Monkeypox : మంకీపాక్స్ డేంజర్ బెల్స్.. ఇండియాలో మరో కేసు నిర్ధారణ

ABN , First Publish Date - 2022-08-02T20:09:17+05:30 IST

భారత్‌(India)లో మంగళవారం(ఈరోజు) మరో మంకీపాక్స్(Monkeypox) కేసు నమోదయ్యింది. కేరళ(Kerala)లో తొలి మరణం నమోదయ్యిన రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో మరో వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.

Monkeypox : మంకీపాక్స్ డేంజర్ బెల్స్.. ఇండియాలో మరో కేసు నిర్ధారణ

న్యూఢిల్లీ : భారత్‌(India)లో మంగళవారం(ఈరోజు) మరో మంకీపాక్స్(Monkeypox) కేసు నమోదయ్యింది.  యూఏఈ (UAE) నుంచి వచ్చిన కేరళ వ్యక్తికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలిందని కేరళ వైద్యశాఖా మంత్రి వీణా జార్జ్ (Veena George) వెల్లడించారు. బాధిత వ్యక్తి వయస్సు 30 సంవత్సరాలని, మలప్పురంలోని మంజేరి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో అతడికి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. బాధిత వ్యక్తి జులై 27న యూఏఈ నుంచి కోజికొడ్ చేరుకున్నాడన్నారు. కేరళలో మంకీపాక్స్ కలకలంపై మాట్లాడుతూ..  ‘‘ పరిస్థితి నియంత్రణలోనే ఉంది. ప్రస్తుతానికి భయపడాల్సిందేమీ లేదు. త్రిసూర్‌లో మరణించిన వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడితో 10 మందికి కాంటాక్ట్ ఉంది. దీంతో ఇప్పటివరకు 20 మందిని క్వారంటైన్‌లో ఉంచాం’’ అని వీణా జార్జ్ అన్నారు. కాగా కేరళ(Kerala)లో తొలి మరణం నమోదయ్యిన రోజుల వ్యవధిలో ఆ రాష్ట్రంలో మరో వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 5 మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అవ్వగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7కి పెరిగింది. 


మంకీపాక్స్‌పై టాస్క్‌ఫోర్స్‌

మంకీ పాక్స్‌తో కేరళ యువకుడి మృతి చెందిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి తీరును నిశితంగా పరిశీలించేందుకు సోమవారం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దేశంలో మంకీ పాక్స్‌ వ్యాప్తి ధోరణులను సమీక్షించి కేంద్రానికి నివేదించనుంది. వైరస్‌ కట్టడికి ఏమేం చర్యలు తీసుకోవాలనేదానిపై సూచనలివ్వనుంది. వైద్యపరమైన వసతుల విస్తరణ, వ్యాక్సిన్‌, వైరస్‌లో మార్పులు తదితరాలపై మార్గదర్శనం చేయనుంది. కాగా మంకీపాక్స్ అనేది అంటువ్యాధి. మంకీపాక్స్ అనే వైరస్ కారణంగా ఇది సోకుతుంది.

Updated Date - 2022-08-02T20:09:17+05:30 IST