మణుగూరులో మంకీపాక్స్‌ కలకలం

ABN , First Publish Date - 2022-08-06T06:20:42+05:30 IST

మణుగూరులో మంకీపాక్స్‌ కలకలం

మణుగూరులో మంకీపాక్స్‌ కలకలం

మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన మండల విద్యార్థికి లక్షణాలు 

తొలుత కొత్తగూడెం.. ఆ తర్వాత హైదరాబాద్‌కు తరలింపు

మణుగూరు, ఆగస్టు 5: భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని విజయనగరం గ్రామానికి చెందిన ఓ యువకుడికి మంకీపాక్స్‌ లక్షణాలున్నట్టు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపింది. విజయనగరం గ్రామానికి చెందిన ఓ యువకుడు మధ్యప్రదేశ్‌లో అగ్రికల్చర్‌ బీఎస్సీ చదువుతున్నాడు. సెలవులు కావడంతో 10 రోజుల క్రితం మణుగూరుకు వచ్చిన అతడికి రెండు రోజుల క్రితం తన శరీరం, అరచేతులు, అరికాళ్లు, ముఖంపై దద్దులు రావడంతో మణుగూరు ఏరియా ఆసుపత్రికి వెళ్లగా.. పరీక్షించిన వైధ్యులు మంకీపాక్స్‌ అనుమానంతో మెరుగైన పరీక్షల కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి.. టీహాబ్‌ సెంటర్‌ ద్వారా రక్తనమూనాలు సేకరించి పుణకు పంపినట్లు తెలిసింది. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు టీహబ్‌ నిర్వాహకులు బాధితుడిని హైద్రాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేయగా.. కుటుంబసభ్యులు అతడిని హైదరాబాద్‌ తరలించారు. అయితే విజయనగరం గ్రామానికి చెందిన యువకుడికి మంకీపాక్స్‌ సోకిందనే వార్తల నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రెండురోజుల క్రితం జ్వరం రాగా.. ట్యాబెట్లు వెసుకున్న అతడు చేపల కూర తిన్నాడని, దాంతో రియాక్షన అయి దద్దుర్లు వచ్చి ఉంటాయని పలువురు అనుకుంటున్నారు. 

Updated Date - 2022-08-06T06:20:42+05:30 IST