రూ. కోట్లు వృథా

ABN , First Publish Date - 2022-06-03T06:42:21+05:30 IST

పట్టణ సమీపంలో చిత్రావతి నది కలుషితం కాకుండా గతంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.కోట్లు వెచ్చించి, మురుగు నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేశారు.

రూ. కోట్లు వృథా

తెగిపోయిన నీటి శుద్ధిప్లాంట్‌ పైప్‌లైన

చిత్రావతి నదిలో కలుస్తున్న మురుగు

పుట్టపర్తి 

పట్టణ సమీపంలో చిత్రావతి నది కలుషితం కాకుండా గతంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. రూ.కోట్లు వెచ్చించి, మురుగు నీటి శుద్ధి ప్లాంటు ఏర్పాటు చేశారు. దానికి మురుగు నీటిని తరలించే పైపులైన దెబ్బతినడంతో ప్లాంటుకు సరఫరా ఆగిపోయి, వృథాగా పడి ఉంది. ఈ కారణంగా నదిలోకి మురుగు నీరు చేరి, కలుషితమవుతోంది. స్థానికులతోపాటు సాయిబాబా భక్తులు సైతం కలుషితమవుతున్న చిత్రావతిని చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్‌ చేసే పర్యాటకులు, భక్తులు ముక్కు మూసుకుంటున్నారు.


20 ఏళ్ల క్రితమే భూగర్భ డ్రైనేజీ..

దేశవిదేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు పుట్టపర్తికి వస్తుండటంతో పారిశుధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. ఉమ్మడి జిల్లాలో ప్రప్రథమంగా 20 సంవత్సరాల క్రితమే భూగర్భ డ్రైనేజీని అందుబాటులోకి తెచ్చా రు. గోకులం, సాయినగర్‌, ప్రశాంతి గ్రామాల్లో పంప్‌ హౌస్‌లు ఏర్పాటుచేసి, ము రుగు నీటిని పైప్‌లైన ద్వారా శుద్ధి ప్లాంటుకు తరలించేశారు.


వదిలేశారు..

డ్రైనేజీ నీటిని శుద్ధి చేసేందుకు అప్పట్లో ప్రత్యేకంగా రూ.2 కోట్లు ఖర్చు చేసి ప్లాంటును నిర్మించారు. మురుగునీటిని ప్లాంటులో శుద్ధిచేసి రైతుల పొలాలకు పంపింగ్‌ చేసేవారు. పంపింగ్‌ హౌస్‌ నుంచి నీటిని తరలించేందుకు  చిత్రావతి నదిపై శుద్ధిప్లాంటు వరకు ప్రత్యేక పైప్‌లైన ఏర్పాటు చేశారు. ఇది తెగిపోవడంతో శుద్ధిప్లాంటు నిరుపయోగంగా మారింది.


చెక్‌ డ్యాంలోకి కలుషిత నీరు

మురుగు నీటిని శుద్ధిప్లాంటుకు పంపింగ్‌ చేయకపోవడంతో సాయినగర్‌ పంపింగ్‌ హౌస్‌ నుంచి ఆ నీరు చిత్రావతిలోకి నేరుగా కలుస్తోంది. గోకులం పంపింగ్‌ హౌస్‌ నుంచి మురుగునీరు చిత్రావతి నదిలో కలుస్తోంది. దీంతో చిత్రావతిలో నిర్మించిన చెక్‌డ్యాం నీరు కూడా కలుషితమవుతోంది.


Updated Date - 2022-06-03T06:42:21+05:30 IST