డబ్బుతో అన్నీ కొనలేం!

ABN , First Publish Date - 2021-11-07T05:30:00+05:30 IST

రాము వయస్సు పదేళ్లు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. రాము వాళ్ల నాన్న వ్యాపారవేత్త. రోజూ చాలా బిజీగా ఉండేవాడు. ..

డబ్బుతో అన్నీ కొనలేం!

రాము వయస్సు పదేళ్లు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. రాము వాళ్ల నాన్న వ్యాపారవేత్త. రోజూ చాలా బిజీగా ఉండేవాడు. రాము నిద్రపోయాక ఇంటికొచ్చే వాడు. రాము పొద్దున లేచేసరికి వెళ్లిపోయే వాడు. రాముకేమో నాన్నతో బీచ్‌కు వెళ్లి ఆడుకోవాలని, రెస్టారెంట్‌కు వెళ్లి తినాలని ఉండేది. కానీ వాళ్ల నాన్న బిజీ వల్ల కుదిరేది కాదు. ఒకరోజు సాయంత్రం రాము వాళ్ల నాన్న ఇంట్లోనే ఉన్నాడు. అది చూసిన రాము ‘‘నాన్నా మీరు ఈరోజు ఇంట్లోనే ఉన్నారు. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది’’ అన్నాడు. ‘‘అవును! రాము. మీటింగ్‌ క్యాన్సిల్‌ అయింది. అందుకే ఇంటి దగ్గర ఉన్నాను. కానీ రెండు గంటల్లో ఎయిర్‌పోర్టుకు వెళ్లాలి’’ అన్నాడు.


‘‘మళ్లీ ఎప్పుడు తిరిగొస్తారు’’ అడిగాడు రాము. ‘‘రేపు మధ్యాహ్నం వస్తాను’’ అని సమాధానం ఇవ్వడంతో రాము నిట్టూర్పు విడిచాడు. ‘‘నాన్నా ఏడాదికి మీ ఆదాయం ఎంత?’’ అని అడిగాడు కుతూహులంగా రాము. ‘‘రామూ! ఆ విషయం నీకు చెప్పినా అర్థం కాదు’’ అన్నాడు రాముని దగ్గరకు తీసుకుంటూ! ‘‘అయితే సరే! ఆ ఆదాయంతో నువ్వు సంతోషంగా ఉన్నావా?’’ అని మళ్లీ అడిగాడు రాము. ‘‘చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త బ్రాంచ్‌లు ఓపెన్‌ చేయాలని అనుకుంటున్నాను’’ అని అన్నాడు తండ్రి. ‘‘మీ మాటలు వింటుంటే నాకూ సంతోషంగా ఉంది. నేను ఇంకొక ప్రశ్న అడగనా?’’ అన్నాడు రాము. ‘‘తప్పకుండా’’ అన్నాడు తండ్రి. ‘‘గంటకు మీ ఆదాయం ఎంతో చెప్పండి?’’ అని అడిగాడు రాము. ‘‘సుమారు గంటకు రెండువేలు’’ అని సమాధానం ఇచ్చాడు తండ్రి.


వెంటనే రాము పరుగెత్తుకుంటూ వెళ్లాడు. తన గదిలో ఉన్న పిగ్గీ బ్యాంకును తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చాడు. ‘‘నాన్నా! నా పిగ్గీ బ్యాంకులో నాలుగు వేలు ఉన్నాయి. వీటిని తీసుకుని నాతో రెండు గంటలు గడపండి. మీతో కలిసి బీచ్‌కు వెళ్లాలని, డిన్నర్‌ చేయాలని ఉంది. మీ షెడ్యూల్‌లో ఇది మార్క్‌ చేసి పెట్టుకోండి’’ అన్నాడు. ఆ మాటలు విన్న తండ్రికి నోటమాట రాలేదు. వెంటనే షెడ్యూల్‌ను క్యాన్సిల్‌ చేసుకుని రామును బీచ్‌కు తీసుకెళ్లాడు. దాంతో రాము రోజంతా సంతోషంగా గడిపాడు.

Updated Date - 2021-11-07T05:30:00+05:30 IST