చరిత్రలో చెదిరిన అస్తిత్వాలు చెప్పుకున్న స్వగతాలు

ABN , First Publish Date - 2021-08-23T08:40:50+05:30 IST

తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చిన గొప్ప నవల మధురాంతకం నరేంద్ర ‘మనోధర్మపరాగం’. అన్ని చారిత్రక నవలల లాగానే ఈ నవల కూడా వేరొక కాలంలోకి, ప్రాంతంలోకి తీసుకెళుతుంది...

చరిత్రలో చెదిరిన అస్తిత్వాలు చెప్పుకున్న స్వగతాలు

Don’t you think that society, while condemning those poor women and treating them as outcastes, but at the same time receiving those male culprits who resort to those women into their fold, as honourable members of the society, undermine the very fundamental principles of morality and justice?... (T)hese devadasis are not the victims of their own inclinations as ordinary prostitutes are, but rather the victims of custom, which teaches them to practice vice as their caste dharma.

- Muthulakshmi Reddi


తెలుగులో ఈ మధ్యకాలంలో వచ్చిన గొప్ప నవల మధురాంతకం నరేంద్ర ‘మనోధర్మపరాగం’. అన్ని చారిత్రక నవలల లాగానే ఈ నవల కూడా వేరొక కాలంలోకి, ప్రాంతంలోకి తీసుకెళు తుంది. సాధారణంగా చారిత్రక నవలకి, అది ఎంత భావుకతతో కూడుకున్నదయినా, పరిశోధన అనివార్యం. తద్వారా మాత్రమే తాను చిత్రించిన పాత్రలు, వాటి కాలం గురించిన విషయాల్ని రచయితలు పాఠకులకు convincingగా చెప్పగలుగుతారు. ఆ విషయంలో నరేంద్ర విజయవంతమయ్యారు. 


ఆయా చారిత్రక వ్యక్తుల ఆంతరంగిక ప్రపంచంలోకి మనల్ని తీసుకె ళతాడు రచయిత. అదే సందర్భంలో వాటివాటి కాలానికి చెందిన సామాజిక స్థితిగతుల్ని గురించి అద్భుతంగా పరిచయం చేస్తాడు. వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళుగా చెపితే తప్ప తెలియని విషయాలను వాళ్ళ ద్వారానే చెప్పిస్తాడు. "Historical fiction comes out of greed fix experience" అంటుంది Hilary Mantel అనే నవలా రచయిత్రి. అటువంటి greed ఏదో ఈ రచ యితకు వుంది. అందుకనే పాత్రలు వాటికవే మాట్లాడితే తప్ప ఆ అను భవాల్ని authentic ఆవిష్కరించటం కుదరదనే భావనలోంచి పాత్రలు ప్రత్యక్షంగా తమ కథల్ని తామే చెప్పుకునేటట్లు చేశాడు రచయిత. 


దాదాపు ఒక శతాబ్దంన్నర కాలాన్ని, ఆ కాలంలో ఉన్న దేవదాసీ వ్యవస్థ స్వరూప స్వభావాల్ని, ఇంగ్లీషువాళ్ళు వచ్చి దేవదాసీల యినాం భూములు రద్దు చేయటంవల్ల వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పులను,  ఫలితంగా వాళ్ళు నమ్ముకున్న సంగీతం, నాట్యం మొదలైన వాటిలో వచ్చిన మార్పులను... ఈ నవలలో నేపథ్యంగా రచయిత చెప్పుకుంటూ వచ్చాడు. అన్ని ఆటంకాల మధ్య దేవదాసీలు కర్ణాటక సంగీతాన్ని, నాట్యాన్ని వారసత్వంగా కాపాడుకుంటూ వచ్చారు. వారసత్వాన్ని కొనసాగించటానికి ఆడపిల్లలు అవసరమని బలంగా నమ్మారు. ఈ నవలలో చిత్తూరు స్కంద కుముద వల్లి దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది: ‘‘అంతా బాగానే జరిగిపోతావుండాది, కానీ సామీ, యింట్లో ఆడబిడ్డ లేదు. ఆడబిడ్డ లేకపోతే నావంశం నాతోనే అంతమైపోతుంది.  నా వంశాన్ని నిలిపే దానికోసరం, నా సంగీతానికి వారసురాలుగా వుండేదాని కోసరం, నాకడుపులో వొక ఆడబిడ్డను పుట్టించు. యెన్ని జన్మలయినా యిదే మాదిరిగా నిన్ను సేవించుకుంటూ  బతికేస్తాను.’’


