‘బెల్టు’ తీస్తారా..!?

ABN , First Publish Date - 2022-08-01T03:47:49+05:30 IST

తెల్లవారకముందే మద్యం సేవించే మందుబాబులు ఎక్కువయ్యారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు దుకాణాల నిర్వహణ జోరందుకోంది.

‘బెల్టు’ తీస్తారా..!?
మద్యం షాపు

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

క్వార్టర్‌ సీసాపై రూ.100 అదనం

చోద్యం చూస్తున్న అధికారులు

ఉదయగిరి, జూలై 31: తెల్లవారకముందే మద్యం సేవించే మందుబాబులు ఎక్కువయ్యారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు దుకాణాల నిర్వహణ జోరందుకోంది. యథేచ్ఛగా అనధికారిక విక్రయాలు సాగుతున్నాయి. ఒక్కో క్వార్టర్‌ (180 ఎంల్‌) సీసాపై అదనంగా రూ.100 వసూలు చేస్తున్నారు. ఎక్కువ వసూలు చేయడంపై మందుబాబులు ఆందోళన చెందుతున్నప్పటికీ రేయింబవళ్లు తేడా లేకుండా 24 గంటలు గ్రామంలోనే మద్యం దొరుకుతుండడంతో అదనపు బాదుడుని ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో మద్యం అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఊరూరా బహిరంగంగా బెల్టుషాపులున్నా సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో బెల్టు దుకాణాల తొలగింపు జరిగేనా అన్న సందేహాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

మొబైల్‌ మద్యం వ్యాపారం

ఉదయగిరి పట్టణంలో మూడు, సీతారామపురం, పెద్దిరెడ్డిపల్లి, దుత్తలూరులో ఒకటి చొప్పున మద్యం షాపులు ఉన్నాయి. గ్రామాల్లో అంతకుమించి బెల్టు వ్యాపారం జోరుగా సాగుతోంది. కొత్తగా బెల్టుషాపులతోపాటు కొందరు ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో తిరుగుతూ మొబైల్‌ మద్యం వ్యాపారం సాగిస్తున్నారు. దీంతో గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోందని, గొడవలు ఎక్కువవుతున్నాయని పలువురు వాపోతున్నారు. అనధికారిక మద్యం విక్రయాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్‌ అధికారులు దీనిని పూర్తిగా నియంత్రించలేకున్నారు.  

సిబ్బంది చేతివాటం

ప్రభుత్వం మద్యం దుకాణాల్లో మూడు బాటిళ్లకు మించి విక్రయించకూడదన్న నిబంధన ఉంది. అయితే అక్కడ పనిచేసే సిబ్బంది అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ బెల్టు దుకాణాల నిర్వాహకులతో సత్సంబంధాలు పెట్టుకొని కేసులు కేసులు విక్రయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దుత్తలూరు మండలంలో 50కిపైగా బెల్టుషాపులు ఉన్నట్లు తెలిసింది. దుత్తలూరు మద్యం షాపులో పని చేసే సిబ్బంది రాత్రివేళ ద్విచక్ర వాహనంపై బెల్టు దుకాణాలకు మద్యం చేరవేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఏరుకొల్లు గ్రామంలో జరిగిన వివాహా వేడుకలకు రాత్రివేళ సిబ్బంది వాహనంపై మూడు కేసుల మద్యం తీసుకెళ్లి అందచేయడాన్ని గమనించిన గ్రామస్థులు విస్తుపోయారు. అలాగే ద్తుతలూరులో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉదయగిరి మండలంలో 30కిపైగా బెల్టుషాపులు ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దిరెడ్డిపల్లి మద్యం దుకాణంలో పనిచేసే కొందరు సిబ్బంది  రాత్రివేళ ఉదయగిరి, సీతారామపురం మండలాల్లోని పలు గ్రామాల్లోని బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తూ జేబులు నింపుకొంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎక్సైజ్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు ఉన్నాయి.

Updated Date - 2022-08-01T03:47:49+05:30 IST