిన ధరల భారం కనపడకుండా కొంత మేర రైతాంగానికి ఊరట కల్పించింది. కానీ రసాయన మందుల విషయంలో అలాంటి రాయితీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొరవడడంతో రైతులకు పెట్టుబడి ఖర్చుల్లో భారీ తేడా రానుంది. ఎకరానికి దాదాపు రూ.2,500 వరకు పెట్టుబడి ఖర్చులు పెరగనున్నాయని, అదే వాణిజ్య పంటలకు అయితే రూ.3,500 వరకు అదనంగా వ్యయం కానుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

Updated Date - 2022-08-05T04:57:48+05:30 IST