వానాకాలం.. ఖరారు

ABN , First Publish Date - 2022-05-24T06:57:11+05:30 IST

జిల్లాలో వానాకాలం ప్రణాళిక ఖరారు చేశారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలంలో రైతులకు పంటలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంటల కాలనీ ఏర్పాటులో భాగంగా

వానాకాలం.. ఖరారు

జిల్లాలో వానాకాలం సాగు ప్రణాళికను ఖరారు చేసిన వ్యవసాయశాఖ

జిల్లాలో 5లక్షల 9753 ఎకరాల్లో పంటల సాగవుతుందని అంచనా

వరిసాగులో వెదజల్లే పద్ధతికి అధికారుల పెద్దపీఠ 

ఎరువులను సిద్ధం చేస్తున్న అధికారులు 

ఈ నెలాఖరులోపు రుణ ప్రణాళికను ప్రకటించనున్న లీడ్‌ బ్యాంకు

నిజామాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వానాకాలం ప్రణాళిక  ఖరారు చేశారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వానాకాలంలో రైతులకు పంటలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పంటల కాలనీ ఏర్పాటులో భాగంగా వరి సాగులో అత్యాధునిక పద్దతులను రైతులు అవలంభించేవిదంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వరిలో విత్తనాలు వెదజల్లే పద్దతిని ప్రొత్సహించేందుకు సిద్దమవుతున్నారు. వానకాలం సీజన్‌లో సరిపడా విత్తనాలు, ఎరువులను సమకూరుస్తునే సీజన్‌ ప్రారంభానికి ముందే అన్ని క్లస్టర్‌ల పరిధిలో రైతులకు అత్యాధునిక పద్ధతులను వివరించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు.

సాగు యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం

జిల్లాలో వానాకాలం సాగు యాక్షన్‌ప్లాన్‌ను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. రైతులకు కావాల్సిన ఏర్పాట్ల కోసం ప్రభుత్వానికి పంపించింది.!? ఏ పంటలు ఎంతమొత్తంలో వేస్తారో అని ఆ ప్రణాళికలో పేర్కొంది. వానకాలం సీజన్‌లో ఏ పంటలు ఎక్కువగా పెరగనున్నాయో యాక్షన్‌ ప్లాన్‌లో పొందుపర్చారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం రైతులకు ఆరుతడి పంటల సాగును వివరించడంతో పాటు శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఈ వానాకాలంలో 5లక్షల 9వేల 753 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఈ మొత్తం పంటల్లో 79శాతం వరకు 4లక్షల వెయ్యి 591 ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేశారు. మొత్తం సాగులో ఎక్కువగా వరి వైపే మొగ్గు చూపనున్నారని ఈ యాక్షన్‌ప్లాన్‌లో వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లాలో వరి తర్వాత సోయాబీన్‌ 6276 ఎకరాల్లో, మొక్కజొన్న 3342 ఎకరాల్లో సాగవుతుందని ప్రణాళికలో పొందుపర్చారు. పెసర 365 ఎకరాలు, మినుములు 595, కందులు 3479 ఎకరాలు, పత్తి 2300ల ఎకరాలతో పాటు ఇతర పంటలు 7805 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. ఈ పంటలకు అనుగుణంగా విత్తనాలను సమకూర్చాలని ప్రభుత్వానికి పంపిన ప్రణాళికల్లో పేర్కొన్నారు.

1.20 లక్షల క్వింటాళ్ల విత్తనాలు

జిల్లాలో సాగవుతున్న పంటల్లో వరి ఎక్కువగా వేయనుండడంతో లక్షా 20వేల 477 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వరి విత్తనాలను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థతో పాటు ప్రైవేట్‌ సంస్థల ద్వారా సమకూర్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విత్తనాలకు సబ్సిడీ ఎత్తివేసినందు వల్ల అవసరం మేరకు సరఫరా చేయాలని కోరారు. వరి ఎక్కువగా సాగవుతున్నందు వల్ల  ఎకరాకు 30కిలోల వరకు విత్తనాన్ని వాడాలని కోరారు. జిల్లాలో మొక్కజొన్నకు 2667 క్వింటాళ్లు, పెసర 29క్వింటాళ్లు, కందులు 139 క్వింటాళ్లు, మినుములకు 48 క్వింటాళ్లు అవసరమని పేర్కొన్నారు. జిల్లాలో సోయాబీన్‌కు 18083 క్వింటాళ్ల విత్తనం అవసరమని ప్రణాళికలో పొందుపర్చారు. అంతేకాకుండా ఈ విత్తనం విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా లేనందు వల్ల ప్రైవేట్‌ సంస్థల ద్వారా సరఫరా చేసేవిధంగా చూడాలని కోరారు. జిల్లాలో పత్తి సాగును కొత్తగా మొదలుపెడుతున్నందు వల్ల మొత్తం 4600 ప్యాకెట్లు అవసరమని ప్రణాళికలో పొందుపర్చారు. వీటితో పాటు సబ్సీడిపై జీలుగ విత్తనాలను ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల ద్వారా సరఫరా చేయనున్నారు. 