దేవదాసీలు ఎంతో సంస్కారవంతంగా, గొప్ప అభిరుచితో జీవించారనే చారిత్రక వాస్తవాన్ని అత్యంత శక్తివంతంగా, ఆ పాత్రల హుందాతనం ఏ మాత్రం తగ్గకుండా చిత్రించాడు రచయిత. వాటి ఆత్మను, లైంగిక అభిరుచుల్ని, వాంఛల్ని హుందాగా ప్రకటింపజేశాడు. ఏమాత్రం వల్గారిటీకి ఆస్కారం లేకుండా చూశాడు. కుముదవల్లి ఇలా అనుకుంటుంది: ‘‘....ఆయనతో బాగా దగ్గరయి పోయాను. వొక్కసారి ఆయన రాకపోతే, వొళ్ళంతా అదో మాదిరయి పొయ్యి నిద్ర కూడా పట్టేది కాదు.’’ 


ఇది దాదాపు 130 సంవత్సరాల దక్షిణ భారతదేశ దేవదాసీ వ్యవస్థ పూర్వపరాలను, ఆ వ్యవస్థనుంచి వచ్చి ప్రముఖులయిన కొందరి స్త్రీల జీవితాలను చిత్రించిన నవల. దక్షిణ భారత సాంస్కృతిక చరిత్రలో సింహ భాగం పోషించిన దేవదాసీల జీవన చరిత్ర. సామాజిక, చారిత్రక విషయాల గురించి అవసరమైనంత వరకు మాత్రమే ప్రస్తావిస్తూ వాటితో సంఘర్షించిన వ్యక్తుల జీవితాల్ని పరిచయం చేసిన నవల. శైలీగతంగా నరేంద్ర ఈ నవలలో ఒకానొక metamorphosisకి గురయ్యాడు. చిత్తూరు మాండలికాన్నీ, అందులో కనిపించే తమిళ యాసని, అందులో వుండే ఆకర్షణని చాలా అద్భుతంగా ఈ నవలలో వాడుకున్నాడు. ఈ నవలలో పాత్రలు తమ కథల్ని తామే వినిపిస్తాయి. దానివల్ల రచయితకు అనేక శైలుల్ని పరిచయం చేసే వీలు కలిగింది. రోజువారీ జీవితంలో తరచుగా వినపడే సామెతల నుంచి కర్ణాటక సంగీతం దాకా వున్న పరిభాషని, పాత్రల సంభాషణల్లో భాగం చేయటంవల్ల కూడా ఆయన వచనానికి ఒక కొత్తదనం వచ్చింది.


ఈ నవలలో రచయిత తీసుకున్న జీవితం వాస్తవం, గతానికి చెందిన వాస్తవం. దీన్ని చిత్రించటానికి రచయిత చరిత్రతో సంభా షణకు దిగాడు. ఆ సంభాషణలో రచయితకు అనేక పాత్రలు తారస పడ్డాయి. అతనితో ఘర్షణపడ్డాయి. అతని నుంచి స్వయం ప్రతిపత్తి కల్పించుకుని తమని గురించి తామే authenticగా represent చేసుకుంటామని కథకుడితో తెగేసి చెప్పాయి. ఆ చెప్పుకునే తీరు వివిధ రకాలుగా వుంటుంది. అదే సందర్భంలో ఆ పాత్రలు కొన్ని అసాధారణ శక్తియుక్తుల్ని కలిగి వుంటాయి. ప్రతి పాత్ర తన కథని అదే సంక్లిష్ట సందర్భాలలో present చేస్తుంది. పాత్రలన్నీ తమకు తెలిసిన కళ గురించి పూర్తి అవగాహనతో వుండడమే కాక, జీవితాన్ని గురించి కూడా విస్తృత పరిజ్ఞానాన్ని కలిగి వుంటాయి. తమ జీవితాన్ని గురించిన తమ version వినిపిస్తాయి. అందులో జోక్యం చేసుకుని distort చేసే అవకాశం రచయితకు లేక కథకుడికి ఇవ్వవు. అలాగే ఈ పాత్రలకి తల్లితో మాత్రమే బలమైన ఆత్మిక సంబంధం వుంటుంది. తండ్రి అనే వాడు నామ మాత్రపు అస్తిత్వాన్ని కూడా కలిగి వుండడు. అతనిది కేవలం తాత్కాలిక పోషకుడి పాత్ర మాత్రమే.


