ఊపందుకున్న కొనుగోళ్లు

ABN , First Publish Date - 2022-05-15T06:03:57+05:30 IST

జిల్లాలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలకు దండిగా ధాన్యం తరలివస్తోంది. ఓ వైపు అకాల వర్షాలు కురుస్తుండడం, మరోవైపు రైస్‌మిల్లర్లు ధాన్యం సేకరణపై ససేమిరా అనడంతో కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా ఉండిపోతున్నాయి.

ఊపందుకున్న కొనుగోళ్లు
ధాన్యం రాశుల కుప్పలు

- రెండు రోజుల్లోనే 12వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు

- ప్రతిరోజూ 6 వేల టన్నులు కొనుగోళ్లు చేస్తున్న అధికారులు

- జిల్లాలో ఇప్పటి వరకు 90వేల 130 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

- 344 కొనుగోలు కేంద్రాలకు గాను 340 ప్రారంభం

- ఎదురవుతున్న ట్రాన్స్‌పోర్ట్‌ సమస్యలు

- కేంద్రాల వద్ద పేరుకుపోతున్న ధాన్యం కుప్పలు


కామారెడ్డి, మే 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాలకు  దండిగా ధాన్యం తరలివస్తోంది. ఓ వైపు అకాల వర్షాలు కురుస్తుండడం, మరోవైపు రైస్‌మిల్లర్లు ధాన్యం సేకరణపై ససేమిరా అనడంతో కేంద్రాల్లో ధాన్యం రాశులు కుప్పలు కుప్పలుగా ఉండిపోతున్నాయి. .కేవలం రెండు రోజుల వ్యవధిలోనే 12వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారంటే రైతులు వరి రాసులను కేంద్రాలకు ఎంతమేర తరలిస్తున్నారో తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 90వేల 130 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 344 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 340 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. పౌర సరఫరాల అధికారులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ సంబంఽధిత శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుండడంతో కొనుగోళ్లు వేగవంతం అయ్యేలా చూస్తున్నారు.

344 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జిల్లాలో యాసంగి సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్ల కోసం 344 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. వరి కోతలు ఊపందుకోవడంతో జిల్లా వ్యాప్తంగా 340 కోనుగోలు కేంద్రాలను అధికారులు ప్రారంభించారు. కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, బాన్సువాడ, బీర్కూర్‌, బిచ్కుంద, ఎల్లారెడ్డి, లింగంపేట్‌, నాగిరెడ్డిపేట్‌ తదితర మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఈ కేంద్రాలకు  రైతులు పెద్ద మొత్తంలో ధాన్యాన్ని తరలిస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఐకేపీ, ప్రాథమిక సహకార సంఘాలు, మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను గ్రామగ్రామాన ఏర్పాటు చేశారు. ధాన్యం సేకరణకు జిల్లాకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా వచ్చిన ధాన్యాన్ని వెనువెంటేనే కొనుగోలు చేసేందుకు స్థానికంగా అవసరమైన సామగ్రి అయిన లారీలు, తేమ శాతం కొలిచే యంత్రాలు, ఎలక్ర్టానిక్‌ కాంటాలు, గన్నీ సంచులను అందుబాటులో ఉంచారు.

ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు

జిల్లాలో ఇప్పుడిప్పుడే వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఎక్కడ అకాల వర్షాలు పడుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై దాదాపు 20 రోజులు గడుస్తున్నా  అకాల వర్షాలతో రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తరలించలేకపోయారు. గత వారం రోజుల వ్యవధిలోనే భారీ మొత్తంలో వరి ధాన్యం కేంద్రాలకు రైతులు తరలిస్తున్నారు. ఈ రెండు రోజుల వ్యవధిలోనే జిల్లా వ్యాప్తంగా 12వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారంటే కేంద్రాలకు వరి రాశులు ఎంత మేర వస్తున్నాయో అర్థమవుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన 340 కొనుగోలు కేంద్రాల నుంచి  90వేల 130 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 14వేల 800మంది రైతుల నుంచి రూ.180 కోట్ల విలువ చేసే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పౌర సరఫరాలశాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 8వేల మంది రైతుల ఖాతాలో రూ.90 కోట్లు ధాన్యం డబ్బులను జమ చేశారు. ప్రతిరోజూ 6 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మిల్లర్ల స్ట్రైక్‌తో కేంద్రాల్లోనే ధాన్యం

జిల్లాలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. గత 20 రోజుల నుంచి 340 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేపడుతున్నారు. అయితే మూడు రోజుల కిందట ఓ రైస్‌మిల్లులో రైతులు ఆందోళన చేశారు. దీంతో మిల్లర్లు తమకు రక్షణ కల్పించాలని ధాన్యంను తీసుకుపోకుండా సమ్మె నిర్వహించారు. దీంతో గత మూడు రోజులుగా కేంద్రాల నుంచి వెళ్లే ధాన్యాన్ని మిల్లర్లు దింపుకోవడం లేదు. దీంతో మిల్లుల వద్ద ధాన్యం లోడ్‌లతో లారీ బారులు తీరుతున్నాయి. అధికారులు మిల్లర్లతో సంప్రదింపులు జరిపి ధాన్యం తీసుకోవాలని ఆదేశించడంతో శనివారం నుంచి మిల్లర్లు ధాన్యాన్ని తీసుకుంటున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ఽధాన్యాన్ని జిల్లా యంత్రాంగం 165 రైస్‌మిల్లులకు కేటాయించారు. ఈ యాసంగిలో ఎఫ్‌సీఐ కేవలం రా రైస్‌ మాత్రమే తీసుకుంటామని చెప్పడంతో మిల్లర్లు రా రైస్‌నే తిరిగి ఇవ్వనున్నారు. అయితే అకాల వర్షాలు పడిన ప్పుడే పెద్ద సమస్య తలెత్తనుంది. తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలని రైతుల నుంచి డిమాండ్‌ వచ్చే అవకాశం ఉంది. రా రైస్‌ నేపథ్యంలో మిల్లర్లు తడిసిన ధాన్యాన్ని తీసుకునే అవకాశం లేదు. దీంతో ఇక్కడే సమస్య తలెత్తే అవకాశం ఉంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.


ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తున్నాం

- జితేందర్‌ ప్రసాద్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 90వేల మెట్రిక్‌ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశాం. కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. రైతులు సైతం నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలి. రైతుల ఖాతాలాకు ధాన్యం డబ్బులు త్వరగా వేసేలా చూస్తున్నాం. 

Updated Date - 2022-05-15T06:03:57+05:30 IST