ఫీల్డ్‌ అసిస్టెంటా.. మజాకా..!

ABN , First Publish Date - 2021-03-10T18:07:36+05:30 IST

జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక ప్రజా ప్రతినిధుల పట్టింపులేమి, ఉన్నతాధికారుల ఉదాసీనత వెరసి జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న శానిటేషన్‌

ఫీల్డ్‌ అసిస్టెంటా.. మజాకా..!

పారిశుధ్య కార్మికుల నుంచి రోజుకు రూ. 300 లంచం

డబ్బులు.. ఆభరణాలూ చోరీ


హైదరాబాద్/అమీర్‌పేట: జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యవేక్షణ లోపం, స్థానిక ప్రజా ప్రతినిధుల పట్టింపులేమి, ఉన్నతాధికారుల ఉదాసీనత వెరసి జీహెచ్‌ఎంసీలో పనిచేస్తున్న శానిటేషన్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్ల పనితీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఉదయం 6 గంటలకు విధుల్లో చేరి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి వెళ్లాల్సిన ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు 11 గంటలకే వెళ్లిపోతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తోటి కార్మికులే ధ్రువీకరిస్తున్నారు. వారిని పర్యవేక్షించాల్సిన అధికారి పారిశుధ్య కార్మికుల నుంచి ప్రతిరోజూ రూ. 300లు తీసుకుని వారికి పూర్తి గంటలు...  అన్ని పనిరోజులు పని చేస్తున్నట్లు అటెండెన్స్‌ వేస్తున్నాడని సమాచారం. బాపూనగర్‌ నుంచి ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌, వేంకటేశ్వర ఆలయం ఏరియా, ఈడబ్ల్యూఎస్‌ కాలనీ, మసీద్‌ బస్తీ, బీకేగూడ పార్క్‌ వెనుక భాగంలో ఈ తతంగం సాగుతోంది. అతని పర్యవేక్షణలో 14 మంది ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పని చేస్తున్నారు. అనారోగ్యం కారణంగా 4 నెలలుగా ఓ కార్మికురాలు చెత్త ఏరివేత పనులకు రాకపోయినా వచ్చినట్లు అటెండెన్స్‌ వేసి జీతం కాజేస్తున్నాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. 


డబ్బులు డ్రాచేసి జల్సా...

 సదరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు నేర చరిత్ర కూడా ఉంది. గత నెల 22న ఎస్‌ఆర్‌నగర్‌ లైబ్రరీ వద్ద ఫుట్‌పాత్‌పై చెట్టుకింద మహేందర్‌ అనే పారిశుధ్య కార్మికుడు నిద్రిస్తున్నాడు. పనులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఆ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నిద్రిస్తున్న కార్మికుడి జేబులో ఉన్న ఏటీఎం కార్డును తస్కరించి, అదేరోజు రూ. 20 వేలు డ్రా చేసి జల్సా చేసుకున్నాడని సమాచారం. మరుసటిరోజు ఎస్‌ఆర్‌నగర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసింది. వెంటనే నిందితుడిని స్టేషన్‌కు పిలిచి విచారించగా, డబ్బులు డ్రా చేసినట్లు ఒప్పుకున్నాడు. కాళ్లా వేళ్లా పడి డబ్బులు తిరిగి ఇస్తానని కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా తీరుమారకుండా ఈ నెల 3న కార్మికులతో కలిసి సనత్‌నగర్‌ డివిజన్‌ స్వామి టాకీస్‌ వద్ద మద్యం తాగి బీకేగూడలో ఓ పారిశుధ్య కార్మికురాలి ఇంటికి వచ్చి ఆకలిగా ఉంది భోజనం కావాలని కోరాడు. ఆమె ఇంట్లోనే బస చేసినట్లు నటించి, ఆమె చెవులకు ఉన్న కమ్మలు, మాటీలు, కాళ్ల కడియాలతోపాటు పర్సులో ఉన్న రూ.5వేల నగదును తీసుకుని పారిపోయాడు. మరుసటి రోజు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలుసుకుని తన ఫోన్‌ స్విచాఫ్‌ చేసి కార్మికుల అటెండెన్స్‌ తీసుకునే బయోమెట్రిక్‌ మెషిన్‌ను కూడా తీసుకుని పారిపోయాడు. 


ఫిర్యాదులు అందాయి క్రైం డీఐ

ఈ విషయమై క్రైం డీఐ రాంప్రసాద్‌ను సంప్రదించగా బాధితుల నుంచి ఫిర్యాదులు అందాయని, ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను త్వరలో అదుపులోకి తీసుకుని విచారించి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-17 అసిస్టెంట్‌ మెడికల్‌ అధికారి భార్గవ్‌నారాయణ వెల్లడించారు కార్మికుల రోజువారీ అటెండెన్స్‌కు సంబంధించిన బయోమెట్రిక్‌ అప్పగించకుండా వెళ్లిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌పై ఎస్‌ఆర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిపారు. 

Updated Date - 2021-03-10T18:07:36+05:30 IST