బీజేపీపై మరింత దూకుడు

ABN , First Publish Date - 2022-01-18T09:08:07+05:30 IST

బీజేపీ విషయంలో దూకుడుగా వెళ్లాల్సిందేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలతో అన్నారు.

బీజేపీపై మరింత దూకుడు

  • కేంద్రం నిర్ణయాలను పార్లమెంటులో ఎండగట్టాలి
  • టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం
  • ‘ధరణి లోపాల పరిష్కారానికి అవకాశమివ్వాలని నిర్ణయం

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీ విషయంలో దూకుడుగా వెళ్లాల్సిందేనని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలతో అన్నారు. ఆ పార్టీని ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదన్నారు. సోమవారం జరిగిన క్యాబినెట్‌ భేటీకి టీఆర్‌ఎస్‌ ఎంపీలను కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారితో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం.. రానున్న పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇక ధరణి పోర్టల్‌కు సంబంధించి ఏర్పాటైన సబ్‌కమిటీ తమ నివేదికను క్యాబినెట్‌కు సమర్పించగా.. దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ధరణితో భూ సమస్యలు చాలావరకు పరిష్కారమైనా.. ఇంకా లోపాలు కూడా ఉన్నట్లు సబ్‌ కమిటీ పేర్కొంది. దీంతో ఆ లోపాల పరిష్కారానికి అవకాశం ఇవ్వాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. హైరాబాద్‌లో మెట్రోరైల్‌ నిర్వహణపైనా కీలక చర్చ జరిగినట్లు సమాచారం. మెట్రోరైల్‌ నిర్వహణ తమకు భారమవుతోందంటూ ఎల్‌అండ్‌టీ కంపెనీ చెబుతోందని, కానీ.. ఎట్టిపరిస్థితుల్లోనూ దానిని వదులుకోవద్దని ముఖ్యమంత్రి అన్నట్లు తెలిసింది. 

Updated Date - 2022-01-18T09:08:07+05:30 IST