న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకోవాలంటే 2022 వరకు ఎదురు చూడక తప్పదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం తెలిపింది. కోవిడ్ వల్ల ఉత్పన్నమైన పరపతి పతనం స్వల్పకాలికమేనని, అయితే చాలా ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోవిడ్ పూర్వపు స్థితికి చేరుకోవాలంటే 2022 వరకు ఆగాలని తెలిపింది.
కోవిడ్-19 మహమ్మారి వల్ల రుణ లభ్యత తగ్గిందని, పరపతి సంబంధిత సవాళ్ళు ఎదురవుతున్నాయని, అయితే ఈ పరిస్థితి స్వల్పకాలమే ఉంటుందని మూడీస్ తెలిపింది. సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు అవకాశం లేకుండా, ఆంక్షలకు గురయ్యే రంగాలకు రిస్క్ కొనసాగుతుందని తెలిపింది. చాలా ఆర్థిక వ్యవస్థలు కోవిడ్ పూర్వపు స్థితికి 2022నాటికి కానీ చేరుకోలేవని పేర్కొంది. రికవరీ నెమ్మదిగా, హెచ్చతగ్గులతో ఉంటుందని తెలిపింది. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది.
కోవిడ్-19 మహమ్మారి తీవ్రత తగ్గిన తర్వాత విధానపరమైన చర్యలు ఆర్థిక కార్యకలాపాలకు, ఫైనాన్షియల్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తున్నట్లు వివరించింది. ఈ మహమ్మారి పూర్తిగా తగ్గిన తర్వాత కూడా ఎక్కువ కాలం ఆర్థిక కార్యకలాపాలకు విధాన నిర్ణేతలు సహకరించాలని తెలిపింది. కొన్ని సందర్భాల్లో ఈ సహకారం కొన్ని సంవత్సరాలపాటు కొనసాగాలని వివరించింది.
ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుండటం వల్ల ఈ మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతుందని, ఫలితంగా ప్రభుత్వాలు లాక్‌డౌన్ చర్యలను క్రమంగా సడలించే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.