ఆ సాక్ష్యాలను కోతి ఎత్తుకుపోయింది.. కోర్టుకు తెలిపిన పోలీసులు

ABN , First Publish Date - 2022-05-06T22:35:03+05:30 IST

ఓ కేసు విచారణ సందర్భంగా Rajasthan పోలీసులు చెప్పింది విని న్యాయస్థానం షాకైంది. హత్య కేసులో

ఆ సాక్ష్యాలను కోతి ఎత్తుకుపోయింది.. కోర్టుకు తెలిపిన పోలీసులు

జైపూర్: ఓ కేసు విచారణ సందర్భంగా Rajasthan పోలీసులు చెప్పింది విని న్యాయస్థానం షాకైంది. హత్య కేసులో తాము సేకరించిన ఆధారాలన్నింటినీ కోతి ఎత్తుకెళ్లిపోయిందని చెప్పారు. Monkey ఎత్తుకెళ్లిన వాటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధం (కత్తి) కూడా ఉందని పోలీసులు చెప్పారు. ఇంతకీ కేసేంటంటే?..  రాజధాని జైపూర్‌కు చెందిన శశికాంత్ శర్మ సెప్టెంబరు 2016లో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత మూడు రోజులకు ఆయన మృతదేహం లభ్యమైంది. 


శశికాంత్ శర్మను హత్య చేశారని ఆరోపించిన ఆయన కుటుంబ సభ్యులు అప్పట్లో ఢిల్లీ-జైపూర్ హైవేను దిగ్బంధించారు. ఈ ఘటన తర్వాత ఐదు రోజులకు చంద్వాజీ ప్రాంతానికి చెందిన ఇద్దరు నిందితులు.. రాహుల్, మోహన్‌లాల్ కండేరాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారిని అదనపు జిల్లా జడ్జి కోర్టులో హాజరు పరిచారు. ఆడిటరీలో స్థలం లేకపోవడంతో నిందితుల నుంచి సేకరించిన సాక్ష్యాధారాలు ఉన్న బ్యాగ్‌ను పోలీస్ స్టేషన్ వద్దనున్న చెట్టుకింద దాచిపెట్టారు. 


అప్పటి నుంచి కేసు విచారణ కొనసాగుతుండగా పలు దశల్లో విచారణ పూర్తయింది. ఇటీవల ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను ప్రవేశపెట్టాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దీనికి పోలీసులు ఇచ్చిన సమాధానం అందరినీ నివ్వెరపరిచింది. చెట్టుకింద దాచిన సాక్ష్యాధారాలను కోతి ఎత్తుకుపోయిందని  పోలీసులు కోర్టుకు తెలియజేశారు. వానరం ఎత్తుకెళ్లిన సంచిలో ఈ కేసుకు సంబంధించి ముఖ్యమైన మరో 15 వస్తువులు కూడా ఉన్నట్టు చెప్పారు. ఈ మేరకు దిగువ కోర్టుకు పోలీసులు లిఖితపూర్వకంగా తెలియజేశారు. 

Read more