రైతు సమస్యలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం

ABN , First Publish Date - 2021-07-19T00:33:12+05:30 IST

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో రైతుల..

రైతు సమస్యలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానుండటంతో రైతుల అంశంపై ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానాలను తమ పార్టీ ఎంపీలు ప్రవేశపెట్టనున్నట్టు ఆ పార్టీ నేత మనీష్ తివారీ తెలిపారు. పార్టీ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా నివాసంలో ఆదివారంనాడు ఏర్పాటైన సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారీ జస్బీర్ గిల్, షంషేర్ సింగ్ డుల్లూ, మహమ్మద్ సిద్ధిఖి, ప్రణీత్ కౌర్ సంతోష్ చౌదరి, రవ్‌నీత్ సింగ్ బిట్టూ తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ కాంగ్రెస్‌ యూనిట్‌లో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశంలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమావేశానంతరం మీడియాతో తివారీ మాట్లాడుతూ, సాగు చట్టాలపై కొనసాగుతున్న రైతు ఆందోళనలు, పంజాబ్‌కు వ్యాక్సిన్ల కేటాయింపు తదితర అంశాలపై పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించినట్టు చెప్పారు.


కాగా, పంజాబ్ కాంగ్రెస్ యూనిట్‌లో విభేదాలపై ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ, ప్రజాస్వామిక పార్టీల్లో అభిప్రాయ భేదాలు సహజమేనని, పార్టీకి తామంతా విధేయులను చెప్పారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని అన్నారు. ఎంపీల సమావేశంలో, రైతు సమస్యలు, ధరల పెరుగుదల, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలిపారు.

Updated Date - 2021-07-19T00:33:12+05:30 IST