కాసుల కొలువు!

ABN , First Publish Date - 2022-07-15T05:30:00+05:30 IST

ఆ శాఖకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్‌ విడుదల చేస్తోంది. మరోవైపు కేజీబీవీల పర్యవేక్షణ, ప్రత్యేక అవసరాల విద్య, పాఠశాలల్లో మరమ్మతులు, గదులు నిర్మాణం, శిక్షణలు, సమీక్షల కోసం లక్షలాది రూపాయలు లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసే అవకాశం.. ఇలా ఖజానా నిండా ఎప్పుడు నిధులు ఉండే శాఖ సమగ్రశిక్ష అభియాన్‌.

కాసుల కొలువు!

సమగ్ర శిక్ష ఏపీసీ పోస్టుకోసం ఉన్నత స్థాయిలో లాబీయింగ్‌

ఇప్పటికే ఐదుగురు అధికారులు సిఫార్సు లేఖలతో క్యూ

ఏ అధికారి వచ్చినా ఆరోపణలతో నిష్క్రమించాల్సిదే!

విద్యాశాఖ అధికారులను నియమించాలని ఉపాధ్యాయలు డిమాండ్‌


గుంటూరు(విద్య), జూలై 15: ఆ శాఖకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల బడ్జెట్‌ విడుదల చేస్తోంది. మరోవైపు కేజీబీవీల పర్యవేక్షణ, ప్రత్యేక అవసరాల విద్య, పాఠశాలల్లో మరమ్మతులు, గదులు నిర్మాణం, శిక్షణలు, సమీక్షల కోసం లక్షలాది రూపాయలు  లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేసే అవకాశం.. ఇలా ఖజానా నిండా ఎప్పుడు నిధులు ఉండే శాఖ సమగ్రశిక్ష అభియాన్‌. ఈ శాఖలో కీలక పోస్టు అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌. ఈ పోస్టు కోసం ఉమ్మడి  జిల్లా నుంచి ఇప్పటికే ఏడీ స్థాయిలో ఐదుగురు అధికారులు పోటీ పడుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పోస్టులో ఉన్న  వెంకటప్పయ్యను పల్నాడు జిల్లా డిప్యూటీ డీఈవో (రెగ్యులర్‌) తోపాటు ఇన్‌చార్జి డీఈవోగా నియమిస్తూ పాఠశాల విద్య కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో ఈ పోస్టులోకి రావడానికి అనేకమంది పావులు కదుపుతున్నారు.


పోస్టులో ఎవరు నియమితులైనా ఆరోపణలే....

సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు ఆర్టినేటర్‌ పోస్టులో నియమితులైనవారిలో ఎక్కువమంది ఇతర శాఖల నుంచి వచ్చినవారే. విద్యాశాఖ నుంచి ఒకరిద్దరు మాత్రమే వచ్చారు.  నియమితులైన వారందరు ఆరోపణలతోనే నిష్క్రమించారు. ఈ శాఖలో పనిచేసి ఓ అఽధికారి ఇష్టారాజ్యంగా నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కోట్లు కొల్లగొట్టి ప్యాలెస్‌ లాంటి భవనం కట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. బాపట్ల తదితర ప్రాంతాల్లో పెట్రోల్‌ బంకుల్లో వాటాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత వచ్చిన మరో అధికారి మరుగుదొడ్ల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై రాష్ట్రస్థాయిలో ఆడిట్‌ నిర్వహించగా అనేక లోపాలు బహిర్గతం అయ్యాయి. అనంతరం వచ్చిన మరో మహిళా అధికారిపై కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక అవసరాల విద్య, కేజీబీవీలు, అదనపు తరగతుల నిర్మాణం వంటి పనుల్లో తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక అవసరాల విద్యార్థులకు పంపిణీచేసే పరికరాల కొనుగోలు, పంపిణీపై ఆరోపణలతోపాటు పంపిణీదారుల నుంచి భారీస్థాయిలో కమిషన్లు స్వీకరించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆ తరువాత ఆడిట్‌శాఖ నుంచి మరో అధికారిపై కూడా నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు వచ్చాయి. సమీక్షలు, శిక్షణ తరగతులు, మెడికల్‌ క్యాంపుల నిర్వహణలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఇక్కడ నుంచి పల్నాడు డిప్యూటీ డీఈవోగా నియమించిన ఎం.వెంకటప్పయ్యకు కార్యాలయ ఉద్యోగుల, ఇంజనీరింగ్‌ విభాగం అధికారుల మధ్య  తీవ్రస్థాయిలో విబేధాలున్నాయి. ఉద్యోగుల్ని వ్యక్తిగతంగా దూషించి ఇబ్బందులకు గురిచేసినట్లు ఫిర్యాదులున్నాయి. ఈ విషయమై గతంలో ఇక్కడ పనిచేసే జేసీ రాజకుమారి ప్రత్యేకంగా విచారణ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇలా ఆర్థికపరమైన విషయాలు, అధికార దుర్వినియోగం లాంటి అనేక ఆరోపణలతో ఇక్కడ పనిచేసిన ఏపీసీలు నిష్క్రమించారు. విద్యాశాఖ నుంచి మాత్రమే ఇక్కడ అధికారులను నియమించాలని, ఇతర శాఖల నుంచి అధికారులను నియమించరాదని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


Updated Date - 2022-07-15T05:30:00+05:30 IST