మాంటిస్సోరి విద్యార్థిని ప్రతిభ

ABN , First Publish Date - 2022-09-23T05:32:36+05:30 IST

అలంపూర్‌ మండల కేంద్రంలోని మాంటిస్సోరి పాఠశాలలో తొమ్మిదివ తరగతి చదువుతున్న విద్యార్థిని పి.దీపిక జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటుకున్నది.

మాంటిస్సోరి విద్యార్థిని ప్రతిభ
దీపికకు జ్ఞాపికను అందిస్తున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

- జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రశంసలు

- అందరి దృష్టిని ఆకర్షించిన సైంటిఫిక్‌ బ్యాగ్‌

- విద్యార్థిని దీపికకు ప్రముఖుల అభినందనలు

అలంపూర్‌/గద్వాల క్రైం, సెప్టెంబరు 22 : అలంపూర్‌ మండల కేంద్రంలోని మాంటిస్సోరి పాఠశాలలో తొమ్మిదివ తరగతి చదువుతున్న విద్యార్థిని పి.దీపిక జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ చాటుకున్నది. ఈ నెల 14, 15, 16 తేదీల్లో న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో నిర్వహించిన ‘నేషనల్‌ లెవెల్‌ ఎగ్జిబిషన్స్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ కాంపిటీషన్‌ - ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రదర్శన’లో తెలంగాణ రాష్ట్రం నుంచి 37 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపిక ప్రదర్శించిన ‘సైంటిఫిక్‌ బ్యాగ్‌’ నమునా అందరి దృష్టిని ఆకర్షిచింది. ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ విద్యార్థినిని అభినందించి, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందించారు. వచ్చే ఏడాది మార్చిలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించనున్న ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ పెన్యువల్‌  - 2023 (ఫైన్‌) కార్యక్రమంలో ‘సైంటిఫిక్‌ బ్యాగ్‌’ నమునాను ప్రదర్శించనున్నట్లు పాఠశాల డైరెక్టర్‌ రవిప్రకాష్‌ తెలిపారు. 


జిల్లాకు గర్వకారణం : కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

జాతీయ స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో అలంపూర్‌ మాంటి స్సోరి పాఠశాల విద్యార్థిని దీపిక ప్రతిభ చాటడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన చాంబర్‌లో దీపికను ఆమె అభినందిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో రాష్ట్రం నుంచి ఎనిమిది పాఠశాలలకు చెందిన విద్యార్ధులు జాతీయ స్ధాయి అవార్డులు అందుకున్నట్లు తెలిపారు. అందులో విద్యార్థిని దీపిక రూపొందించిన ‘సైంటిఫిక్‌ బ్యాగ్‌’ ప్రాజెక్ట్‌ టాప్‌ 60లో ఒకటిగా ఎంపికవడం గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లా నుంచి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్ధి నిఖిలేశ్వర్‌, సత్యసాయి పాఠశాల విద్యార్ధిని సాహితి, అలంపూర్‌ నుంచి దీపిక, తరుణ్‌ కుమార్‌ రెడ్డి పాల్గొన్నారని తెలిపారు. 


కలెక్టర్‌ కావాలని ఉంది : దీపిక

అదే ప్రాజెక్ట్‌ ఎందుకు చేయాలనిపించిందని, ఈ ఆలోచన ఎలా వచ్చిందని కలెక్టర్‌ అడుగగా, దీపిక మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, రైతుల కష్టాలు చూసి ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులకు కొంతైనా మేలు జరుగుతుందని అశిస్తున్నానని తెలిపింది. కలెక్టర్‌ వల్లూరు క్రాంతిని చూస్తూ, తనకు కూడా కలెక్టర్‌ అవ్వాలని ఉందని ఆకాంక్ష వ్యక్తం చేసింది. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, విద్యాశాఖాధికారి సిరాజుద్దీన్‌, మాంటి స్సోరి పాఠశాల ప్రిన్సిపల్‌ నాగలక్ష్మీ, డైరెక్టర్‌ రవిప్రకాష్‌, గైడ్‌, ఉపాధ్యాయులు మురళీకృష్ణమోహన్‌, నవీన్‌, ప్రసాద్‌, సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-23T05:32:36+05:30 IST