పంచాయతీల్లో పైసలన్నీ ఖాళీ!

ABN , First Publish Date - 2021-11-27T05:09:58+05:30 IST

పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఫైనాన్స నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించుకుంది.

పంచాయతీల్లో   పైసలన్నీ ఖాళీ!
మండల ప్రజాపరిషత కార్యాలయం

15 ఫైనాన్స నిధులు మళ్లించుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ఒక్క మెసేజ్‌తో కేంద్రం ఇచ్చిన 24 కోట్లు హుష్‌!

బిక్కమొహం వేస్తున్న సర్పంచులు

పారిశుధ్యం, ఇతర పనులకు ఇక నుధులు లేనట్టే

వచ్చే ఏడాది మార్చి వరకు గడ్డు కాలమే! 

లబోదిబోమంటున్న సర్పంచులు


నెల్లూరు. నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఫైనాన్స నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించుకుంది. సర్పంచులుగా ఎన్నికైన తొలి రోజుల్లోనే వారికి దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. తమవి కానివి, తమ ఖజానా నుంచి ఇవ్వని నిధులను ఒకే ఒక అంతుపట్టని బిల్లుతో 15వ ఫైనాన్స నిధులు రూ.24 కోట్లు, సర్పంచుల ఖాతాల్లో మిగిలి ఉన్న 14వ ఆర్థిక సంఘం నిధులను తన ఖజానాకు మళ్లించుకుని సర్పంచల ఖాతాలను జీరో చేసేసింది. ఈ నిధులు ఉన్నాయన్న ధైర్యంతో పనులు చేసిన సర్పంచులు, మీ నిధులు చూపి గుత్తేదారుల వద్ద పనులు చేయించాలని ఆశించిన సర్పంచలకు తట్టుకోలేని షాక్‌ ఇచ్చింది. దీంతో ముసురుకున్న వర్షాలతో చిత్తడిగా మారిన పల్లెల్లో పారిశుధ్య పనులు చేపట్టలేని పరిస్థితి, ఇప్పటికే ఏడేనిమిది నెలలుగా జీతాలు అందని పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే 2022, మార్చి వరకు అంటే 16వ ఆర్థిక సంఘం నిధులు సర్పంచల ఖాతాలో జమ అయ్యేవరకు పంచాయతీల ఖతాలో పైసా ఉండని పరిస్థితి నెలకొంది. 


ఉదాహరణకు..


 రాపూరు మండలంలో నిధులు ఉన్నాయి కదా అని బిల్లులు రాశారు. బిల్లులు పాస్‌ అయ్యాయి. చివరి నిమిషంలో అకౌంట్‌లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు రెండూ ఖాళీ అయ్యాయి. దీంతో మంజూరైన బిల్లులు నిధులు లేక మూలనపడ్డాయి. ఒక్క రాపూరు పంచాయతీ ఖాతాలోనే రూ.60 లక్షలు ఉండేవి. ఒక్క రూపాయి కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. 

ఉదయగిరి మండలంలో 17 పంచాయతీలకు గాను 11 పంచాయతీల్లో జీరో బ్యాలెన్స ఉంది. మిగిలిన పంచాయతీల్లో వందల రూపాయల మిగులు చూపించారు.

సీతారామపురం మండలంలోని 14, ఓజిలి మండలంలోని 15 పంచాయతీల్లో 15వ ఆర్థిక సంఘం నిధులు మొత్తం లాగేశారు. 

కలిగిరి, డక్కిలి మండలాల్లోలోనూ ఇదే పరిస్థితి. గూడూరు మండలంలో 17 పంచాయతీలకు సంబంధించిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసుకుంది. చిల్లకూరు మండలంలోని 30 పంచాయతీల్లోని నిధులన్నీ ఖాళీ.  


ఏదో బిల్లుపేరుతో..


15వ ఆర్థిక సంఘం నిధులన్నీ ఏదో ఒక బిల్లు రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లించినట్లు పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. అయితే ఆ బిల్లు ఏమిటో, ఏ ఖర్చు కింద ఆ బిల్లు సృష్టించారో కూడా ఎవరికీ అంతుపట్టడం లేదు. కరెంటు చార్జీల చెల్లింపు కోసం ఈ నిధులను వెనక్కు తీసుకున్నట్లు కొంతమంది గ్రామ కార్యదర్శులు చెబుతున్నా దానికి సంబంధించిన ఆధారాలు కనిపించడం లేదని సమాచారం. నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం నిధుల వ్యయంలో కరెంటు బిల్లులకు ఎంత శాతం, పారిశుధ్యానికి ఎంత శాతం.. ఇలా నిర్దేశించిన పలు రకాల పనులకు దేనికి ఎంత శాతం చెల్లించాలో స్పష్టంగా పేర్కొన్నారని, దానికి విరుద్ధంగా మొత్తం నిధులను ఎదో ఒక బిల్లు సృష్టించి రాష్ట్ర ఖజానాకు మళ్లించడం నిబంధనలకు విరుద్ధమని కొందరు అంటున్నారు. దీనివల్ల ఆడిట్‌ సమస్యలు ఉత్పన్నమౌతాయని, అవి పరిష్కరించే వరకు కొత్త ఆర్థిక సంవత్సర నిధులు విడుదల కావనే ఆందోళనలు కూడా వ్యక్తం అవుతున్నాయి. 


మార్చి వరకు పైసా రాదు


అసలే వర్షాకాలం. వరదలు ముంచెతున్న సమయం. అంటువ్యాధులు ప్రబలే అవకాశమూ ఎక్కువే. ఇలాంటి పరిస్థితుల్లో కనీసం గ్రామాల్లో బ్లీచింగ్‌ చల్లడానికి కూడా చేతిలో చిల్లి గవ్వ మిగలకుండా చేయడం పట్ల సర్పంచలు తీవ్ర ఆవేదన, నిరసన వ్యక్తం చేస్తున్నారు.  సర్పంచల ఖాతాల్లో డబ్బులు ఉంటే బిల్లులు కాస్త ఆలస్యమైనా  వస్తాయిలే అనే ధైర్యంతో కాంట్రాక్టర్లు పనులు చేయడానికి ముందుకు వచ్చేవారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుందనే విషయం ప్రచారం కావడంతో ఇక బిల్లులు ఇప్పట్లో రావనే భయంతో పనులు చేయడానికి ఎవరూ ముందుకు రారు. చివరికి సర్పంచలు ప్రజల నుంచి చీవాట్లు తినాల్సిన పరిస్థితి, గెలిచిన ఆరు నెలల కాలానికే చెడ్డపేరు మూటకట్టుకునే అవకాశం ఏర్పడింది. 


Updated Date - 2021-11-27T05:09:58+05:30 IST