ఐరోపాలో నవల అనేది రూపపరంగా బలపడటంలో కీలక పాత్ర వహించిన ప్లాబర్ట్‌, టాల్‌స్టాయ్‌ లాంటివాళ్ళు తమ నవలలను నవలలుగా కంటే- సాంస్కృతికంగా తమ సమకాలీన సమాజంలో జరుగుతున్న చర్చలలో జోక్యంగా, ప్రయోగాలుగా చూసుకున్నారు. ఈ నేపథ్యంలో నరేంద్ర నవల కేవలం దేవదాసీ జీవితాన్ని ప్రతిఫలించిన నవలగా మాత్రమే చూడకూడదు. సమకాలీన సమాజంలో మళ్ళీ ఒకసారి దేవదాసీ జీవితాన్ని గురించి, ముఖ్యంగా అందులో ప్రముఖులుగా ఎదిగిన సంగీతకారులు గురించిన చర్చలో భాగంగానే చూడాలి.


మార్క్సిస్టు విమర్శకుడు జార్జ్‌ లూకాచ్‌ చారిత్రక నవల పని చారిత్రక సంఘటనల్ని తిరిగి చెప్పటంకాదని చెపుతూ ఇలా అంటాడు: “What matters therefore in the historical novel is not the retelling of great historical events, but the poetic awakening of the people who figured in those events”. (The Historical Novel, p.42)  నరేంద్ర ఈ నవలలో దక్షిణ భారత సాంస్కృతిక చరిత్రలో, ముఖ్యంగా సంగీత ప్రపంచంలో, కీలక పాత్ర వహించిన వ్యక్తులను తన భావుకతతో పాఠకుల ముందుకు తీసుకు వచ్చాడు. 


Denesh Sonaji అభిప్రాయం ప్రకారం దేవదాసీలు 16వ శతాబ్దపు చివరిభాగం నుండి courtesans గా, నాట్యగత్తెలుగా, దేవస్థానాలలో నర్తకీలుగా వుంటూ వచ్చారు. దక్షిణ భారతీయ సమాజంలో వాళ్ళ స్థితి సందిగ్ధతతో కూడుకుని వుంది. పితృకేంద్రక సంబం ధాలు వీళ్ళను నియంత్రించలేదు. నిజానికి వాటి వెలుపల మాతృకేంద్రక సంబంధాలలోనే జీవించారు. అగ్రవర్ణాలకు చెందినవాళ్ళతో వైవాహేతర లైంగిక సంబంధాలు కలిగి వున్నారు. దక్షిణ భారత దేశంలో చాలామంది ఆడవాళ్ళకు అక్షరాభ్యాసం కూడా లేని సందర్భంలో వీళ్ళు విద్యావంతులుగా వున్నారు. 


దేవదాసీలకు మిగతా కుటుంబ స్త్రీలకంటే కొంత స్వేచ్ఛగా జీవించే అవకాశం వున్నప్పటికీ మిగతా స్త్రీల లైంగికత మీద అణచివేత వున్నట్లుగానే దేవదాసీల లైంగికత మీద కూడా అణచివేత అమలయింది. Mythili Srinivas ఇలా అంటుంది: Mythili Srinivas CÌê A…r$…¨: “…devadasis, like all women, were subject to stringent restrictions on their sexuality and autonomy, for example, devadasis were expected to be sexuality available to upper caste men and were thus open to exploitations at the hands of male elite.” (Creating Conjugal Subject: Devadasi and the Politics of Marriage in Colonial Madras Presidency” : Feminist Studies, Spring 2011, Vol.37, No.1, p.64)  