వెదజల్లే పద్ధతికి ప్రోత్సాహం 

జిల్లాలో వచ్చే వానాకాలం సాగుకోసం వరిలో వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గించడంతో పాటు దిగుబడి పెంచడంలో భాగంగా ఈ పద్ధతిని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలోని క్లస్టర్‌ల వారీగా రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆయా మండలాల్లోని పలువురు ఆదర్శ రైతులతో పాటు ఇతర రైతులను కూడా వెదజల్లే పద్ధతిలో వరి సాగు చేసేందుకు అవగాహన కల్పించనున్నారు. వీటితో పాటు అన్ని క్లస్టర్‌ల వారీగా పంటల కాలనీలు కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

కావాల్సిన ఎరువులకూ ప్రణాళిక 

జిల్లాలో వానాకాలంలో సాగుకు రైతులు సిద్ధమవుతుండడంతో కావాల్సి  న ఎరువులను కూడా ప్రణాళికలో పొందుపర్చారు. జిల్లాలో అత్యధికం గా యూరియాను వినియోగిస్తున్నందున ఈ సీజన్‌లో 84079 మెట్రిక్‌ టన్ను లు కావాలని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వానాకాలం కోసం డీఏ పీ 11480 మెట్రిక్‌ టన్నులు, ఎన్‌వోపీ 10198, కాంప్లెక్స్‌ 35,788 మెట్రిక్‌ ట న్నులు అవసనమని అంచనా వేశారు. వీటిలో యూరియా 16424 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 2587 మెట్రిక్‌ టన్నులు, ఎంవోపీ 865, కాంప్లెక్స్‌ ఎరువు లు 17517 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయి. సీజన్‌ ఆరంభం వ రకు సగం వరకు ఎరువులను తీసుకువచ్చి సొసైటీలు, ప్రైవేట్‌ ఫర్టిలైజర్‌ షాప్‌ల ద్వారా సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో రుణాలు

ఈ వానాకాలంలో రైతులకు అవసరమైన రుణ ప్రణాళికను కూడా లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరులో రుణ ప్రణాళికను ప్రకటించనున్నారు. బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయం తీసుకుని రైతులకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం జూన్‌ మొదటి వారం నుంచి పంట రుణాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ రైతు కు వారు వేసే పంటలకు అనుగుణంగా అవసరం మేరకు ముందుగానే రుణాలు అందించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

రైతులకు ఇబ్బందులు లేకుండా  ఏర్పాట్లు 

జిల్లాలో వానాకాలం ప్రణాళికను ఖరారు చేశామని జిల్లా ఇన్‌చార్జీ వ్య వసాయ అధికారి తిరుమల ప్రసాద్‌ తెలిపారు. రైతుల సాగుకు ఇబ్బందు లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో వరిసాగు ఎక్కువగా ఉన్నందు వల్ల ఈ పంటను అత్యాధునిక పరిజ్ఞానంతో పండించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఖర్చు తగ్గించి ఎక్కువ దిగుబడి వచ్చే పద్ధతులను రైతులకు వివరిస్తున్నామని తెలిపారు. జిల్లాలో  వరితో పాటు ఆరుతడి పంటలను కూడా ఎక్కువమొత్తంలో సాగయ్యే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపా రు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కొన్ని రకాల విత్తనాలు సరఫరా చేస్తున్నామని, ఇతర విత్తనాలను ప్రైవేట్‌ విత్తన సంస్థల ద్వారా కొనుగోలు చేసుకోవాలన్నారు. విత్తనం తీసుకునే రైతులు తప్పనిసరిగా ధ్రువీకరణ రశీదులను తీసుకోవాలని కోరారు.  

Updated Date - 2022-05-24T06:57:11+05:30 IST