Abn logo
Oct 17 2021 @ 01:07AM

నెలకే బిల్లింగ్‌

ఇకపై 13వ తేదీలోపే పూర్తి

శ్లాబ్‌లు మారకుండా ఈపీడీసీఎల్‌ చర్యలు

వినియోగదారులకు రిలీఫ్‌


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) ఇకపై ఆలస్యం లేకుండా విద్యుత్‌ బిల్లులు జారీ చేయనుంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో రెగ్యులర్‌గా రీడింగ్‌ తీసే తేదీ కంటే...ఒకటి, రెండు రోజులు ఆలస్యం అవుతోంది. దీనివల్ల వినియోగం ఎక్కువగా నమోదై, శ్లాబు మారిపోయి బిల్లు అధికంగా వస్తోంది. దీనిపై వినియోగదారులు తరచూ ఫిర్యాదులు చేస్తున్నారు. సంస్థ నష్టాలను పూడ్చుకోవడానికి, అధిక ఆదాయం కోసమే ఇలా ఆలస్యంగా బిల్లింగ్‌ చేస్తున్నారని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టడానికి రీడింగ్‌, బిల్లింగ్‌ విధానంలో అక్టోబరు నెలలోనే మార్పులకు శ్రీకారం చుట్టారు. వీటిని నవంబరు నుంచి కచ్చితంగా అమలు చేయనున్నారు. ఈ నెల 13వ తేదీ నాటికే అత్యధికంగా బిల్లింగ్‌ పూర్తిచేశారు. 

ఎలా చేస్తారంటే...?

ప్రస్తుతం విశాఖ సర్కిల్‌లో 14 లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో జీవీఎంసీ పరిధిలో (జోన్‌-1,2,3) 10 లక్షలు ఉన్నాయి. వీటి పరిధిలో 23 సబ్‌ డివిజన్లు, 72 సెక్షన్‌ కార్యాలయాలు ఉన్నాయి. మీటర్ల రీడింగ్‌ తీసే బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించారు. మొత్తం 340 మంది ప్రతి నెలా ఇంటింటికీ వెళ్లి రీడింగ్‌ నమోదు చేసి, బిల్లులు జారీ చేస్తున్నారు. వీరు నెలకు పనిచేసేది కేవలం రెండు వారాలు మాత్రమే. ప్రతి నెలా 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఒక విడత, మళ్లీ 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రెండో విడత రీడింగ్‌ తీస్తున్నారు. జాప్యం జరిగితే 23, 24 తేదీల్లో కూడా రీడింగ్‌కు వెళుతున్నారు. ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు విరామం లేకుండా రీడింగ్‌ తీయనున్నారు. ఎక్కడైనా డోర్‌ లాక్‌ చేసి ఉన్నా, వర్షాలు, ఇతర అనివార్య కారణాల వల్ల తీయలేకపోయినా 14వ తేదీ నాటికి అన్నీ పూర్తిచేస్తారు. ప్రతి వినియోగదారుడికి కచ్చితంగా 30-31 రోజులకే రీడింగ్‌ వచ్చేలా చూస్తారు. ఆ తేదీలు దాటకుండా జాగ్రత్త వహిస్తారు. అంటే...ఆలస్యంగా వచ్చి, ఎక్కువ యూనిట్లు నమోదు చేసి, శ్లాబ్‌ మార్చడం ద్వారా అధిక మొత్తం వసూలుచేసే అవకాశం ఇకపై ఉండదు. 

ఆదాయం ఎంత వస్తున్నదంటే..?

విశాఖ సర్కిల్‌కు ప్రతి నెలా ఎల్‌టీ కనెక్షన్ల ద్వారా రూ.110 కోట్లు, హెచ్‌టీ కనెక్షన్ల ద్వారా రూ.300-310 కోట్లు ఆదాయం వస్తుంది. అక్టోబరు నెలలో వాతావరణ మార్పుల వల్ల వినియోగం బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో రూ.450 కోట్ల వరకు బిల్లింగ్‌ జరిగే అవకాశం వుందని అధికారుల అంచనా. విశాఖ జిల్లాలో 99 శాతం బిల్లులు ఏ నెలకు ఆ నెల వసూలైపోతాయి. ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థల బిల్లులు తప్పితే ఇతర వినియోగదారులు పెద్దగా బకాయిలు పెట్టరు. 

అంతా ఆన్‌లైన్‌ పేమెంట్లే

ఇంతకు ముందు విద్యుత్‌ బిల్లు చెల్లించాంటే..సమీపంలో కేటాయించిన కార్యాలయానికి వెళ్లి, క్యూలో నిల్చొని డబ్బులు కట్టాల్సి వచ్చేది. దీనికోసం కనీసం గంట నుంచి రెండు గంటల సమయం కేటాయించాల్సి వచ్చేది. ఒక్కోసారి గడువు తేదీ దగ్గర పడినపుడు వెళితే...రద్దీ ఎక్కువగా ఉండి, మరుసటి రోజు వెళ్లాల్సి వచ్చేది. ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి ఆన్‌లైన్‌ పేమెంట్‌ విధానం వచ్చాక...ఇప్పుడు ఎవరూ విద్యుత్‌ శాఖ కార్యాలయానికి వెళ్లి బిల్లు కట్టడం లేదు. మొబైల్‌కే బిల్లు మొత్తం ఎంతో మెసేజ్‌ వస్తోంది. దానిని గడువు తేదీలోగా చెల్లించాలంటూ...ఆయా ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యాప్‌లు గుర్తు చేస్తుంటాయి. దాంతో వసూళ్లు బాగుంటున్నాయి. గ్రామీణ ప్రాంతాలైనా అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు వంటి ప్రాంతాల్లోనే ఇంకా కొద్దిమంది కార్యాలయానికి వచ్చి బిల్లులు చెల్లిస్తున్నారు.

అదే నెలలో బిల్లింగ్‌ కోసమే మార్పులు

సూర్యప్రతాప్‌, ఎస్‌ఈ, విశాఖ సర్కిల్‌

విశాఖ నగరంలో నవంబరు నుంచి, గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబరు నుంచి ప్రతి నెల 13వ తేదీలోగా మీటర్ల రీడింగ్‌, బిల్లింగ్‌ పూర్తయిపోతుంది. ఇక ఆలస్యం అంటూ ఏమీ ఉండదు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు లేకుండా వుండడం కోసమే ఈ మార్పులు చేశాము. దీనివల్ల సంస్థకు కూడా ఏ నెల వినియోగం ఆ నెలలో బిల్లింగ్‌ అయిపోతుంది.