ఆధునికానంతరవాదులు నవలలలో బహుధ్వనిత్వం (polyphony)ని సమర్థనీయ అంశంగా చూశారు. అంతకంటే ముందే pluralism of voices గురించి Mikhail Bakhtin ప్రస్తావించాడు. Edmund J. Smyth ఇలా అంటాడు: “Postmodernist fiction prefers polyphony as a positive principle; it is a pluralization of worlds of discourse.” (Postmodernism and Contem-porary Fiction, p.145) నరేంద్ర ప్రవచనాల ప్రపంచాన్ని బహుళీకరించే పనిని అనేక పాత్రల స్వగతాల్ని విడివిడిగా చెప్పిం చటం, ఆ విడివిడి స్వగతాలు ఒకే విషయానికి, ముఖ్యంగా దేవదాసీ జీవితానికి సంబంధించి చెప్పించటం ద్వారా చేశారు. చరిత్రలో అంత నిర్దిష్టంగా చెప్పటం సాధ్యంకాని విషయాన్ని పాత్రల కథనాల ద్వారా శక్తివంతంగా చెప్పించగలిగాడు రచయిత. 


చరిత్రకుండే సాహిత్య లక్షణం అనివార్యంగా దాన్ని గురించిన బహుళ వ్యాఖ్యానాలకు అవకాశం ఇస్తుంది. దీని ఫలితం చరిత్రకారుడు లేక రచయిత అనే వ్యక్తి పక్కకు నెట్టబడి పాఠకుడు ముందుకువస్తాడు. ఆ క్రమంలో ఒక సన్నివేశానికి సంబంధించిన బహుళ వ్యాఖ్యానాలు ముందుకువస్తాయి. ఈ నవలలో చారిత్రక అంశాలకు వైయక్తిక అంశాలను జతచేసి చెప్పాడు రచయిత. అనేకమంది దేవదాసీలు ఆవిష్కరించిన వైయక్తిక అనుభవాలలో చారిత్రక అంశాలను కూడా చూపాడు. అలాగే ఆయా సందర్భాలలో అమలయిన రాజకీయ, నైతిక ప్రతిమానాలు (paradigms) కూడా బహిర్గతం అయ్యాయి. ఈ రచయిత ఈ నవలలో చాలా సమర్థవంతంగా చారిత్రక-వైయక్తిక అంశాలను సమ్మిళితం చేసి చిత్రించాడు. సాల్మన్‌రష్దీ తన నవల 'Midnight's Children'‌లో 'Memory's Truth' అనే భావనను వాడాడు. జ్ఞాపకం అనేది తనదైన 'Truth'ని ముందుకు తెస్తుం దంటాడు. ఈ తెచ్చే క్రమంలో జ్ఞాపకం ఆ 'Truth'‌ని ఎన్నిక చేసుకుం టుంది. మార్పుకు గురిచేస్తుంది. కొన్నింటిని తొలగిస్తుంది. అతిశయోక్తుల్ని జోడిస్తుంది. అంతిమంగా తనదైన వాస్తవికతను నిర్మిస్తుంది అంటాడు రష్దీ. సరిగ్గా ఈ నవలలో తమ స్వగతాల్ని చెప్పటంలో ఆయా పాత్రలు పాఠకుల ముందుంచింది 'Memory's Truth'నే. 


చారిత్రక నవలకు చరిత్రలో ఒక నిర్దిష్ట కాలం భూమికగా వుంటుంది. రచయిత ఆ కాలపు చేతనాలు, పద్ధతులు, సామాజిక స్థితిగతుల్ని అథెంటిక్‌గా చిత్రించాలి. ఈ విషయంలో నరేంద్ర విజయవంతమయ్యారు. ఈ నవలకున్న epic లక్షణాల్ని ఎవ్వరయినా అంగీకరిస్తారు.

బి. తిరుపతిరావు

Updated Date - 2021-08-23T08:40:50+05:30 IST