సూపర్‌ బగ్‌ల కేంద్రం మూసీ!

ABN , First Publish Date - 2020-08-07T07:48:21+05:30 IST

హైదరాబాద్‌లో ప్రవహించే మూసీ నది సూపర్‌ బగ్‌లుగా పిలిచే మొండి బ్యాక్టీరియాల ఉత్పత్తి కేంద్రంగా (ఫ్యాక్టరీ) తయారైందని బ్రిటన్‌కు చెందిన బర్మింగ్‌హాం విశ్యవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జాన్‌ కెఫ్ట్‌ వ్యాఖ్యానించారు...

సూపర్‌ బగ్‌ల కేంద్రం మూసీ!

  • నదిలో కోకొల్లలుగా మొండి బ్యాక్టీరియాలు
  • యాంటీ బయాటిక్‌లు వాటినేం చేయలేవు
  • వ్యర్థాల ప్రభావ అధ్యయనానికి బ్రిటన్‌-భారత్‌ నిర్ణయం

లండన్‌, ఆగస్టు 6: హైదరాబాద్‌లో ప్రవహించే మూసీ నది సూపర్‌ బగ్‌లుగా పిలిచే మొండి బ్యాక్టీరియాల ఉత్పత్తి కేంద్రంగా (ఫ్యాక్టరీ) తయారైందని బ్రిటన్‌కు చెందిన బర్మింగ్‌హాం విశ్యవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ జాన్‌ కెఫ్ట్‌ వ్యాఖ్యానించారు. గతంలో తాము చేసిన అధ్యయనంలో ఈ విషయం బయట పడిందని చెప్పారు. తాజాగా హైదరాబాద్‌లోని ఔషధ పరిశ్రమల నుంచి వెలువడే యాంటీ బయాటిక్‌ల వ్యర్థాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు మూసీ నదిలో కలిసి ప్రయాణించడంలో ఆ రెండింటిలో వచ్చే మార్పులను అధ్యయనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో ఐఐటీ హైదరాబాద్‌, బర్మింగ్‌హాం విశ్వవిద్యాలయం కలిసి పాల్పంచుకుంటున్నట్లు జాన్‌ కెఫ్ట్‌ చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం బ్రిటన్‌, భారత ప్రభుత్వాలు కలిసి రూ.12 కోట్ల నిధులు ఇచ్చినట్లు చెప్పారు. వివిధ రకాల బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్‌లను తట్టుకొనే శక్తిని సాధించడం వెనుక నదుల్లో కలిసిన యాంటీబయాటిక్‌ వ్యర్థాల పాత్ర ఎంత అనేది రెండు విద్యాసంస్థలు అధ్యయనం చేస్తాయన్నారు. మూసీ వరదల సందర్భంలో ఇవి పొలాల్లోకి వెళ్లినపుడు జరిగే మార్పులనూ పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. తద్వారా ఎవరికీ హాని కలిగించకుండా ఎంత మోతాదులో యాంటీ బయాటిక్‌ వ్యర్థాలను వదలవచ్చో ప్రమాణాలను నిర్దేశిస్తామని ప్రకటించారు. ఔషధ వ్యర్థాలు ఎక్కువగా ఉండే హైదరాబాద్‌లోని మూసీ నదిని, అంతగా కలుషితం కాని చెన్నైలోని అడయార్‌ నదిని పరిశోధనకు ఎంచుకున్నామని చెప్పారు. ఈ అధ్యయనం ద్వారా దేశంలోని అన్ని నదులకు ఒక నమూనాను రూపొందిస్తామని ఐఐటీహెచ్‌ ప్రొఫెసర్‌ తాటికొండ శశిధర్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-08-07T07:48:21+05:30 IST