Wipro: విప్రో చైర్మన్ సంచలన వ్యాఖ్య.. ఐటీ ఉద్యోగులు మోసం చేస్తున్నారంటూ..

ABN , First Publish Date - 2022-08-21T22:09:45+05:30 IST

టెక్ రంగంలో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు జాబ్స్ చేస్తున్న వైనంపై విప్రో సంస్థ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.

Wipro: విప్రో చైర్మన్ సంచలన వ్యాఖ్య.. ఐటీ ఉద్యోగులు మోసం చేస్తున్నారంటూ..

ముంబై: టెక్ రంగంలో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు జాబ్స్ చేస్తున్న వైనంపై దిగ్గజ ఐటీ సంస్థ విప్రో(Wipro) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వారు సంస్థలను మోసం చేస్తున్నారంటూ కుండబద్దలు కొట్టారు. శనివారం ట్విటర్ వేదికగా రిషద్(Rishad premji) స్పందించారు. ‘‘టెక్ రంగంలో కొందరు మూన్‌లైటింగ్ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మోసమే’’ అని రిషద్ ట్వీట్ చేశారు. ఒక ఉద్యోగి రెండు జాబ్స్ చేయడాన్ని మూన్‌లైటింగ్(Moonlighting) అంటారు. స్విగ్గీ(Swiggy) ఇటీవలే.. కొన్ని పరిమితులకు లోబడి మూన్‌లైటింగ్‌కు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రిషద్ కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ఐటీ రంగంలోని ‘వర్క్ ఫ్రం హోం’ ఉద్యోగుల్లో(Work from Home) కొందరు రెండు ఉద్యోగాలు చేస్తున్నారన్న వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. 


ఇప్పటికే విప్రో సంస్థ.. ఉన్నతోద్యోగులకు ‘వేరియబుల్ పే’ పేరిట ఇచ్చే కొన్ని ప్రోత్సాహకాలను నిలిపివేసింది. లాభాల మార్జిన్లు తగ్గడమే దీనికి కారణమని చెప్పింది. ఇదిలా ఉంటే.. విప్రో నిర్ణయంతో ఉద్యోగులు సంస్థను వీడే ప్రమాదం(ఆట్రిషన్) ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో విప్రోలో ఆట్రిషన్ రేటు 23.3 శాతంగా ఉంది. మరోవైపు.. మూన్‌లైటింగ్ కొత్త ట్రెండ్ ఏమీ కాదని పరిశీలకులు చెబుతున్నారు. కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ తాజాగా జరిపిన ఓ సర్వే ప్రకారం.. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లోని 65 శాతం మంది ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’లో భాగంగా తమ విధులు నిర్వర్తిస్తూనే పార్ట్‌టైంగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి వారు మళ్లీ కార్యాలయాలకు వచ్చేందుకు సిద్ధంగా లేరని హెచ్‌ఆర్ నిపుణులు చెబుతున్నారు. 


వారంలో ఐదు రోజులు కార్యాలయ్యాలకు వచ్చేందుకు  కేవలం ఒక శాతం మందే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాకుండా.. ఆఫీసులకు రావాలని తమపై ఒత్తిడి తెస్తే రాజీనామా చేయడమో లేదా ఉద్యోగం మారడమో చేస్తామని మరో 42 శాతం మంది తేల్చి చెప్పారు. పని సంస్కృతిలో కీలక మార్పులు వచ్చినట్టు విల్లిస్ టవర్స్ వాట్సన్ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ తేలింది. సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో ఏకంగా 64 శాతం..  ఉద్యోగులను జాబ్‌లో కొనసాగేలా చేయడం కష్టంగా ఉందని చెప్పాయి. మరోవైపు.. 78 శాతం సంస్థలేమో నైపుణ్యాలున్న వారిని ఉద్యోగాలవైపు ఆకర్షించడం కష్టంగా మారిందని అభిప్రాయపడ్డాయి.

Updated Date - 2022-08-21T22:09:45+05:30 IST